ఫార్ములా ఈ-రేసు కేసు విచారణలో కీలక పరిణామం.. కేటీఆర్‌కు ఈడీ నోటీసులు..!
గత BRS ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్మూలా E కార్ రేస్‌లో నిధుల దుర్వినియోగంపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది తెలంగాణ ఏసీబీ. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా చేర్చింది. అలాగే ఐఏఎస్ అరవింద్ కుమార్‌ను ఏ2గా, HMDA మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ బిఎల్‌ఎన్ రెడ్డిని A3గా చేర్చింది ఏసీబీ.
ఫార్ములా ఈ-రేసు కేసు విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్, ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు(KTR) ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. కేటీఆర్‌తోపాటు అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. అరవింద్ కుమార్ జనవరి 2న, బీఎల్ఎన్ రెడ్డి జనవరి 3న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కేసు కింద ఈడీ విచారణ జరుపుతోంది.
మరోవైు ఫార్మూలా ఈ రేసుపై విచారణలో ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఫార్మూలా -ఈపై విచారణ రాజకీయ కక్షసాధింపు అనడం అర్థరహితమంటోంది ACB. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వ ఖజానా దుర్వినియోగం అయిందని ఇందులో వివరించింది. ఏకపక్ష నిర్ణయం తీసుకొని చెల్లింపులు జరిగాయని కోర్టు దృష్టికి తెచ్చింది ఏసీబీ.
ప్రభుత్వ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీకి 54 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయని ఆరోపణలతో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే..! రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుంగా ఏకపక్ష నిర్ణయం తీసుకుని చెల్లింపులు జరిగాయని కేసులో పేర్కొన్నారు. దీని వల్ల HMDAపై అదనంగా 8 కోట్ల రూపాయల భారం పడిందని కోర్టుకు తెలిపింది ఏసీబీ. రెండో సెషన్‌కి సంబంధించి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండానే అగ్రిమెంట్ చేసుకున్నారని ఏసీబీ ఆరోపించింది. మొదటి అగ్రిమెంట్‌లో ప్రభుత్వం కేవలం ట్రాక్ నిర్మాణంతో పాటు ఏర్పాట్లు చేసేలా ఉంది. ఇక రెండో సెషన్ అగ్రిమెంట్‌లో ఏర్పాట్లతో పాటు స్పాన్సర్ అమౌంట్ కూడా HMDA చెల్లించే విధంగా ఒప్పందం కుదిరింది. ఇది జరిగి ఉంటే ప్రభుత్వంపై మరో 600 కోట్ల రూపాయల భారం పడి ఉండేదని ACB వేసిన కౌంటర్ పిటిషన్‌లో వివరించింది.
ఇక అంతకుముందు ఫార్మూలా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిగింది. అయితే కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం సమయం కోరింది. దీంతో తదుపరి విచారణను వాయిదావేసింది హైకోర్టు. అప్పటి వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీచేసింది. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏ1గా ఉన్నారు కేటీఆర్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..