CM KCR: ఈ దసరాకు గులాబీ ధమాకా.. జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా కేసీఆర్, రాష్ట్ర పార్టీ చీఫ్‌గా …

అనేక మందితో చర్చించిన KCR - తమ పార్టీ TRS పేరును మార్చితే సరిపోతుందనే నిర్ణయానికి వచ్చారు. విజయదశమి రోజు మద్యాహ్నం ఒంటి గంట 19 నిమిషాల సుముహుర్తంలో పార్టీ కొత్త పేరును సీఎం కేసీఆర్‌ ప్రకటించనున్నారు.

CM KCR: ఈ దసరాకు గులాబీ ధమాకా.. జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా కేసీఆర్, రాష్ట్ర పార్టీ చీఫ్‌గా ...
Telangana CM KCR
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 02, 2022 | 5:59 PM

జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు TRS అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ముహుర్తం ఖరారు చేశారు. కొత్త పార్టీ ఏర్పాటుపై వస్తున్న ఊహాగానాలకు TRS తెరదించింది. జాతీయ స్థాయిలో పోటీ చేయాలంటే తెలంగాణ అనే పేరు ప్రతిబంధకంగా మారుతుంది కాబట్టి TRS పార్టీ పేరును జాతీయ రాజకీయాలకు తగినట్టుగా మార్చితే సరిపోతుందనే భావనకు KCR వచ్చారు. తాజా పరిణామాలు చూస్తే TRS పేరును మాత్రమే మార్చుతారని స్పష్టమవుతోంది. ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షులు, మంత్రులతో పార్టీ పేరు, జాతీయ రాజకీయాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై CM చర్చించారు. పార్టీ పేరు కోసం న్యూమరాలజీని కూడా ఆయన పరిగణనలోకి తీసుకున్నారని తెలుస్తోంది. పార్టీ పేరు కోసం మొత్తంగా సీఎం దృష్టికి 200 పేర్లు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. వీటన్నింటినీ పరిశీలించిన సీఎం KCR – జాతీయ స్థాయి రాజకీయాలకు అనుకూలంగా ఉండే పేరును ఈ విజయదశమి రోజు ప్రకటించనున్నారు. దసరా రోజు తెలంగాణ భవన్‌లో TRS శాసనసభాపక్షం సమావేశంతో పాటు TRS పార్టీ రాష్ట్ర కార్యవర్గం భేటీ కానుంది. జాతీయ పార్టీగా మార్పుపై కార్యవర్గంలో తీర్మానం చేయనున్నారు. దసరా రోజు జరిగే TRS విస్తతృ స్థాయి సమావేశానికి కొందరు ముఖ్య అతిధులు కూడా రానున్నారు.

జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించినా అచ్చొచ్చిన గులాబీ రంగును కొనసాగించాలని TRS అధినేత ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే ఎన్నికల గుర్తుగానూ కారు కొనసాగనుంది. పార్టీ జెండాలో తెలంగాణ మ్యాప్‌ స్థానంలో ఇండియా మ్యాప్‌ చేర్చనున్నారు. మరో వైపు 2024 సాధారణ ఎన్నికల్లోపే జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకోవాలనే దిశగా KCR కసరత్తు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లోపు జరిగే ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో KCR ఉన్నట్టు తెలుస్తోంది.

పాత హైదరాబాద్‌ రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్‌ స్థానాల్లో కచ్చితంగా పోటీ చేయాలనే నిర్ణయం KCR ఇప్పటికే తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడేవారు అధికంగా ఉండే నియోజకవర్గాలనూ టార్గెట్‌ చేస్తున్నట్టు సమాచారం. సౌతిండియాపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని పార్టీ ఆఫీసు వేదికగా జాతీయ రాజకీయ కార్యకలాపాలు చేపట్టాలనే నిర్ణయం సీఎం కేసీఆర్‌ తీసుకున్నారు. పార్టీ పేరు ప్రకటించిన తర్వాత జాతీయ స్థాయిలో డిసెంబర్‌ 9న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. పార్టీ పేరు ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా KCR పర్యటనలు ఉండనున్నాయి. పార్టీలో చేరేవారితో సమాలోచనలతో పాటు, వరుస చేరికలు ఉండనున్నాయి.

మరిన్నితెలంగాణ వార్తల కోసం