AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌ ట్రాఫిక్, కాలుష్యానికి చెక్.. నగరానికి నలువైపులా కొత్త బస్ టెర్మినల్స్.. కీలక ప్రకటన చేసిన మంత్రి పొన్నం!

Hyderabad: హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా రవాణా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగరంలోకి వచ్చే దూరప్రాంత, అంతర్‌జిల్లా, అంతర్రాష్ట్ర బస్సులను నగర శివార్లలోని టెర్మినల్స్ వద్దే నిలిపి, అక్కడి నుంచి సిటీ..

Hyderabad: హైదరాబాద్‌ ట్రాఫిక్, కాలుష్యానికి చెక్.. నగరానికి నలువైపులా కొత్త బస్ టెర్మినల్స్.. కీలక ప్రకటన చేసిన మంత్రి పొన్నం!
New Bus Terminals
Subhash Goud
|

Updated on: Sep 15, 2026 | 4:51 PM

Share

Hyderabad: హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ నగరానికి నలువైపులా ఆధునిక బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వైపు నుంచి హైదరాబాద్‌లోకి వచ్చే దూరప్రాంత, అంతర్‌ జిల్లా, అంతర్రాష్ట్ర బస్సులను నగరంలోని అంతర్గత ప్రాంతాల్లోకి రాకుండా ఆయా దిశల్లో ఏర్పాటు చేసే టెర్మినల్స్ వరకు మాత్రమే నడిపించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

విమానాశ్రయం వైపు వెళ్లే బస్సులు, హైదరాబాద్‌కు వచ్చే అంతర్‌జిల్లా బస్సులు కూడా అవసరాన్ని బట్టి నిర్దేశిత టెర్మినల్స్ వద్దే నిలిపి, అక్కడి నుంచి ప్రయాణికులను నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలించే విధంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు. టెర్మినల్స్ నుంచి ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేలా సిటీ ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలను సమన్వయం చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. దీంతో నగరంలోకి వచ్చే ప్రయాణికులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రజా రవాణా అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు.

ప్రైవేట్‌ బస్సుల ఇష్టానుసారం:

హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ బస్సులు ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడం, రాత్రి సమయాల్లో రోడ్లపైకి పెద్ద సంఖ్యలో రావడం వల్ల ట్రాఫిక్ రద్దీతో పాటు కాలుష్యం కూడా పెరుగుతోందని మంత్రి తెలిపారు.ఈ సమస్యకు పరిష్కారంగా ప్రైవేట్ బస్సులను కూడా నిర్దేశిత బస్ టెర్మినల్స్ ద్వారా నిర్వహించే విధానంపై ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. అవసరమైన నిబంధనల మేరకు యూజర్ ఛార్జీలు వసూలు చేస్తూ టెర్మినల్స్‌ను వినియోగించుకునే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ దూరప్రాంత బస్సులు నగరంలోని రద్దీ ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా టెర్మినల్స్ వరకు మాత్రమే నడిపించే విధానం అమలులోకి వస్తే నగర ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

బస్ టెర్మినల్స్ ఏర్పాటుకు అవసరమైన భూమి విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.గాజులరామారం ప్రాంతంలో సుమారు 100 ఎకరాలు, శంషాబాద్ వైపు సుమారు 150 ఎకరాల భూమిని బస్ టెర్మినల్ అవసరాలకు కేటాయించే అంశంపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని టెర్మినల్స్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడంతో పాటు, ప్రయాణికులకు వేచి ఉండే ప్రదేశాలు, పార్కింగ్, కనెక్టివిటీ తదితర సౌకర్యాలను కల్పించేలా ప్రణాళిక రూపొందించనున్నట్లు మంత్రి తెలిపారు.

2,200 ఎలక్ట్రిక్ బస్సులతో ప్రజా రవాణాకు మరింత బలం

హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రానున్న 2,200 ఎలక్ట్రిక్ బస్సులను సమర్థవంతంగా వినియోగించనున్నట్లు మంత్రి తెలిపారు.కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలకు మెరుగైన సిటీ బస్ కనెక్టివిటీ కల్పించడంతో పాటు, బస్ టెర్మినల్స్ నుంచి నగరంలోని ప్రతి ప్రాంతానికి ప్రయాణికులు సులభంగా చేరుకునేలా రూట్లను రూపొందించనున్నట్లు తెలిపారు. టెర్మినల్ ఆధారిత ప్రజా రవాణా వ్యవస్థతో నగరంలోకి వచ్చే బస్సుల సంఖ్యను నియంత్రించడంతో పాటు, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ప్రజా రవాణా మార్గాలను అందుబాటులోకి తీసుకురావచ్చన్నారు.

ట్రాఫిక్, కాలుష్య నియంత్రణకు కీలక అడుగు

హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా రవాణా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగరంలోకి వచ్చే దూరప్రాంత, అంతర్‌జిల్లా, అంతర్రాష్ట్ర బస్సులను నగర శివార్లలోని టెర్మినల్స్ వద్దే నిలిపి, అక్కడి నుంచి సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే విధానం వల్ల నగరంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు వాహన కాలుష్యం కూడా తగ్గుతుందని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌ను మరింత సుస్థిరమైన, సమర్థవంతమైన ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: DMartలో షాపింగ్ చేసేవారికి అదిరిపోయే టిప్స్‌.. ఈ 7 టిప్స్‌ తెలిస్తే చాలు మరింత సేవింగ్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us