Lasya Nanditha: లాస్యను బలి తీసుకున్న కారు ప్రమాదానికి అసలు కారణమేంటి? మిస్టరీ కోణం ?
అధికార లాంఛనాలతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత అంత్యక్రియలు ముగిశాయి. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్.. లాస్యనందిత భౌతికకాయానికి నివాళి అర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. అయితే లాస్య మరణంలో మిస్టరీ కోణం కూడా కనిపిస్తోంది.

37 ఏళ్లకే నూరేళ్లు నిండాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కన్నుమూశారన్న వార్త.. ఆమె నియోజకవర్గంలోనే కాదు.. తెలంగాణ యావత్తూ విషాదాన్ని నింపింది. లాస్య మరణం ఎలా సంభవించింది.. ఆమెను బలితీసుకున్న కారు ప్రమాదానికి అసలు కారణమేంటి? ప్రమాద సమయంలో ఆమెతో ఉన్న ఆకాష్ ఎవరు? ఇలా లాస్య విషాదం నుంచిు మిస్టరీ కోణం వెలుగుచూస్తోంది.
కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న నేత జ్ఞాని సాయన్న. ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని.. ఫస్ట్‌టైమ్ పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకెళ్లింది లాస్య నందిత. కానీ.. విధి ఆమె జీవితంతో ఆడుకుంది. ఈ తెల్లవారుఝామున ORR సమీపంలో సదాశివపేట దగ్గర జరిగిన రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది లాస్య నందిత. అతి వేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.
గురువారం రాత్రి 1.30కి కంటోన్మెంట్‌లోని తన ఇంటి నుండి బయలుదేరింది లాస్య కుటుంబం. షామీర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా సదాశివపేటకు ప్రయాణించారు. సదాశివపేటలోని దర్గాలో పూజాలు నిర్వహించి.. ఉదయం 3 గంటలకు మూసాపేట్‌లో కుటుంబ సభ్యులను డ్రాప్ చేసింది లాస్య. బోయిన్‌పల్లి వైపు వెళ్లి.. మళ్లీ ఔటర్ రింగ్‌రోడ్ ఎక్కింది లాస్య వాహనం. ORT సుల్తాన్‌పూర్ వద్ద ఉదయం 5 గంటల 20 నిమిషాలకు లాస్య కారుకు ప్రమాదం జరిగింది. సిటీ లోపలికి వచ్చి మళ్లీ అవుటర్ రింగు రోడ్డు మీదికి ఎందుకు వెళ్లారు అనేది మిస్టరీగా మారింది.
డ్రైవర్ నిద్ర మత్తులో కారు నడిపినట్టు చెబుతున్నారు పోలీసులు. ప్రమాద సమయంలో కారు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతోందని, మొదట ఒక భారీ వాహనాన్ని ఢీకొట్టి, అదుపుతప్పి రెయిలింగ్ మీద పడిందని చెబుతున్నారు. లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారు ముందు అద్దాలు పగిలిపోయాయి. ఇంత ప్రమాదం జరిగినా, లారీని ఆపకుండా వెళ్లిపోయాడు డ్రైవర్. సెకండ్ లేన్లో ఉండాల్సిన కారు ఫోర్త్ లేన్‌లోకి వెళ్లడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
ప్రమాద సమయంలో ఇద్దరూ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. ముందు సీటు ఎడమవైపు కూర్చున్న లాస్య సీటు నుండి ముందుకు పడటంతో తలకు బలమైన గాయమైంది. డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆకాష్‌కు కాలు ఫ్రాక్చర్ అయింది. సిటీ లోపలికి వచ్చి.. కుటుంబీలను ఇంట్లో దింపి.. మళ్లీ అవుటర్ రింగు రోడ్డు మీదికి ఎందుకు వెళ్లారు అనేది మిస్టరీగా మారింది. ప్రమాద సమయంలో లాస్యతో ఉన్న ఆకాశ్ ఎవరు? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఆకాష్ లాస్య కుటుంబంలో ఒకరిగా మెలిగేవాడు. ఎన్నికల్లో లాస్య గెలిచినప్పుడు కంగ్రాట్స్ అక్క అంటూ పోస్ట్ పెట్టాడు. రెండు మూడు నెలలుగా లాస్య దగ్గర ఆకాష్ పిఏగా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆకాష్‌కి మియాపూర్ శ్రీకర ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. అతడిని పూర్తిగా విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే వీలుంది. కాగా ఈ ప్రమాదంపై నందిత సోదరి నివేదిత పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఉదయం 5 గంటల 15 నిమిషాలకు ఆకాష్ ఫోన్ చేశాడని.. ఇద్దరికీ దెబ్బలు తగిలాయని లోకేషన్ షేర్ చేసినట్లు పేర్కొన్నారు. అక్కడికి వెళ్లి చూడగా కారు నుజ్జునుజ్జై ఉందని తెలిపారు. దీంతో ఆకాష్‌పై 304 ఏ సెక్షన్ కింద పటాన్ చెరు పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది.
ఏడాది కిందటే తండ్రిని కోల్పోయింది.. ఇప్పుడు తానే వెళ్లిపోయింది. ఎమ్మెల్యే లాస్య అకాలమరణంతో ఆమె ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు MLC కవిత. కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పోటెత్తారు స్థానికులు. ప్రముఖుల నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.
లాస్య నందితను మృత్యుగండాలు వెంటాడాయి. ఇటీవలి కాలంలోనే మూడుసార్లు ఆమెకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఒకసారి లిఫ్టులో ఇరుక్కుంది. నల్గొండలో ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఈసారి మళ్లీ కారుప్రమాదం మృత్యువు రూపంలో ఆమెను కబళించింది. ఎందుకలా..? ఆమె జాతకంలో ప్రమాదాలున్నాయా? అని అనే చర్చ జరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
