YS Jagan: చదువుతోనే పేదరికం పోతుంది.. విద్యార్థుల కోసమే బైజూస్‌తో ఒప్పందం: సీఎం వైఎస్ జగన్
సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. నాడు-నేడు కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న సుమారు 47లక్షల మంది విద్యార్థులకు ఈ రోజు శుభ దినమంటూ పేర్కొన్నారు.
Jagananna Vidya Kanuka: పేదరికం నుంచి బయటపడాలంటే అందరికీ చదువు అవసరమని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుందని జగన్ అభిప్రాయపడ్డారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ‘జగనన్న విద్యాకానుక’ కిట్లను సీఎం జగన్ మోహన్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. నాడు-నేడు కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న సుమారు 47లక్షల మంది విద్యార్థులకు ఈ రోజు శుభ దినమంటూ పేర్కొన్నారు. రూ.931కోట్లతో విద్యాకానుక కిట్లు అందజేస్తున్నట్లు జగన్ వివరించారు. విద్యార్థుల కోసం బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకుని యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. బైజూస్ ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తామన్నారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని తెలిపారు.
వచ్చే ఆగస్టు నెలలో 8వ తరగతి విద్యార్థులందరికీ ఒక్కొక్కటి 12 వేల విలువచేసే ట్యాబ్స్ పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అమ్మ ఒడిలాంటి పథకాలతో పిల్లల చదువు కోసం భారీ ఎత్తున ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. పిల్లలకు తాను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు మాత్రమే అని సగర్వంగా చెప్పగలుగుతున్నానని జగన్ పేర్కొన్నారు. 50 కోట్లతో ఆదోనిలో రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విద్య కోసం పెద్ద ఎత్తున బడ్జెట్‌ను కేటాయించిందన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా విద్య కోసం ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేయలేదని.. అందరికీ నాణ్యమైన విద్య అందించడమే సీఎం జగన్ లక్ష్యమన్నారు.