బీమా డబ్బులు వచ్చాయంటూ మాయమాటలు.. ఇలాంటి వారు కూడా ఉంటారు.. తస్మాత్‌ జాగ్రత్త!

మీకు లాటరీ తగిలిందనో, మీకో బహుమతి వచ్చిందనో, లక్షల రూపాయల డబ్బులు వచ్చాయనో ఎవరైనా ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేస్తే తొందరపడకండి..

బీమా డబ్బులు వచ్చాయంటూ మాయమాటలు.. ఇలాంటి వారు కూడా ఉంటారు.. తస్మాత్‌ జాగ్రత్త!
Insurance Policy
Jyothi Gadda

|

Sep 29, 2022 | 9:34 PM

బీమా డబ్బులు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సిద్ధిపేట జిల్లా, చేర్యాల పోలీసులు పట్టుకొని రిమాండ్‌కి తరలించారు. జల్సాలకు అలవాటు పడిన కామారెడ్డి జిల్లాకు చెందిన విస్లవాత్ నారాయణ, రాథోడ్ బాలాజీ అనే ఇద్దరు వ్యక్తులు అమాయకులను మోసగించి, అప్పనంగా డబ్బులు గుంజుతున్నారు. ఈనెల 22వతేదీన చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామనికి చెందిన ఇద్దరు వ్యక్తులకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఫోన్ చేస్తున్నామని, ప్రధాన మంత్రి సురక్ష బీమా పథకం ద్వారా 4లక్షల20వేలు వచ్చాయని, అందుకుగాను కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని, ఆ డబ్బు చెల్లిస్తే మీకు బీమా డబ్బులు వస్తాయని మాయమాటలతో బురిడీ కొట్టించారు నారాయణ, రాథోడ్‌ బాలజీ అనే యువకులు.

నాలుగు లక్షలకు ఆశపడ్డ సదరు వ్యక్తులు నిజమేనని నమ్మి, నేరగాళ్ళు ఫోన్‌లో అడిగిన 30 వేల రూపాయలు ముట్టజెప్పారు. ఫోన్‌పే ద్వారా డబ్బులు చెల్లించిన తరువాత, రెండ్రోజులకు తిరిగి మళ్ళీ ఫోన్‌. అదే డిమాండ్‌. కాకపోతే ఈసారి డిమాండ్‌ చేసిన డబ్బులు డబుల్‌ అయ్యాయి. అక్షరాలా 60 వేల రూపాయలు ఖర్చుల కోసం చెల్లిస్తే, మీకు రావాల్సిన 4 లక్షల 20 వేలు మీచేతికొస్తాయని నమ్మబలికారు మోసగాళ్ళు. దీంతో అనుమానం వచ్చిన సదరు వ్యక్తులు గ్రామ సర్పంచ్‌ని ఆశ్రయించడంతో మోసపోయిన విషయం తేటతెల్లం అయ్యింది. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి సైతం ఇలాగే ఫోన్‌ వచ్చిన విషయం బయటపడింది. మోసగాళ్ళ మొబైల్ నంబర్లతో సహా చేర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు.

కేసు నమోదు చేసుకొని, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల మొబైల్‌ నంబర్లను ట్రాప్‌ చేయడంతో మోసగాళ్ళు చేర్యాలలో ఉన్నట్టు తెలిసింది. గురువారం ఉదయం చేర్యాలలో ఉన్న నిందితులను చాకచక్యంగా పట్టుకొని, అరెస్టు చేశారు పోలీసులు. నిందితులు విస్లవాత్ నారాయణ , రాథోడ్ బాలాజీలు కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తులు. జల్సాలకు అలవాటు పడి ఇలాంటి మోసాలు చేస్తున్నారని దర్యాప్తులో తేలింది. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్ మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి, నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్టు వెల్లడించారు.

అందుకే ప్రజలు తస్మాత్‌ జాగ్రత్తగా ఉండాలంటున్నారు అధికారులు. మీకు లాటరీ తగిలిందనో, మీకో బహుమతి వచ్చిందనో, లక్షల రూపాయల డబ్బులు వచ్చాయనో ఎవరైనా ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేస్తే తొందరపడకండని సలహా ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu