దారుణం… భార్యపై అనుమానంతో భర్త కిరాతకం.. గొడ్డలితో రెండు కాళ్లు నరికేసి..
కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే ఆమెపై కసాయిగా మారాడు. అనుమానం అనే పెనుభూతం ఆలుమగల బంధాన్ని బలితీసుకుంది. క్షణికావేశంలో ఒక వ్యక్తి చేసిన పని ఇప్పుడు ఒక మహిళను ప్రాణాపాయ స్థితిలోకి నెట్టడమే కాకుండా, ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసింది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం గంగోజిపేట గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అనుమానం పెనుభూతమై ఓ నిండు సంసారంలో చిచ్చు పెట్టింది. భార్యపై అనుమానంతో ఓ భర్త గొడ్డలితో కిరాతకానికి ఒడిగట్టాడు. గంగోజిపేట గ్రామానికి చెందిన దుర్గయ్య, వీరమణి దంపతులు గత కొంతకాలంగా కలిసి జీవిస్తున్నారు. అయితే, గత కొద్దిరోజులుగా భార్య వీరమణి ప్రవర్తనపై దుర్గయ్య తీవ్రమైన అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, దుర్గయ్య తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.
గొడవ తారాస్థాయికి చేరడంతో విచక్షణ కోల్పోయిన దుర్గయ్య, ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకుని భార్యపై దాడికి తెగబడ్డాడు. ఆమె తప్పించుకునే లోపే అత్యంత కిరాతకంగా ఆమె రెండు కాళ్లను గొడ్డలితో నరికేశాడు. ఆమె పెట్టిన హాహాకారాలు విని స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి, వీరమణి రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమె పరిస్థితిని చూసి గ్రామస్థులు నిర్ఘాంతపోయారు.
స్థానికులు వెంటనే స్పందించి వీరమణిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ అమీర్‌పేటలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఆమె ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కన్నతల్లిపై తండ్రి చేసిన ఈ అమానవీయ చర్యను చూసి తట్టుకోలేకపోయిన వారి కుమారుడు, ధైర్యంగా పుల్కల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన తల్లిని ఇంతటి ఘోరంగా చిత్రహింసలకు గురిచేసిన తండ్రిని కఠినంగా శిక్షించాలని కోరాడు. బాధితురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు దుర్గయ్య పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.




