Ganga Nilla Jathara: శోభాయమానంగా గంగనీళ్ల జాతర.. అమ్మవారి ఆభరణాల దర్శనంతో పులకించిన భక్తగణం
శనివారం విశ్రాంతి తీసుకొని తిరిగి ఆదివారం ఉదయం గోదావరి జలాలతో అమ్మవారి ఆభరణాలను నగలను అభిషేకించి తిరిగి దేవాలయానికి ప్రయాణం అయ్యారు. సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి తీరానికి కేవలం కాలినడకన మాత్రమే చేరుకున్నారు.
నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం అడెల్లి మహా పోచమ్మ జాతర ఘనంగా జరిగింది. అటవీ ప్రాంతంలో గల ఈ క్షేత్రం లో వెలసిన అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతోంది. తిథి ముహుర్తాలతో సంబంధం లేకుండా దేవీశరన్నవరాత్రులలో వచ్చే శనివారం జాతర ప్రారంభమై ఆదివారం ముగిసింది. అమ్మవారి ఆభరణాలను నగలను పవిత్ర గోదావరిలో శుభ్రం చేసే ఈ జాతర కార్యక్రమం రెండు రోజులుగా సాగింది. ఈ ఈనేపధ్యంలో శనివారం అడెల్లి పోచమ్మ ఆలయం నుండి అమ్మవారి ఆభరణాలతో బయలుదేరి ఆదివారం ఉదయం న్యూ సాంగ్వి గ్రామంలో గోదావరిలో శుద్ధి చేసుకొని దిలావర్పూర్ గ్రామం లోకి ప్రవేశించారు. చుట్టుపక్కల గ్రామాల వారు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి అమ్మవారి నగలకు స్వాగతం పలికారు.
జాతర మహోత్సవంలో భాగంగా అడెల్లి మహాపోచమ్మ దేవాలయం నుండి అమ్మవారి ఆభరణాలను నగలను తీసుకుని దేవాలయ అర్చకులు భక్తులు వెంట రాగా దిలావర్ పూర్ మండలం సాంగ్వి గ్రామ శివారులో గల గోదావరి తీరం వద్దకు చేరుకున్నారు. శనివారం విశ్రాంతి తీసుకొని తిరిగి ఆదివారం ఉదయం గోదావరి జలాలతో అమ్మవారి ఆభరణాలను నగలను అభిషేకించి తిరిగి దేవాలయానికి ప్రయాణం అయ్యారు. సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి తీరానికి కేవలం కాలినడకన మాత్రమే చేరుకున్నారు. దారి పొడుగునా అవసరపడే గ్రామాల్లోకి వస్తున్న జాతర సమూహానికి ఆయా గ్రామాల్లోని మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకారు. రెండవ రోజైన ఆదివారం ఉదయం సాంగ్వి నుండి తిరుగు ప్రయాణం అయ్యారు. సాయంత్రానికి ఆలయ ప్రవేశంచేశారు. దీంతో జాతర పూర్తయింది.
ఈ రెండు రోజులు ఆలయానికి ఉమ్మడి జిల్లా నుండి మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల నుండి, సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుండి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అమ్మవారి నగలు వెంట అర్చకుల వెంట నడుచుకుంటూ గోదావరి తీరానికి చేరుకొని తిరిగి దేవాలయానికి చేరుకున్నారు.
వేలాది సంఖ్యలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా దేవాలయ సిబ్బంది మరియు పాలకమండలి సభ్యులు తగిన రీతిలో ఏర్పాట్లు చేశారు. పోలీసు సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..