AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విహారయాత్రలో విషాదం.. స్నేహితుల కళ్ల ముందే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతు!

పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో విహారయాత్రకు వచ్చిన విజయవాడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నీలేష్ సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద వరద ప్రవాహంలో గల్లంతయ్యాడు. స్నేహితుల కళ్లముందే ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వర్షాలు, వరదల నేపథ్యంలో పర్యాటకులు వాగులు, నదీ ప్రవాహాల వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

విహారయాత్రలో విషాదం.. స్నేహితుల కళ్ల ముందే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతు!
Software Employee Drowned
Balaraju Goud
|

Updated on: Sep 15, 2026 | 4:36 PM

Share

పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. విహారయాత్రకు వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వరద ప్రవాహంలో గల్లంతయ్యాడు. స్నేహితుల కళ్ల ముందే యువకుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. గల్లంతైన వ్యక్తిని విజయవాడకు చెందిన నీలేష్‌గా గుర్తించారు.

హైదరాబాద్‌ నుంచి పలువురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు విహారయాత్ర కోసం చింతూరు, మారేడుమిల్లి ప్రాంతానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులోని సోకిలేరు వ్యూ పాయింట్‌ వద్దకు చేరుకున్న ఆరుగురు స్నేహితులు అక్కడ స్నానానికి దిగారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో సోకిలేరు ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది.

నీటి ప్రవాహం ఉధృతంగా మారడంతో ఆరుగురూ ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నీలేష్‌ సహా కొందరు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి ఐదుగురిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. అయితే నీలేష్‌ మాత్రం వరద ప్రవాహంలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో నదీ ప్రవాహంలో నీలేష్‌ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. విహారయాత్రలో సరదాగా గడిపేందుకు వచ్చిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల బృందంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. స్నేహితుడిని కళ్ల ముందే వరద ప్రవాహం తీసుకెళ్లడంతో మిగిలిన వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

మరోవైపు వర్షాలు, వరదల నేపథ్యంలో జలపాతాలు, వాగులు, నదీ ప్రవాహాల వద్దకు వెళ్లే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నీటి ప్రవాహం సాధారణంగా కనిపించినప్పటికీ ఒక్కసారిగా ఉధృతంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నీలేష్‌ ఆచూకీ కోసం పోలీసులు, స్థానికులు గాలింపు కొనసాగిస్తున్నారు. యువకుడి ఆచూకీ లభించిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us