AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంక్‌ మేనేజర్ లీలలు.. పనిచేస్తున్న చోటే గుట్టుగా కోట్ల స్కాం..! ఫేక్‌ గోల్డ్‌తో ఏకంగా..

ఆన్‌లైన్ బెట్టింగుల వ్యసనం ఎంతోమంది జీవితాలను అధోగతి పాలు చేస్తుంది...తాజాగా బెట్టింగ్‌లకు అలవాటు పడ్డ, ఒక బాధ్యతాయుతమైన బ్యాంక్ మేనేజర్‌ను ఘరానా కేడీగా మార్చింది...నమ్మి కుర్చీ ఇస్తే.. ఏకంగా తను పనిచేసే బ్యాంకుకే కన్నం వేశాడు ఆ మేనేజర్..భార్య, స్నేహితుల ఐడీ కార్డులతో నకిలీ ఖాతాలు తెరిచి..వన్ గ్రామ్ గోల్డ్‌ను అసలు బంగారంగా నమ్మించి కోట్లకు కోట్లు నొక్కేశాడు.. పూర్తి వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

బ్యాంక్‌ మేనేజర్ లీలలు.. పనిచేస్తున్న చోటే గుట్టుగా కోట్ల స్కాం..! ఫేక్‌ గోల్డ్‌తో ఏకంగా..
Medak Bank Scam
P Shivteja
| Edited By: |

Updated on: May 14, 2026 | 12:11 PM

Share

కంచే చేను మేసిన చందంగా, నమ్మి పదవి ఇస్తే ఆ మేనేజర్ తను పనిచేసే బ్యాంకుకే పట్టపగలు కన్నం వేశాడు. ఆన్‌లైన్ బెట్టింగుల వ్యసనం ఒక బాధ్యతాయుతమైన బ్యాంక్ మేనేజర్‌ను ఘరానా కేడీగా మార్చిన ఘటన మెదక్ పట్టణంలోని ఆదర్శ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బ్రాంచ్‌లో వెలుగుచూసింది. బ్యాంక్ మేనేజర్ యాదం అనిల్ ఆన్‌లైన్ బెట్టింగులకు బానిసయ్యాడు. ఆ వ్యసనం తీర్చుకోవడానికి అవసరమైన డబ్బు కోసం తన భార్య స్రవంతి, స్నేహితుడు సుబ్రహ్మణ్యం మరియు మరికొందరి ఆధార్, పాన్ కార్డులను సేకరించాడు. వాటితో బ్యాంకులో 16 నకిలీ ఖాతాలను ఓపెన్ చేశాడు. ఆ 16 ఖాతాల్లో వన్ గ్రామ్ గోల్డ్ (నకిలీ బంగారం) పెట్టి, వాటిని అసలైన బంగారు ఆభరణాలుగా రికార్డుల్లో నమోదు చేశాడు. ఈ మోసానికి బ్యాంక్ గోల్డ్ లోన్ ఆడిటర్ శ్రీనివాసచారి కూడా లోపాయికారీగా సహకరించాడు.

నకిలీ బంగారంపై ఏకంగా రూ. 1.49 కోట్ల మేర గోల్డ్ లోన్లు మంజూరు చేసుకుని సొంతానికి వాడుకున్నాడు. ఇంతటితో ఆగకుండా, ఏటీఎంలలో క్యాష్ డిపాజిట్ చేసే సమయంలోనూ తన చేతివాటం ప్రదర్శించి మరో రూ. 31.35 లక్షలను పక్కదారి పట్టించాడు. మొత్తంగా దాదాపు 1.80 కోట్ల రూపాయల మేర బ్యాంకును ముంచేశాడు.

పోలీసుల దర్యాప్తులో అనిల్ గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి. ఇతను గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని వాలేరుపాడు ఏపీజీవీబీ బ్యాంకులోనూ ఇలాంటి స్కామ్‌కే పాల్పడ్డాడు. పోలవరం నిర్వాసితులైన గిరిజనులను మోసం చేసి రూ.11 లక్షలు కాజేసిన కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయినా బుద్ధి మారని అనిల్, మెదక్ బ్రాంచ్‌లో చేరి మళ్లీ అంతకంటే పెద్ద స్కామ్‌కు తెరలేపాడు.

ఇవి కూడా చదవండి

బ్యాంక్ సీఈఓ వెంకటరమణ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మెదక్ పోలీసులు నిందితుల గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో మేనేజర్ భార్య స్రవంతి, స్నేహితుడు సుబ్రహ్మణ్యం, ఆడిటర్ శ్రీనివాసచారిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు యాదం అనిల్ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

ఈ ఘటన బ్యాంకింగ్ రంగంలో భద్రతా లోపాలను, అంతర్గత ఆడిటింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలను మరోసారి వేలెత్తి చూపుతోంది. నిత్యం లక్షలాది రూపాయల లావాదేవీలు చేసే బ్యాంకులు, ఇలాంటి ఘరానా మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us