Telangana: జులాయి మూవీ స్టైల్లో స్కెచ్.. పగిలిన ఫోన్‌తో బండారం బట్టబయలు.. కరీంనగర్ దోపిడీ కేసులో వెలుగులోకి సంచలన నిజాలు..
కరీంనగర్ జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జులాయి సినిమాలో మాదిరిగానే ఒకరికొకరు సంబంధం లేని వ్యక్తులను కలిపి, వేర్వేరు రాష్ట్రాల నుంచి రప్పించి మాస్టర్ స్కెచ్ వేసిన వైనం పోలీసులనే విస్మయానికి గురిచేస్తోంది. నిందితులు తమ ఆనవాళ్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చిన్నారులకు దొరికిన ఒక పగిలిన సెల్‌ఫోన్ ఇప్పుడు ఈ కరడుగట్టిన గ్యాంగ్ గుట్టు విప్పే కీలకాధారంగా మారింది.

కరీంనగర్‌లో జరిగిన భారీ నగల దుకాణం దోపిడీ కేసు రోజురోజుకీ కొత్త మలుపులు తిరుగుతోంది. కేవలం 11 నిమిషాల్లోనే కోటి రూపాయలకు పైగా విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఈ ఘటన వెనుక బీహార్‌కు చెందిన కరడుగట్టిన సుబోధ్ గ్యాంగ్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మిగతా సభ్యుల కోసం పలు రాష్ట్రాల్లో విస్తృత గాలింపు చేపట్టారు. ఈ నెల 3న పట్టపగలు కరీంనగర్‌లోని ఓ జ్యువెలరీ షాపులోకి చొరబడిన దొంగలు, అత్యంత ప్రణాళికాబద్ధంగా దోపిడీకి పాల్పడ్డారు. కేవలం 11 నిమిషాల్లోనే రూ.1.05 కోట్ల విలువైన బంగారు నగలను సొంతం చేసుకుని పరారయ్యారు. ఈ గ్యాంగ్ ప్రత్యేకంగా బంగారు దుకాణాలనే టార్గెట్ చేస్తూ పలు రాష్ట్రాల్లో దోపిడీలు నిర్వహించిన అనుభవం కలిగిన ముఠాగా తెలుస్తోంది. పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడిన అంశాలు సినిమాలను తలపిస్తున్నాయి. జులాయి సినిమాలో బ్యాంకు దోపిడీకి ఎలా వేర్వేరు వ్యక్తులను ఒకచోట చేర్చారో.. ఇదీ దాదాపు అదే తరహా స్కెచ్‌తో జరిగిందని సమాచారం. గ్యాంగ్ సభ్యుల్లో చాలామందికి ఒకరిపై మరొకరికి ముందుగా పరిచయం కూడా లేదట. ప్రధాన సూత్రధారి తన పరిచయాల ద్వారా బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను ఎంపిక చేసి, వారిని వేర్వేరు మార్గాల్లో కరీంనగర్‌కు రప్పించినట్లు పోలీసులు గుర్తించారు. కొందరిని రైళ్లలో, మరికొందరిని బస్సులలో పంపించి.. చివర్లో ఒకేచోట కలిపి రెక్కీ నిర్వహించినట్లు సమాచారం.
పట్టుబడిన ఇద్దరు నిందితులు పోలీసులకు చెప్పిన వివరాలు మరింత ఆసక్తికరంగా మారాయి. తమకు గ్యాంగ్‌లోని మిగతా సభ్యుల వివరాలు కూడా తెలియవని.. ప్రధాన సూత్రధారి ఫోన్ నంబర్ మాత్రమే తమ వద్ద ఉందని వారు వెల్లడించినట్లు తెలిసింది. దోపిడీలో పాల్గొంటే కొంత మొత్తం ఇస్తామని చెప్పడంతోనే వచ్చామని వారు చెబుతున్నారని సమాచారం. పోలీసుల అంచనా ప్రకారం.. ఈ ముఠా సభ్యులు డబ్బు కోసం ఎంతదూరమైనా వెళ్లే నేరచరిత్ర కలిగినవారిగా భావిస్తున్నారు. ఈ కేసులో అత్యంత కీలక మలుపు ఒక పగిలిపోయిన సెల్‌ఫోన్ రూపంలో బయటపడింది. దోపిడీ అనంతరం ద్విచక్రవాహనాలపై పారిపోతున్న సమయంలో.. బుగ్గారం మండలం మద్దునూర్ సమీపంలో దుండగులు తమ వద్ద ఉన్న ఫోన్‌ను నేలకేసి కొట్టి ధ్వంసం చేసి వెళ్లిపోయారు. అయితే అదే ఫోన్ అక్కడ ఆడుకుంటున్న చిన్నారుల చేతికి చిక్కింది.
దోపిడీ వార్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉండటంతో గ్రామస్థులు ఆ ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. ఫోన్ పగిలిపోయినా అందులోని డేటా కొంతవరకు రికవర్ చేయగలిగిన పోలీసులు.. అదే ఆధారంగా గ్యాంగ్ కదలికలను ట్రాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దోపిడీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందాలతో పలు రాష్ట్రాల్లో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులు అదుపులో ఉండగా.. మిగతా నలుగురిని కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌లో సంచలనం సృష్టించిన ఈ కేసులో.. నిందితులు అన్ని ఆధారాలు చెరిపేయాలని ప్రయత్నించినా.. చివరకు ఒక పగిలిన ఫోన్‌నే వారి గుట్టు విప్పే కీలక ఆధారంగా మారడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
