AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐఏఎస్ క్వార్టర్స్‌లో ‘డాగ్ ఫైట్’.. పెంపుడు కుక్క చిచ్చు.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన అధికారులు!

హైదరాబాద్ మహానగరంలోనే అత్యంత విలాసవంతమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని ఐఏఎస్ క్వార్టర్స్ బుధవారం (ఏప్రిల్ 15) ఒక హైడ్రామా చోటు చేసుకుంది. సమాజంలో అత్యున్నత హోదాల్లో ఉండి, వేలాది మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఐఏఎస్ అధికారుల మధ్య ఒక చిన్న 'పెంపుడు కుక్క' వ్యవహారం చినికి చినికి గాలివానలా మారింది.

ఐఏఎస్ క్వార్టర్స్‌లో 'డాగ్ ఫైట్'.. పెంపుడు కుక్క చిచ్చు.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన అధికారులు!
Pet Dog Controversy
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: Apr 15, 2026 | 5:46 PM

Share

హైదరాబాద్ మహానగరంలోనే అత్యంత విలాసవంతమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని ఐఏఎస్ క్వార్టర్స్ బుధవారం (ఏప్రిల్ 15) ఒక హైడ్రామా చోటు చేసుకుంది. సమాజంలో అత్యున్నత హోదాల్లో ఉండి, వేలాది మందికి ఆదర్శంగా నిలవాల్సిన ఐఏఎస్ అధికారుల మధ్య ఒక చిన్న ‘పెంపుడు కుక్క’ వ్యవహారం చినికి చినికి గాలివానలా మారింది. చివరికి ఈ గొడవ కాస్తా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి, ఎఫ్ఐఆర్ నమోదు వరకు వెళ్లడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ గొడవకు ప్రధాన సూత్రధారి ఒక పెంపుడు కుక్క. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి సుతన్, ఫిర్యాదుదారు నితికా సింగ్. ఇద్దరూ ఇరుగు పొరుగునే నివసిస్తున్నారు. నితికా సింగ్‌కు చెందిన పెంపుడు కుక్క, సుతన్ ఇంటి ముందు మలవిసర్జన చేసిందనేది అసలు సమస్య. తమ ఇంటి ఆవరణ అపరిశుభ్రం అవుతోందన్న ఆగ్రహంతో సుతన్ ఒక్కసారిగా సంయమనం కోల్పోయారు. కుక్క చేసిన పనికి ఆగ్రహించిన సుతన్, ఆమె ఇంటి వద్దకు వెళ్లి నానా హంగామా సృష్టించారు. ఇంట్లో ఉన్న సహాయక సిబ్బందిపై ఆయన తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. అంతేకాదు ఆగ్రహంతో ఊగిపోతూ నితికా సింగ్ ఇంటి తలుపులను గట్టిగా బాది భయభ్రాంతులకు గురిచేశారు. ఇంటి ముందు అలంకరణ కోసం ఉంచిన పూల కుండీలను సైతం ఆయన ధ్వంసం చేశాడు.

ఒక ఐఏఎస్ అధికారి స్థాయి వ్యక్తి, చిన్న విషయానికి ఇలా వీధి గొడవకు దిగడం, విధ్వంసానికి పాల్పడటం తమను షాక్‌కు గురిచేసిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హఠాపరిణామంతో తాము ఆందోళన చెంది పోలీసులను ఆశ్రయించామని ఆమె తెలిపారు. . ఒక చిన్న పెంపుడు కుక్క చేసిన పనికి ఇంతటి విధ్వంసానికి దిగడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కచ్చితంగా ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై నితికా సింగ్ ఫిర్యాదును స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు వెంటనే స్పందించారు. కొత్తగా అమల్లోకి వచ్చిన భారత న్యాయ సంహిత (BNS) కింద వివిధ సెక్షన్ల కింద సుతన్‌పై కేసు నమోదు చేశారు. అత్యున్నత స్థాయి అధికారులు కావడంతో పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక వివరాలు సేకరించిన పోలీసులు, అవసరమైతే అక్కడి సీసీటీవీ ఫుటేజీని కూడా విశ్లేషించనున్నారు.

నిత్యం ఫైళ్లతో, ప్రజా సమస్యలతో కుస్తీ పట్టే ఉన్నతాధికారులు.. ఇలా తమ వ్యక్తిగత పంతాల కోసం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం ఐఏఎస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పెంపుడు జంతువుల పెంపకంలో పాటించాల్సిన కనీస నిబంధనలు, పొరుగువారితో ఉండాల్సిన సయోధ్యపై ఈ ఘటన మరోసారి చర్చకు దారి తీసింది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది..? పోలీసులు ఈ కేసులో అన్నీ పరిశీలించి తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us