Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అధిక విద్యార్హతలుంటే ఉద్యోగ అభ్యర్ధనకు అనర్హులుగా ఎలా పరిగణిస్తారు?’.. హైకోర్టు సందేహం

ఉద్యోగ అర్హతల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ప్రశ్న లేవనెత్తింది. తక్కువ విద్యార్హత కలిగిన ఉద్యోగానికి ఎక్కువ విద్యార్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చా? అనే విషయమై కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిని విచారణ సందర్భంలో కోర్టు ఈ ప్రశ్న లేవనెత్తింది. జాబ్‌ నోటిఫికేషన్‌లో ఇచ్చిన దానికంటే ఎక్కువ విద్యార్హత ఉన్నందున ఓ వ్యక్తి ఆ ఉద్యోగం కోసం దరఖాస్తు చేయకుండా నిరోధించవచ్చా? అనే విషయంపై వివరణ కోరుతూ..

'అధిక విద్యార్హతలుంటే ఉద్యోగ అభ్యర్ధనకు అనర్హులుగా ఎలా పరిగణిస్తారు?'.. హైకోర్టు సందేహం
Telangana High Court
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 25, 2023 | 11:00 AM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 25: ఉద్యోగ అర్హతల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ప్రశ్న లేవనెత్తింది. తక్కువ విద్యార్హత కలిగిన ఉద్యోగానికి ఎక్కువ విద్యార్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చా? అనే విషయమై కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిని విచారణ సందర్భంలో కోర్టు ఈ ప్రశ్న లేవనెత్తింది. జాబ్‌ నోటిఫికేషన్‌లో ఇచ్చిన దానికంటే ఎక్కువ విద్యార్హత ఉన్నందున ఓ వ్యక్తి ఆ ఉద్యోగం కోసం దరఖాస్తు చేయకుండా నిరోధించవచ్చా? అనే విషయంపై వివరణ కోరుతూ ఓ మహిళ తాజాగా రాష్ట్ర హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ (అటెండెంట్) జాబ్‌కు దరఖాస్తు చేసుకున్న ఆమెను ఇంటర్వ్యూకి పిలవకపోవడంపై సదరు మహిళ కోర్టును ఆశ్రయించింది. మహిళ అభ్యర్థనను విచారించిన ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, జస్టిస్ ఎన్‌వి శ్రవణ్ కుమార్‌లతో కూడిన బెంచ్ ముందుకు ఈ ప్రశ్న వచ్చంది

‘పదో తరగతి వరకు అర్హత కలిగిన ఉద్యోగం కోసం ఆమె దరఖాస్తు చేసుకుంది. కానీ ఆమె ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులు అదనంగా చదివింది. దీంతో ఆమెను ఇంటర్వ్యూకి పిలవలేదు. అయితే తాజాగా ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కోసం ఇతర అభ్యర్థులను కోర్టు సూపరింటెండెంట్ పిలిచారు. తనను మాత్రం ఎందుకు పిలవలేదని ఆమె పిటిషన్‌లో పేర్కొంది. దీనికి సమాదానంగా.. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 7వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అయితే 10వ తరగతి కంటే ఎక్కువ విద్యార్హతలు ఉండకూడదు. ప్రకటనలో ఇచ్చింది అటెండర్ పోస్టు. కాబట్టి ఉన్నత విద్యార్హత కలిగిన వ్యక్తులు అటెండర్ పోస్టు విధులు నిర్వహించడం కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా అధికారులు వారితో పని చేయించుకోవడం కష్టంగా ఉంటుంది. అందువల్ల ఈ నిర్ణయం వెనుక ఆచరణాత్మక అవరోదాలు ఉంటాయి’ అని హైకోర్టు తరపు స్టాండింగ్ కౌన్సెల్ స్వరూప్ వివరించారు. స్టాండింగ్ కౌన్సెల్ వాదనలను బెంచ్‌ తోసిపుచ్చింది. ఉన్నత విద్యార్హత కారణంగా ఒక వ్యక్తిని తిరస్కరించడం అన్యాయమని బెంచ్ వ్యాఖ్యానించింది.

పిటిషనర్‌ తరపు న్యాయవాది కొప్పుల శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఉన్నత విద్యార్హత ఉన్నవారిని తిరస్కరించడం అన్యాయం అని పిటిషనర్ ఎత్తి చూపుతున్నారు. 10వ తరగతి కంటే ఆమెకు ఎక్కువ విద్యార్హత పొందలేదు. ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షలకు హాజరయ్యింది, కానీ ఆ పరీక్షల్లో ఆమె ఉత్తీర్ణత పొందలేదని అన్నారు. ఇక్కడ బెంచ్‌ కలుగజేసుకుంటూ.. అసలు ఆమె ఇంటర్మీడియట్ క్లియర్ చేయకుండా డిగ్రీ పరీక్షకు ఎలా హాజరవుతుందని బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆమె దూరవిద్య (డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌) ద్వారా గ్రాడ్యుయేట్ కోర్సుకు దరఖాస్తు చేసుకుంది. అయితే ఆమె ఇప్పటి వరకూ ఇంటర్,డిగ్రీ పరీక్షలలో ఉత్తీర్ణత పొందలేదు. అంటే ఆమె ప్రస్తుత విద్యార్హత 10వ తరగతి మాత్రమే. అంతకంటే ఎక్కువ కాదు. అందువల్ల, ఆమె సబార్డినేట్ పోస్టుకు అర్హత ప్రమాణాలకు పూర్తిగా సరిపోతుందని పిటిషనర్‌ తరపు న్యాయవాది శ్రావణ్‌ కుమార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇరు పక్షాల వాదనలు విన్న బెంచ్ అధిక విద్యార్హత ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తిని ఉద్యోగానికి తిరస్కరించడం సరికాదన్నారు. వెంటనే పిటిషనర్‌ను ఇంటర్వ్యూకు పిలవాలని, అప్పటి వరకూ ఫలితాలను ప్రకటించవద్దని అధికారులను ఆదేశించింది. ఉన్నత విద్యార్హత బార్‌ను పరిశీలిస్తామని, రెండు వారాల్లోగా తమ స్పందనలను దాఖలు చేయాలని అధికారులను బెంచ్ కోరింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.