ఖర్గే కోర్టులో తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ..! అసలు మంత్రిని తప్పించిన చరిత్ర ఉందా?
మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర రాజకీయ చర్చకు దారితీస్తోంది. క్రమశిక్షణా కమిటీ చర్యలకు సిఫారసు చేసిన నేపథ్యంలో తుది నిర్ణయం ఏఐసీసీ చేతుల్లోకి వెళ్లింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసలు వివాదం ఏంటి? సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? తెలంగాణలో కాంగ్రెస్ మంత్రిని తప్పించిన చరిత్ర ఉందా? బీసీ రాజకీయాల ప్రభావం ఎంత? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

గాంధీభవన్ నుంచి బెంగళూరు వరకు.. తెలంగాణ కాంగ్రెస్‌లో సురేఖ ఎపిసోడ్ కాక రేపుతోంది. మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణా కమిటీ చర్యలకు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం ఏఐసీసీదేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఖర్గేతో భేటీ కావడం హాట్‌టాపిక్‌గా మారింది. తెలంగాణ టు ఢిల్లీ.. వయా బెంగళూరు.. తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అసలు వివాదం ఏంటి?
కొండా సురేఖ కుటుంబం చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. సీఎం రేవంత్‌రెడ్డిపై వచ్చిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి. సురేఖ వాటిని ఖండించలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో క్రమశిక్షణా కమిటీ రంగంలోకి దిగింది. సురేఖతో పాటు మరో సీనియర్ నేత జి.చిన్నారెడ్డిపై కూడా చర్యలకు సిఫారసు చేసిందని సమాచారం వస్తోంది. ఇక తుది నిర్ణయం అధిష్ఠానం చేతుల్లోకి వెళ్లింది.
ఇది సురేఖ ఒక్కరి వ్యవహారమేనా?
ఇక్కడే అసలు రాజకీయ చర్చ మొదలైంది. ఇది కేవలం వ్యక్తుల మధ్య వివాదమా లేక తెలంగాణ కాంగ్రెస్‌లో పవర్ బ్యాలెన్స్ మారుతోందా అనే వాదన వచ్చింది. ఉమ్మడి వరంగల్‌లోని పాత విభేదాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. కొండా సురేఖ, కొండా మురళీకి.. అక్కడి కాంగ్రెస్ నేతలతో విభేదాలు కొత్త కాదు. గతంలోనూ కొండా మురళీ పార్టీ అంతర్గత అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ పాత విభేదాలకు కొత్త వివాదం తోడైందన్న చర్చ జరుగుతోంది.
సురేఖకు వివాదాలు కొత్త కాదు
కొండా సురేఖ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2024లో కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో సమంత, నాగచైతన్య అంశాన్ని ప్రస్తావించారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తర్వాత సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పారు. అయితే ఆ వివాదం రాజకీయ ప్రత్యర్థులపై విమర్శల వరకే పరిమితమైంది. ఇప్పుడు పరిస్థితి వేరు. ఈసారి వ్యవహారం నేరుగా పార్టీ, ప్రభుత్వం, సీఎం, పీసీసీ నాయకత్వం వరకు వెళ్లింది.
ఇంతకంటే ఘాటుగా మాట్లాడిన వాళ్లు లేరా?
కాంగ్రెస్‌లో విమర్శలు కొత్త కాదు. సీఎం, పీసీసీ చీఫ్‌లపై గతంలోనూ సొంత పార్టీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. భిన్నాభిప్రాయాలు కూడా కాంగ్రెస్‌లో ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ప్రతి వ్యాఖ్యకు చర్య ఉండదు. సందర్భం ఏంటి? పార్టీకి నష్టం ఎంత? వ్యాఖ్యలు ఎవరిపై? పార్టీ లైన్ దాటారా? అన్నదే కీలకం. సురేఖ విషయంలో గీత ఎక్కడ గీస్తారనే ఆసక్తికరంగా మారింది.
మంత్రిని తప్పించిన చరిత్ర ఉందా?
తెలంగాణలో 2014 నుంచి 2023 వరకు కాంగ్రెస్ అధికారంలో లేదు. 2023లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి వివాదాస్పద వ్యాఖ్యలతో కాంగ్రెస్ మంత్రిని కేబినెట్ నుంచి తప్పించిన స్పష్టమైన పాత ఉదాహరణ తెలంగాణలో కనిపించదు.
అందుకే సురేఖపై నిర్ణయం కీలకం.. చర్య తీసుకుంటే.. క్రమశిక్షణ విషయంలో పార్టీ కఠినంగా ఉందన్న సంకేతం వెళ్తుంది. చర్య తీసుకోకపోతే.. సిఫారసులపై వెనక్కి తగ్గారన్న విమర్శ రావచ్చు.
