Hyderabad: లచ్చలు.. లచ్చలు పెట్టిస్తాయ్.. కంట్రోల్‌లోకి వెళ్లారంటే ఖేల్ ఖతం..
బెట్టింగ్ మరొకరిని బలి తీసుకుంది. బెట్టింగ్ యాప్స్‌కు అలవాటుపడి ఒకేసారి రూ. లక్ష నష్టపోయిన యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. త్వరలో మంచి ఉద్యోగంలో చేరి కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు ఇలా..

బెట్టింగ్ మరొకరిని బలి తీసుకుంది. బెట్టింగ్ యాప్స్‌కు అలవాటుపడి ఒకేసారి రూ. లక్ష నష్టపోయిన యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. త్వరలో మంచి ఉద్యోగంలో చేరి కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు ఇలా బెట్టింగ్ భూతానికి బలైపోవడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అత్తాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పెద్ద నర్సింహులు తనయుడు పవన్.. హైదరాబాద్ జేఎన్టీయూలో ఎంటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మరో ఇద్దరు ఫ్రెండ్స్‌తో అత్తాపూర్‌లో రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఇటీవల ఈజీ మనీ కోసం బెట్టింగ్‌కు అలవాటు పడిన పవన్.. రోజూ ఫోన్లో ఓ యాప్‌లో బెట్టింగ్ ఆడుతూ భారీగా డబ్బులు నష్టపోయాడు. పలువురి వద్ద నగదు తీసుకుని బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకున్నాడు.
చివరకు కొన్ని యాప్‌లలో లోన్స్ తీసుకొని.. ఆ డబ్బు సైతం పోగొట్టాడు. లోన్స్ ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో విషయం ఇంట్లో చెప్పగా.. తండ్రి పలు దఫాలుగా రూ. 98,200 పంపించారు. ఆ డబ్బుతో కూడా లోన్స్ కట్టలేదు. చివరకు తన తండ్రి ఇప్పించిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ఐఫోన్‌ను అమ్మి కొన్ని అప్పులు చెల్లించాడు. అయినా సరే ఇంకా అప్పులు చెల్లించాల్సి ఉండటంతో.. పవన్ తీవ్ర మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి స్నేహితులు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి తండ్రి పెద్దనర్సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
