Indiramma Houses Scheme: ఇందిరమ్మ ఇళ్లపై భారీ గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. త్వరలో వారికి స్థలంతో పాటు ఇళ్లు ఫ్రీ..
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షల మంది అర్హులు ఎదురుచూస్తున్నారు. తమకు ప్రభుత్వం నుంచి ఎప్పుడెప్పుడు మంజూరు అవుతాయా అని కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. వీరికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో వారికి ఇంటి స్థలంతో పాటు ఇళ్లను మంజూరు చేయనుంది.

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని వెంటనే ప్రారంభించి అర్హులైనవారికి కొత్త ఇళ్లను మంజూరు చేస్తోంది. దశలవారీగా అర్హులకు ఇళ్లను మంజూరు చేస్తూ నిధులు విడుదల చేస్తోంది. ఇళ్లు పూర్తయ్యే దశలను బట్టి ప్రతీవారం లబ్దిదారులకు నిధులు విడుదల చేస్తోంది. ప్రస్తుతం గ్రామాలు, పట్టణాల్లో ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి లబ్ది చేకూర్చుతుండగా.. త్వరలో నగరాల్లో ఉంటున్నవారికి కూడా ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మరో కీలక అప్డేట్ ఇచ్చారు.
వారికి ఉచితంగా స్థలం, ఇళ్లు
ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరో శుభవార్త అందించారు. త్వరలోనే పట్ణణాల్లో ఉండే పేదలకు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. ప్రభుత్వమే ఇంటి స్థలం కేటాయించి నిర్మాణానికి నిధులు అందిస్తుందని తెలిపారు. త్వరలోనే ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. జనవరి 26న మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని రైతులకు సబ్సిడీ కింద ఆయన యంత్రాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే మూడు నెలల్లో లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలను పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. మిగతా ఇళ్ల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుందని, వాటిని కూడా వీలైనంత త్వరగా ప్రారంభిస్తామన్నారు.
72 గజాల స్థలం కేటాయింపు
పట్టణ ప్రాంతాల్లోని పేదలకు త్వరలో ఉచితంగా 72 గజాల స్థలం కేటాయిస్తామన్నారు. ఆ స్థలంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని పొంగులేటి తెలిపారు. పట్టణాల్లో ఇళ్లు కట్టుకోవడానికి చాలామందికి సొంత స్థలాలు లేవు. వారికి ప్రభుత్వం 72 గజాల స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వనుంది. ఇప్పటికే అధికారులు ఇందుకోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.
వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీ
రైతులకు వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీ అందిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రైతులకు ఉపయోగపడే యంత్రాలు, పరికరాలపై రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల రైతులపై భారం తగ్గుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రైతులకు ఈ పథకం అమలవుతోందన్నారు. రైతులు దీనిని ఉపయోగించుకోవాలని కోరారు. అటు ఇటీవల సన్నబియ్యం పండించిన రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ అందించినట్లు స్పష్టం చేశారు. ఇక రైతు భరోసా పథకం నిధులు త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు.
