AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1980s ట్రెండ్.. అప్పట్లో కుర్రాళ్ల మతిపోగొట్టిన క్రేజీ బైక్స్ ఇవే.. ధర తెలిస్తే అవాక్కే..

కాలం మారుతున్నా 80ల నాటి వింటేజ్ బైకుల క్రేజ్ మాత్రం నేటికీ చెక్కుచెదరలేదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ గంభీరమైన శబ్దం, యమహా ఆర్‌ఎక్స్ పికప్ నాటి యువతను ఉర్రూతలూగించాయి. మరి నాలుగు దశాబ్దాల క్రితం ఈ లెజెండరీ బైకులు ఏ ధరకు లభించేవి? నేటి లక్షల రూపాయల విలువతో పోలిస్తే అప్పట్లో మార్కెట్ ఎలా ఉండేదో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1980s ట్రెండ్.. అప్పట్లో కుర్రాళ్ల మతిపోగొట్టిన క్రేజీ బైక్స్ ఇవే.. ధర తెలిస్తే అవాక్కే..
Iconic Bikes Of The 1980sImage Credit source: AI Image
Krishna S
|

Updated on: Sep 15, 2026 | 4:15 PM

Share

ప్రస్తుతం ఎక్కడ చూసిన 1980 ట్రెండ్ నడుస్తుంది. సోషల్ మీడియాలో అప్పటి ఫొటోలతో హోరెత్తుతుంది. ఈ క్రమంలో చాలా మంది మళ్లీ ఆ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో అప్పట్లో మార్కెట్లో అడుగుపెట్టిన పలు బైకులు కుర్రకారు మతిపోగొట్టాయి. అవును.. ఫ్యాషన్, సినిమా, సంగీతం మాత్రమే కాదు.. ఆటోమొబైల్ ప్రపంచంలోనూ ఇప్పుడు 80ల నాటి వింటేజ్ క్రేజ్ మళ్లీ ఊపందుకుంది. నేటి యువత క్లాసిక్, రెట్రో మోడల్ బైకుల వైపు ఎంతగానో ఆకర్షితులవుతున్నారు. అయితే ప్రస్తుత తరం బైక్ కొనాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం.. అంటే 1980లలో రోడ్లపై రారాజులుగా వెలుగొందిన దిగ్గజ బైకుల ధరలు ఎలా ఉండేవో తెలుసా? ఆనాటి ముచ్చట్లను ఒకసారి నెమరువేసుకుందాం.

రోడ్లపై రారాజులు.. నాటి యువత కలల వాహనాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 : 80లలో బుల్లెట్ శబ్దం వినిపిస్తే రోడ్డుపై అందరూ తిరిగి చూసేవారు. రాజసానికి, గాంభీర్యానికి ప్రతీకగా నిలిచిన నాటి బుల్లెట్ 350 ధర సుమారుగా రూ.18,000 నుంచి రూ.22,000 మధ్య ఉండేది. నేడు లక్షల రూపాయలు పలికే ఈ బైక్, ఆనాడు ధనికులకు, ఆర్మీ అధికారులకు ప్రత్యేక హోదా తెచ్చిపెట్టేది.

యమహా ఆర్డీ 350 : 1983లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ 2 స్ట్రోక్ ట్విన్ సిలిండర్ బీస్ట్, స్పీడ్ ప్రియులకు కలల వాహనం. అప్పట్లో దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.18,000 నుంచి రూ.20,000 వరకు ఉండేది.

యమహా ఆర్ఎక్స్ 100 : 1985 నవంబర్‌లో మార్కెట్లోకి వచ్చిన యమహా ఆర్‌ఎక్స్ 100 భారత టూ వీలర్ చరిత్రను తిరగరాసింది. దాని ప్రత్యేకమైన ఎగ్జాస్ట్ సౌండ్, పికప్‌తో కుర్రకారును ఉర్రూతలూగించింది. 80ల చివర్లో ఈ బైక్ ప్రారంభ ధర సుమారు రూ.19,000 నుంచి రూ.21,000 మధ్యలో ఉండేది.

హీరో హోండా సీడీ 100 : ఫిల్ ఇట్, షట్ ఇట్, ఫర్గెట్ ఇట్ అనే నినాదంతో 1985లో వచ్చిన ఈ 4 స్ట్రోక్ బైక్ మధ్యతరగతి కుటుంబాలను అమితంగా ఆకట్టుకుంది. తిరుగులేని మైలేజీతో సంచలనం సృష్టించిన సీడీ 100 ప్రారంభ ధర దాదాపు రూ.15,000 నుంచి రూ.18,000 మధ్య ఉండేది.

టీవీఎస్ సుజుకి ఏఎక్స్ 100 : భారత జపనీస్ భాగస్వామ్యంలో వచ్చిన తొలి లైట్ వెయిట్ 100సీసీ బైకుల్లో ఇది ఒకటి. 1984-85 ప్రాంతంలో దీని ధర సుమారు రూ.14,000 నుంచి రూ.16,000 వరకు ఉండేది.

యెజ్డీ – జావా : ది ఫరెవర్ బైక్‌గా పేరొందిన యెజ్డీ రోడ్‌కింగ్ నాటి రఫ్ అండ్ టఫ్ యువతకు ఫేవరెట్ ఛాయిస్. 80ల కాలంలో దీని ధర సుమారు రూ.12,000 నుండి రూ.15,000 మధ్య లభించేది.

నాటి రూ.20,000.. నేటి రూ.2.5 లక్షలతో సమానం

నేటి కాలంలో బైక్ ధర రూ.15 వేలు అంటే నమ్మడం కష్టంగా తోచవచ్చు. కానీ 1980లలో ప్రభుత్వ ఉద్యోగుల లేదా బ్యాంకు ఉద్యోగుల సగటు నెల జీతం రూ.1000 నుంచి రూ.2,000 లోపే ఉండేది. ఆ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. ఒక బైక్ కోసం రూ.15 వేల నుంచి రూ.20 వేల ఖర్చు చేయడం అనేది ఒక పెద్ద జీవితకాల పెట్టుబడి.

ఆ గౌరవమే వేరు..

ఇంటి ముందు ఒక బుల్లెట్ లేదా యమహా బైక్ ఉందంటే ఆ కుటుంబానికి ఊరిలో ప్రత్యేక గౌరవం ఉండేది. వాహనం బుక్ చేసుకున్నాక డెలివరీ కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. నేడు ఆధునిక టెక్నాలజీ, ఏబీఎస్, డిజిటల్ మీటర్లతో కూడిన రెట్రో స్టైల్ బైకులు మార్కెట్లో సందడి చేస్తున్నప్పటికీ, 1980ల నాటి ఆ 2 స్ట్రోక్ పొగ, ఆ విలక్షణమైన శబ్దం, ఆనాటి వింటేజ్ ఫీల్ మాత్రం వాహన ప్రియుల గుండెల్లో ఎప్పటికీ ప్రత్యేకమే.

Follow Us