Sajjanar IPS: అల్లాటప్పా వ్యవహారం కాదు.. ఆర్టీసీని గాడిలో పెట్టడం సజ్జనార్‌కు సాధ్యమేనా.?
సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు
TSRTC MD VC Sajjanar: సైబరాబాద్ పోలీస్ కమీషనర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు సీనియర్ ఐపీఎస్ సజ్జనార్. ఇప్పటివరకు ఐపీఎస్‌గా తన బాధ్యతలు నిర్వహించిన సజ్జనార్ మరో రోల్ పోషించేందుకు సిద్దమయ్యారు. ఆర్ధిక నష్టాలతో సతమతమవుతున్న ఆర్టీసీని.. లాభాల బాట పట్టించే ఛాలెంజింగ్ బాధ్యతలను సజ్జనార్ స్వీకరించారు. ఆయన ఇవాళ ఉదయం టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. కొత్త బాస్‌గా చేరిన ఆయనకు ఆర్టీసీ ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అటుపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో కీలక భేటీ నిర్వహించారు సజ్జనార్. ఆర్టీసీలోని వేర్వేరు విషయాలపై చర్చించారు.
సైబరాబాద్ పోలీస్ కమీషనర్‌గా సేవలందించిన సజ్జనార్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఎండీగా బదిలీ చేసింది. శుక్రవారం బస్ భవన్‌లో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టారు. సజ్జనార్ అంతకుముందు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. మూడేళ్ల పాటు సైబరాబాద్ సీపీగా పని చేసి నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నారు. 2009లో దేశంలోనే సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసులో సజ్జనార్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సజ్జనార్ గతంలో సీఐడీ, ఇంటిలిజెన్స్ విభాగాల్లో పని చేశారు.