Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Komatireddy Raj Gopal Reddy: బీజేపీకి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటన..

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం అయింది. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కెసిఆర్ కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది.

Komatireddy Raj Gopal Reddy: బీజేపీకి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటన..
Komatireddy Rajagopal Reddy
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 25, 2023 | 1:26 PM

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం అయింది. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ‘‘కెసిఆర్ కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బిజెపి, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను భావిస్తున్నారు. అందుకే నేను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను.

తెలంగాణలో అవినీతి అరాచక నియంతృత్వ కుటుంబ పాలనకు చరమగీతం పాడే శక్తి భారతీయ జనతా పార్టీకే ఉందని భావించి 15 నెలల క్రితం నేను మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన విషయం అందరికి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ నెలాఖరున మునుగోడు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమీషా, బిజెపి జాతీయ అధ్యక్షులు నడ్డా ఆశీస్సులతో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి అధికార బీఆర్ఎస్ ను ఓడించినంత పని చేశాను. ఒక రాజకీయ యుద్ధం మాదిరిగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ 100 మంది ఎమ్మెల్యేలు మరో వంద మంది ఇతర సీనియర్ నేతలను ప్రచారంలోకి దింపి వందల కోట్లు ఖర్చు చేసి, భారీ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పటికీ, స్వల్ప తేడాతో నెగ్గి, నైతికంగా ఓడింది. మునుగోడు ఉప ఎన్నికల్లో నా విజయం కోసం ప్రయత్నించిన బిజెపి నేతలు కార్యకర్తలు శ్రేయోభిలాషులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.

అవినీతిలో మునిగిన కేసీఆర్ సర్కారుపై కేంద్రం చర్యలు తీసుకుంటుందన్న తెలంగాణ ప్రజల కోరిక నెరవేరకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయి. అధికార బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదగలేక పోవడంతో ఆ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చింది. సకల జనుల పోరాటంతో సాకారమైన ప్రత్యేక తెలంగాణ పదేళ్ల కెసిఆర్ సర్కారు అరాచక పాలనతో గాడి తప్పింది. అధికార మార్పును కోరుకుంటున్న తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నేను కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లోనే బిజెపికి రాజీనామా చేస్తున్నాను. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా నాకు నియంతృత్వ కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేసే అవకాశం కల్పించిన బిజెపికి ధన్యవాదాలు. కెసిఆర్ సర్కారుపై యుద్ధం చేయాలని ప్రోత్సహించిన కేంద్ర మంత్రి అమిత్ షాకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలంగాణ ప్రజల ఆలోచనల మేరకు పార్టీ మారాలని నేను తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి పెద్దలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

నాడు కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరినా, నేడు బిజెపి నుంచి కాంగ్రెస్ లోకి మారుతున్నా లక్ష్యం మాత్రం ఒకటే. కేసిఆర్ కుటుంబ అవినీతి, అరాచక, అప్రజాస్వామిక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే. నేను ఏనాడూ పదవుల కోసం ఆరాటపడలేదు, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసమే తపన పడ్డాను. నియంత కెసిఆర్ పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్ లో చేరుతున్న నన్ను ఆదరించాలని రాష్ట్ర ప్రజలని కోరుతున్నాను.’’ – అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..