AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Electiions: నాకు ఏ గుర్తూ వద్దు.. ఎన్నికల సంఘానికి వింత వినతి.. కోదాడ స్వతంత్ర అభ్యర్థి లేఖ

No Symbol in Elections: ఎన్నికల్లో 'గుర్తు' అత్యంత కీలకం. ఇప్పటికీ కొందరు పార్టీ అభ్యర్థి పేరు తెలియకపోయినా సరే.. తాము అభిమానించే పార్టీ 'గుర్తు'కు ఓటేస్తుంటారు. 'చెయ్యి' గుర్తు అనగానే కాంగ్రెస్, 'పువ్వు' (కమలం) గుర్తు అనగానే కాంగ్రెస్, 'సైకిల్' గుర్తు అనగానే తెలుగుదేశం పార్టీ, 'కారు' గుర్తు అనగానే టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్), 'ఫ్యాన్' గుర్తు అనగానే వైఎస్సార్సీపీ.. ఇలా చెప్పుకుంటే పోతే ఆయా రాజకీయ పార్టీలను సాధారణ ప్రజలు గుర్తించి ఓటేసేది ఆ 'గుర్తు' ఆధారంగానే. అందుకే ఏదైనా పార్టీ రెండుగా చీలిన సందర్భాల్లో అప్పటి వరకు ఆ పార్టీకి కేటాయించిన గుర్తు కోసం చీలిక వర్గాలు పోటీ పడుతుంటాయి.

Telangana Electiions: నాకు ఏ గుర్తూ వద్దు.. ఎన్నికల సంఘానికి వింత వినతి.. కోదాడ స్వతంత్ర అభ్యర్థి లేఖ
Nri Sudheer Jalagam
Mahatma Kodiyar
| Edited By: Sanjay Kasula|

Updated on: Oct 17, 2023 | 2:16 PM

Share

ఎన్నికల కమిషన్‌, సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగ సంస్థలను ఆశ్రయించి గుర్తు కోసం న్యాయపోరాటం చేస్తుంటాయి. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే.. ఓ స్వతంత్ర అభ్యర్థి అసలు తనకు ఏ గుర్తూ వద్దని అంటున్నారు. అనడమే కాదు, ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ-మెయిల్ ద్వారా వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ‘గుర్తు’ కోసం స్వతంత్ర అభ్యర్థులు సైతం పోటీపడుతున్న ఈ రోజుల్లో అసలు తనకు ఏ గుర్తూ వద్దని చెబుతున్న ఆ స్వతంత్ర అభ్యర్థి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు.

ఎన్నికల్లో గుర్తు కోసం స్వతంత్ర అభ్యర్థులు ‘ఫ్రీ సింబల్స్’ జాబితా నుంచి తమకు నచ్చిన ‘గుర్తు’ను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ఫ్రీ సింబల్స్ జాబితాలో ఒక గుర్తును పోలిన గుర్తులపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. తాజాగా ‘కారు’ గుర్తును పోలిన రోడ్డ్ రోలర్, చపాతీ కర్ర, కెమేరా, టీవీ వంటి గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని ఈ మధ్యనే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇంత కీలకమైన ‘గుర్తు’ కోసం తంటాలు పడుతుంటే.. కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న జలగం సుధీర్ మాత్రం తనకు ఏ గుర్తూ వద్దని అంటున్నారు. అసలు ‘గుర్తు’ల కారణంగా స్వతంత్ర అభ్యర్థులకు నష్టం జరుగుతోందని కూడా సూత్రీకరిస్తున్నారు.

కోదాడ నుంచి ఎన్నికల గుర్తు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు అనుమతించాలని కోరుతూ ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా ఎన్నికల గుర్తుల మీద ఆధారపడి పోటీ చేయడం బాధాకరమని లేఖలో పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో అక్షరాస్యత అత్యల్పంగా ఉన్నకాలంలో ఈ గుర్తులు అవసరమయ్యాయని, కానీ తాజా NFHS-5 సర్వే ప్రకారం దేశంలో 72% మంది మహిళలు, 84% మంది పురుషులు అక్షరాస్యులుగా ఉన్నారని సుధీర్ తన లేఖలో తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల చిహ్నాల వెనుక ఉన్న హేతుబద్ధత తగ్గిపోయిందని సుధీర్ అన్నారు. 1968లో వచ్చిన గుర్తుల విధానం ఇప్పుడు మారిన పరిస్థితుల ప్రకారం తీసివేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ ఇదే విధానాన్ని కొనసాగించడం ద్వారా ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములవడానికి అక్షరాస్యత అవసరం లేదన్న అభిప్రాయాన్ని కొనసాగిస్తున్నట్టేనని అన్నారు. నేతలు 100% అక్షరాస్యత సాధించడానికి ప్రాధాన్యతనివ్వాలంటే ‘గుర్తు’ విధానాన్ని తొలగించడమే ఉత్తమమని సూచించారు. ఈ గుర్తులు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న పార్టీలకు, ఆ పార్టీ నేతలకు మాత్రమే ప్రయోజనం కల్పిస్తున్నాయని, కొత్తగా రాజకీయాల్లోకి స్వతంత్రులుగా అడుగుపెట్టి సమాజానికి ఏదైనా చేద్దామనుకునేవారికి ‘గుర్తు’ ద్వారా అన్యాయం జరుగుతోందని సుధీర్ వివరించారు.

ప్రధాన పార్టీలకు శాశ్వత గుర్తులు ఉండడం వల్ల ప్రచారం చేసుకోవటానికి ఎక్కువ సమయం ఉంటుందని తెలిపారు. జాతీయ పార్టీలుగా, రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందిన పార్టీలకు శాశ్వత గుర్తులు ఉంటాయని, తద్వారా ఆ గుర్తు అప్పటికే ప్రజల్లో పరిచయమై ఉంటుందని వివరించారు. కానీ స్వతంత్ర అభ్యర్థులకు కొన్ని వారాల ముందు మాత్రమే గుర్తు కేటాయిస్తారని, తద్వారా వారి గుర్తు గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమయం సరిపోదని వెల్లడించారు. స్వతంత్ర అభ్యర్థులు మంచివారైనప్పటికీ, సమాజ హితం కోరుకుంటూ రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ తమ గుర్తు గురించి ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేసుకోలేకపోతున్నారని వివరించారు.

Nri Sudheer Jalagam With Ktr

ఈ పరిస్థితుల్లో ఎన్నికల గుర్తులను తొలగించడమే న్యాయమైన, పారదర్శకమైన విధానమని జలగం సుధీర్ ఎన్నికల సంఘానికి సూచించారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా తన అభ్యర్థనపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు. నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్దిగా తాను పోటిచేస్తున్నానని, ఈ క్రమంలో ఎటువంటి గుర్తు కేటాయించకుండా కేవలం ‘పేరు’, ‘ఫొటో’తో మాత్రమే ఎన్నికల ప్రక్రియలో ఉండటానికి తనకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని సుధీర్ ఎలక్షన్ కమీషనర్‌ను కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి