Telangana Politics: కాంగ్రెస్‌లో కలహాలు.. గులాబీలో మంటలు.. కాకరేపుతున్న తెలంగాణ రాజకీయాలు..
కాంగ్రెస్‌లో ఒక కుటుంబంలో ఒకే టికెట్ అని.. ఖరాకండిగా ఇటీవల కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తన సోదరి చేరికతో తనకు టికెట్ కట్ అవుతుందని భావించిన విష్ణు రేవంత్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు.
Telangana Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో కలహాల కల్లోలం కొనసాగుతూనే ఉంది. అలకలు, అసంతృప్తులు, పరస్పర ఆరోపణలు, విమర్శల పర్వానికి పుల్‌స్టాఫ్ పడడంలేదు. తాజాగా పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేతలతో లంచ్ మీటింగ్ హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల పీజేఆర్ కూమర్తె విజయారెడ్డిని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేర్చుకోవడంతో విష్ణు అలకపాన్పు ఎక్కినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో ఒక కుటుంబంలో ఒకే టికెట్ అని.. ఖరాకండిగా ఇటీవల కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తన సోదరి చేరికతో తనకు టికెట్ కట్ అవుతుందని భావించిన విష్ణు రేవంత్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ వ్యతిరేక సీనియర్లను లంచ్ మీటింగ్ విష్ణు ఆహ్వానించి తన నిరసన తెలిపాడు. విహెచ్, శ్రీధర్‌బాబు, మధుయాష్కిని లంచ్ మీటింగ్‌కు ఆహ్వానించి తన నిరసన తెలిపాడు. సీనియర్లు బుజ్జగించినా తనకు టికెట్ ఇవ్వకుంటే అమీతుమీ తేల్చుకుంటానని తేల్చిచెప్పినట్లు సమాచారం.
మరోవైపు హుస్నాబాద్ కాంగ్రెస్‌లో మంటల రేగాయి. ఆ నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్ నేత అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని రేవంత్‌రెడ్డి ప్రయత్నించడాన్ని అక్కడ టికెట్ ఆశిస్తున్న బొమ్మ శ్రీరామ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రవీణ్‌రెడ్డి చేరిక ఖాయమైందని భావిస్తున్న నేపథ్యంలో శ్రీరామ్ తన అనుచరులతో మీటింగ్ పెట్టి నిరసన గళం వినిపించారు. ఇదిలాఉండగా రేవంత్‌రెడ్డిపై నిన్న మొన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈరోజు ప్రశాతంగానే ఉన్నారు. హైకమాండ్ నుంచి వార్నింగ్ రావడంతో ఆయన సైలెంట్ అయినట్లు సమాచారం. కాకపోతే ఢిల్లీలోనే ఉన్న రేవంత్ రెడ్డి.. జగ్గారెడ్డి వ్యవహార శైలిపై ఇప్పటికే హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అధికార పార్టీలో కొనసాగుతున్న విమర్శలు..
అధికార టీఆర్‌ఎస్‌లోనే ఇదే తంతు కొనసాగుతూ ఉంది. సొంత పార్టీ నేతలు పరస్సర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఏకంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఆ పార్టీ నేత తీగల కృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. మహేశ్వరం ప్రాంతం నాశనం కావడానికి కాంగ్రెస్ నుంచి టిఆర్‌ఎస్‌లోకి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి అంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. సబితా కూడా తీగల వ్యాఖ్యలపై స్పందించారు. స్థానిక నేతలు తీగలను తప్పుదారి పట్టించి ఉంటారని తప్పుకున్నారు. సబితపై తీగల వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన పార్టీ టిఆర్‌ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం ఊపందుకున్నప్పటికీ తీగల నేను కారు దిగేది లేదని, టిఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని ప్రకటించారు.
కొల్లాపూర్ కొట్లాట ఇంకా సద్దుమణుగలేదు. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన హర్షవర్దన్ రెడ్డిపై ధూమ్‌ధామ్ చేస్తున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో ఉంటారా? పోతారా? తెలియడంలేదు. ఆయన పార్టీ వీడుతారని, కాంగ్రెస్‌లో ఈనెల 11న చేరుతారనే ప్రచారం జరుగుతున్నా జూపల్లి ఖండించడంలేదు. టీఆర్‌ఎస్‌కు నియోజకవర్గాల్లో మంచి పట్టున్న నేతలు ఆపార్టీ నుంచి వీడుతున్నారనే ప్రచారాన్ని, అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలను టిఆర్‌ఎస్ హైకమాండ్ సీరియస్‌గా తీసుకున్నట్లు అయితే లేదు.
హుస్నాబాద్‌లో టిఆర్‌ఎస్‌కు కీలక నేత ప్రవీణ్ రెడ్డి, మహేశ్వరంలో కీలక నేత తీగల కృష్ణారెడ్డి, కొల్లాపూర్‌లో కీలక నేత జూపల్లి ఈ ముగ్గురు కీలక నేతలు టీఆర్‌ఎస్ వీడుతున్నట్లు బహిరంగంగానే ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్ నష్టనివారణ చర్యలు మాత్రం తీసుకోవడంలేదు. నిన్న బడంగ్‌పేట మేయర్, కార్పోరేటర్లు అధికార పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరినప్పటికీ టిఆర్‌ఎస్ హైకమాండ్ పట్టించుకోకపోవడం వెనుక వ్యూహం ఏంటో తెలియక టీఆర్‌ఎస్ శ్రేణులు అయోమయంలో ఉన్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..