Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తుల పంచాయితీ.. ఎటూ తేలని సందిగ్ధత

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పొత్తు పంచాయితీ ముదురుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్, వామపక్షాల పొత్తుపై స్పష్టత రావడం లేదు. ఖమ్మం జిల్లాలో సీట్ల సర్దుబాటుపై పీటముడి వీడటం లేదు. కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాలను వామపక్షాలు అడుగుతున్న నేపథ్యంలో.. పొత్తులపై ప్రతిష్టంభన ఏర్పడింది.

Telangana Elections: కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తుల పంచాయితీ.. ఎటూ తేలని సందిగ్ధత
Congress And Left Parties
Follow us
N Narayana Rao

| Edited By: Balaraju Goud

Updated on: Oct 26, 2023 | 9:26 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పొత్తు పంచాయితీ ముదురుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్, వామపక్షాల పొత్తుపై స్పష్టత రావడం లేదు. ఖమ్మం జిల్లాలో సీట్ల సర్దుబాటుపై పీటముడి వీడటం లేదు. కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాలను వామపక్షాలు అడుగుతున్న నేపథ్యంలో.. పొత్తులపై ప్రతిష్టంభన ఏర్పడింది. జిల్లాలో సీపీఐకు కొత్తగూడెం సీటు దాదాపు ఖరారు అయ్యినట్టుగా చెబుతుండగా.. సిపిఎంకు ఇచ్చే సీటుపై స్పష్టత రావడం లేదు. అయితే పాలేరు సీటు కోసం సిపిఎం పట్టు బడుతుంది. అయితే వైరా స్థానం ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. చివరికి ఏ సీట్లు ఖరారు అవుతాయో. .పొత్తులు ఎటువైపు దారి తీస్తాయన్న ఆసక్తి నెలకొంది.

వామ పక్షాలు, కాంగ్రెస్ పొత్తుపై ప్రతిష్టంభన కొనసాగుతుంది. సీట్ల సర్దుబాటుపై ఎటూ తేలడం లేదు. జాతీయస్థాయిలో ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. జాతీయస్థాయిలో ఇండియా కూటమిలో వామపక్షాలు, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయి. తెలంగాణ లోనూ వామపక్షాలతో పొత్తు ఖచ్చితంగా ఉండాలని, ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్పష్టం చేసింది. సిపిఎంకు రెండు, సీపీఐకి రెండు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిపిఐకు కొత్తగూడెం, చెన్నూరు ఖరారు అయ్యాయి. సిపిఎంకు ఒక స్థానం మిర్యాల గూడ ఖరారు కాగా, రెండో సీటుపై తర్జన భర్జనలు పడుతున్నారు.

ముఖ్యం గా ఖమ్మం జిల్లాలో సీట్ల సర్దుబాటు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్‌కు బలమైన సీట్లను వామపక్షాలు అడుగుతున్న నేపథ్యంలో.. ఎలా సర్దుబాటు చేయాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. సిపిఎంకి ఖమ్మం జిల్లాలో ఖచ్చితంగా ఒక్క సీటు అయినా ఇవ్వాలని ఆ పార్టీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు. పాలేరు, భద్రాచలం కావాలని ప్రతిపాదన పెట్టారు. భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఉన్నారు. మళ్ళీ అతనికే మొదటి జాబితాలో ప్రకటించారు. భద్రాచలం ఇవ్వడం కుదరదని కాంగ్రెస్ తేల్చి చెప్పింది. పాలేరు అయినా ఇవ్వాలని సిపిఎం కోరుతోంది. అయితే అక్కడ మారిన రాజకీయ సమీకరణాలు, సామాజిక సమీకరణాల్లో భాగంగా ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది..

ఈ నేపథ్యంలో పాలేరు కూడా ఇవ్వలేమని.. వైరా సీటు ఇస్తామని ప్రతిపాదన పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అయితే దీనిపై సిపిఎం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. తాము కోరుతున్న సీట్లు ఇవ్వకుండా.. అసలు తాము ప్రతిపాదన పెట్టని.. వైరా సీటు ఇస్తామనడం సరికాదని అంటున్నారు కామ్రేడ్స్. వైరా సీటు పొత్తులో సిపిఎంకు ఇవ్వడం పట్ల స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. బలమైన సీటును ఎలా వదులు కుంటామని, కాంగ్రెస్ కే ఇవ్వాలని ఆందోళన లు చేస్తున్నారు. దీనితో.. ఖమ్మం జిల్లాలో పొత్తుల వ్యవహారం,సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు. జాతీయ స్థాయిలోనే నిర్ణయం తీసుకుని, ఇరు పార్టీలతో మాట్లాడి.. ఒక నిర్ణయానికి రావాలని.. లేకపోతే మరింత ఆలస్యం జరిగితే నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు స్థానిక నేతలు. చివరికి ఖమ్మం జిల్లాలో సిపిఎంకు ఏ సీట్లు ఇస్తారు? అంగీకారం కుదురు తుందా..? ఎప్పటిలోగా స్పష్టత వస్తుంది..? వేచి చూడాల్సిందే..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…