ఆధ్యాత్మిక సందడిలో అలజడి.. హనుమాన్ ర్యాలీలో ఆగంతకుడి హల్ చల్..
మొన్నటివరకూ ఎన్నికల వేడితో సలసల కాగి చల్లారింది కరీంనగరం. ఇప్పుడు మళ్లీ సడన్‌గా గరంగరం అయింది. హనుమాన్ ర్యాలీ సందర్భంగా జరిగిన రగడ.. మధ్యలో పోలీసుల జోక్యంతో ఇంకాస్త రగిలి.. రాజకీయ రచ్చగా మారింది. తెల్లారేసరికి సద్దుమణిగింది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు పరేషాన్ లేపిన ఈ ఎపిసోడ్ పూర్వాపరాలేంటి.. ఎవరిది యాక్షన్.. ఎవరిది ఓవరాక్షన్..?
మొన్నటివరకూ ఎన్నికల వేడితో సలసల కాగి చల్లారింది కరీంనగరం. ఇప్పుడు మళ్లీ సడన్‌గా గరంగరం అయింది. హనుమాన్ ర్యాలీ సందర్భంగా జరిగిన రగడ.. మధ్యలో పోలీసుల జోక్యంతో ఇంకాస్త రగిలి.. రాజకీయ రచ్చగా మారింది. తెల్లారేసరికి సద్దుమణిగింది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు పరేషాన్ లేపిన ఈ ఎపిసోడ్ పూర్వాపరాలేంటి.. ఎవరిది యాక్షన్.. ఎవరిది ఓవరాక్షన్..? కరీంనగర్ సిటీ.. నాకా చౌరస్తా.. శనివారం రాత్రంతా ఆధ్యాత్మిక సందడితో హోరెత్తింది. హనుమాన్ జయంతి మరో నాలుగురోజులు ఉందనగా.. ఆంజనేయ మాలధారులంతా కలిసి భారీ ర్యాలీ తీశారు. ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతం కనుక.. ర్యాలీ సమయంలో సహజంగానే స్థానికుల్లో టెన్షన్ మొదలైంది. దానికి తగ్గట్టే.. ర్యాలీ మంచిర్యాల చౌరస్తా దగ్గరకు రాగానే.. ఒక అగంతకుడు ఆకస్మికంగా ర్యాలీలో ఎంట్రీ ఇచ్చాడు. తల్వార్ తిప్పుతూ హల్‌చల్ చేశాడు.
ర్యాలీకి అడ్డుపడ్డ అతగాడితో హనుమాన్ మాలధారులకు వాగ్వాదం జరిగింది. ఘర్షణల్ని నివారించే క్రమంలో పోలీసులొచ్చి.. శోభాయాత్రలో వీరంగం సృష్టించిన జయదేవ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అటు.. ర్యాలీని అర్థంతరంగా నిలిపి వేయాలని భక్తులకు సూచించారు. కోపగించుకున్న భక్తులు.. ర్యాలీని ఆపే ప్రసక్తే లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా స్వల్పంగా తోపులాట జరిగింది. సర్దిచెప్పినా వినకపోవడంతో, పరిస్థితి అదుపు తప్పుతుందని భావించి, కొందరు భక్తులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించబోయారు. ఒక హనుమాన్ భక్తుడు పోలీసు వాహనాన్ని గట్టిగా పట్టుకున్నప్పటికీ ఆపకుండా వెళ్లారు. అడ్డుకోబోయిన భక్తులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. చొక్కాలు చిరిగే స్థాయిలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటు.. మాలధారుల అరెస్ట్ వార్త కరీంనగర్ మొత్తం వ్యాపించడంతో, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు రంగంలో దిగారు. త్రీటౌన్ పీఎస్ ఎదుట బైఠాయించి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు.. ర్యాలీకి బ్రేక్ పడిన ప్రాంతంలో కూడా ఆందోళన చేశారు. దీంతో దిగొచ్చిన పోలీసులు, అరెస్టయినవారిలో కొందరిని విడుదల చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా ఆరుగురిపై.. విధులకు ఆటంకం కల్గించారన్న అభియోగంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిజనిర్ధారణ కోసం ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.
అటు.. కరీంనగర్ హనుమాన్ ర్యాలీ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. వారణాసిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. తీవ్రంగా స్పందించారు. వెంటనే డీజీపీకి ఫోన్ చేశారు. హనుమాన్ భక్తులపై దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. పోలీసుల అదుపులో ఉన్న హనుమాన్ భక్తులు, బీజేపీ నాయకులను విడుదల చేయాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. హనుమాన్ ర్యాలీతో తమకు ఎటువంటి ప్రమేయం లేదని పక్కకు జరుగుతోంది బీజేపీ. స్థానికంగా మతవిద్వేషాలను, ఘర్షణలను ప్రోత్సహిస్తోందన్న ఆరోపణల్ని తిప్పికొడుతోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం.. కరీంనగర్ ఘటనపై ఆచితూచి స్పందిస్తోంది. ఈ అంశాన్ని మతపరంగా చూడొద్దంటూనే.. ఘటన వెనుక బీజేపీ నేతలే ఉన్నారని ఆరోపిస్తోంది. కానీ.. ఎలాంటి వదంతులు నమ్మొద్దని సూచిస్తున్నారు పోలీసులు. మొత్తానికి ఒక రోజంతా తెలంగాణ వ్యాప్తంగా ఉడుకెత్తించిన ర్యాలీ ఘటన.. టీకప్పులో తుపానులా చల్లబడింది. అటు కరీంనగర్‌లో జనం కూడా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..