Munugode Bypoll: మా గ్రామానికి ఏం చేశారో చెప్పండి.. ప్రచారంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి నిరసన సెగ..
ఓ వైపు ప్రచారం..మరోవైపు నిరసన సెగలు..! మునుగోడులో బీజేపీ ప్రచారంలో వరుసగా ఇలాంటి దృశ్యలే కనిపిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని టీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా, మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం మండలంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పలుగ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయనతోపాటు దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు కూడా ఎన్నికల ప్రచారం చేశారు. కోతులాపురం, గుడిమల్కాపురం ,గుజ్జ గ్రామాల్లో మహిళలు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్‌గోపాల్‌రెడ్డి, రఘునందన్‌రావు టీఆర్‌ఎస్ పాలనతీరుపై మండిపడ్డారు. అధికారంలో ఉన్న ఆ పార్టీ మునుగోడు అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి పలు గ్రామాల్లో నిరసన సెగ తగిలింది. గుజ్జా గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు.
ఇదే మండలంలోని కోతులాపురం గ్రామంలోనూ నిరసన సెగ తగిలింది. రాజగోపాల్‌రెడ్డి, రఘునందన్‌రావు గో బ్యాక్ అంటూ టీఆర్‌ఎస్-కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామానికి ఏం చేశారో చెప్పాలని నినాదాలు చేశారు.
దీంతో రాజగోపాల్‌రెడ్డి ప్రచారం చేయకుండానే వెనుదిరిగారు. ఇక చౌటుప్పల్ మండలం అల్లాపురం గ్రామంలో బీజేపీ ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలోకి రావొద్దని, రాజగోపాల్‌రెడ్డిని వెనక్కి పంపించేశారు గ్రామస్తులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..