బీసీ కార్డు ఎందుకు?
సురేఖ వ్యవహారంలో బీసీ రాజకీయాలు కూడా తెరపైకి వచ్చాయి. తనపై చర్యల చర్చ సమయంలో బీసీ ప్రాతినిధ్యం అంశం ప్రాధాన్యం పొందింది. అయితే రెండు అంశాలను వేరు చేయాల్సిందే. బీసీ ప్రాతినిధ్యం ఒక రాజకీయ అంశం. పార్టీ క్రమశిక్షణ మరో అంశం. బీసీ కార్డు రాజకీయంగా బలం ఇవ్వొచ్చు. కానీ క్రమశిక్షణపై పార్టీ నిర్ణయం మాత్రం దాని ఆధారంగా మాత్రమే ఉండకపోవచ్చు. అదే సమయంలో సామాజిక సమీకరణాలను విస్మరించడం కూడా కాంగ్రెస్‌కు అంత సులభం కాదు.
భట్టి భేటీ ఎందుకు కీలకం?
భట్టి విక్రమార్క.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ కావడంతో చర్చ మరింత పెరిగింది. సురేఖ వ్యవహారంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితులపై భట్టి వివరించారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి వరంగల్ పరిస్థితులు.. ఎమ్మెల్యేలు, విప్‌ల అసంతృప్తి.. పార్టీ, ప్రభుత్వంపై ప్రభావం.. వంటి అంశాలు చర్చకు వచ్చాయంటున్నారు. అయితే భట్టి ఖర్గేతో ఏం మాట్లాడారన్నది అధికారికంగా వెల్లడికాలేదు. అందుకే ఇవన్నీ ప్రస్తుతం పార్టీ వర్గాల సమాచారం, రాజకీయ అంచనాలుగానే చూడాలి.
అసలు టార్గెట్ సురేఖేనా?
ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. సురేఖపై చర్య అనేది ఒక్క మంత్రి వ్యవహారంగా కనిపించినా.. దాని ప్రభావం చాలా దూరం వెళ్లొచ్చు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వం. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ వైఖరి. మంత్రుల మధ్య సమన్వయం. వరంగల్ రాజకీయాలు. బీసీ సమీకరణాలు అన్నీ ఇందులో కలుస్తున్నాయి. అందుకే ఈ నిర్ణయం సురేఖ భవిష్యత్తుతో పాటు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ దిశను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
చర్య తీసుకుంటే.. తీసుకోకపోతే?
సురేఖపై కఠిన చర్య తీసుకుంటే పార్టీ క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని కాంగ్రెస్ చెప్పొచ్చు. కానీ వరంగల్‌లో అసంతృప్తి పెరగొచ్చు. బీసీ రాజకీయాలపైనా చర్చ పెరగొచ్చు. చర్య తీసుకోకపోతే పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫారసును ఎందుకు పక్కన పెట్టారన్న ప్రశ్న వస్తుంది. ఇతర నేతలకు కూడా తప్పుడు సంకేతం వెళ్తుందన్న విమర్శలు రావొచ్చు.
ఫుల్‌స్టాప్ ఎక్కడ?
ఇప్పుడు పంచాయితీ గాంధీభవన్ దాటి అధిష్ఠానం వరకు వెళ్లింది. ఖర్గే స్థాయిలో చర్చకు వచ్చింది. కేసీ వేణుగోపాల్ తిరిగి వచ్చిన తర్వాత తుది నిర్ణయం ఉండొచ్చన్న ప్రచారం కూడా ఉంది. మంత్రి పదవి నుంచి తొలగిస్తారా? పార్టీ పరంగా మాత్రమే చర్య తీసుకుంటారా? లేక చివరకు సర్దుబాటు చేస్తారా అనే ఉత్కంఠకు తెరపడనుంది.
ఈ క్రమంలోనే.. ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కొండా సురేఖ ఫొటో లేకపోవడం ఇప్పుడు మరో సంచలనంగా మారింది. మొత్తంగా ఇది కొండా సురేఖ వర్సెస్ కాంగ్రెస్ అన్నంత సింపుల్ వ్యవహారం కాదు. పార్టీ క్రమశిక్షణ. ప్రభుత్వ ప్రతిష్ఠ. వరంగల్ రాజకీయాలు. బీసీ సమీకరణాలు. నాయకత్వ బలం అన్నీ ఇందులో ఉన్నాయి. సురేఖ ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ గాంధీభవన్‌లో పడుతుందా? బెంగళూరులో ఖర్గే నిర్ణయంతో పడుతుందా? లేక ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాల తర్వాతే పంచాయితీ ముగుస్తుందా అన్నది వేచి చూడాలి.
-కొండవీటి శివనాగరాజు, డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్, టీవీ9.
