AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI Selection : బీసీసీఐ సెలక్షన్ కమిటీపై విరుచుకుపడ్డ మంజ్రేకర్.. రోహిత్ శర్మ ఎంపికపై సూటి ప్రశ్నలు

BCCI Selection : ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు యశస్వి జైస్వాల్‌ను పక్కనబెట్టి రోహిత్ శర్మను ఎంపిక చేయడంపై సంజయ్ మంజ్రేకర్ తీవ్ర విమర్శలు చేశారు. 2027 వరల్డ్ కప్ ప్రణాళికలు, సెలక్షన్ కమిటీ నిర్ణయాలు, వైభవ్ సూర్యవంశీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

BCCI Selection : బీసీసీఐ సెలక్షన్ కమిటీపై విరుచుకుపడ్డ మంజ్రేకర్.. రోహిత్ శర్మ ఎంపికపై  సూటి ప్రశ్నలు
Bcci Selection
Rakesh
|

Updated on: Jun 25, 2026 | 9:39 AM

Share

BCCI Selection : వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన జట్టు ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరలేపింది. సెలక్టర్లు సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మపై మరోసారి నమ్మకం ఉంచి అతడిని జట్టులోకి తీసుకున్నారు. రోహిత్ శర్మకు ఉన్న అనుభవం, క్లాస్ గురించి ఎవరికీ ఎలాంటి సందేహాలు లేకపోయినప్పటికీ, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ఈ సిరీస్ నుంచి పక్కనబెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై టీమ్ ఇండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ ఓపెన్‌గా స్పందిస్తూ సెలక్షన్ కమిటీ తీరును గట్టిగా తప్పుబట్టారు.

యశస్వి జైస్వాల్ గత కొన్ని వన్డే మ్యాచ్‌లలో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. తను ఆడిన చివరి మూడు వన్డే ఇన్నింగ్స్‌లలో ఏకంగా రెండు సెంచరీలు బాదాడు. సౌతాఫ్రికాపై అజేయంగా 116 పరుగులు చేసిన జైస్వాల్, ఆ తర్వాత అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో కూడా 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇంతటి సూపర్ ఫామ్‌లో ఉన్న యువ ఆటగాడిని సుదీర్ఘ కాలం పాటు జట్టులో కొనసాగించకుండా డ్రాప్ చేయడం చాలా దారుణమని మంజ్రేకర్ అన్నారు. బలమైన భారత వన్డే జట్టులో ఓపెనింగ్ చేసే అవకాశాన్ని జైస్వాల్ రెండు చేతులా ఉపయోగించుకున్నాడని, అలాంటి ప్లేయర్‌ను తొలగించడం అతడి పట్ల తీవ్ర అన్యాయమే అవుతుందని స్పష్టం చేశారు.

2027 వరల్డ్ కప్ ప్లాన్స్ ఏంటి బాసూ?

రోహిత్ శర్మ సెలక్షన్‌ను ప్రస్తావిస్తూ మంజ్రేకర్ సెలక్టర్ల ముందు కొన్ని సూటి ప్రశ్నలు ఉంచారు. “సెలక్టర్లు రోహిత్‌ను జట్టులోకి తీసుకున్నారంటే, వారు ఖచ్చితంగా అతనిని 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో భాగంగా చూస్తున్నారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ అది నిజమైతే సెలక్టర్లు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలి” అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ అన్నారు. భారత క్రికెట్‌లో పెద్ద పేరున్న ఆటగాళ్ల చుట్టూ ఉండే కల్చర్ ఎలాంటిదో మనకందరికీ తెలుసని, కేవలం క్రికెట్ మెరిట్ ఆధారంగా మాత్రమే ఇక్కడ నిర్ణయాలు జరగడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

పెద్ద పేర్ల కోసం కాదు.. టీమిండియా కోసమే సెలక్షన్స్

టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్లు పెద్ద పేర్ల ప్రభావాన్ని దాటి ఆలోచించాల్సిన సమయం వచ్చిందని మంజ్రేకర్ హితవు పలికారు. కేవలం జట్టు నుంచి తొలగించడం ఇష్టం లేకనో, లేదా వారికున్న క్రేజ్ చూసో సీనియర్లను ఎంపిక చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఇది భారత క్రికెట్‌ను ఎన్నేళ్లుగానో వేధిస్తున్న పాత సమస్య అని గుర్తు చేశారు. సెలక్షన్ అనేది ఎప్పుడూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేదా జస్ప్రీత్ బుమ్రా లాంటి ఆటగాళ్లకు ఏది మంచిది అనే కోణంలో జరగకూడదని.. కేవలం భారత క్రికెట్‌కు ఏది మంచిది అనే ఏకైక లక్ష్యంతోనే జరగాలని బీసీసీఐకి గట్టిగా సూచించారు.

15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్‌పై ప్రశంసలు

ఇదే సమయంలో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి కూడా సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల శ్రీలంక ఎ జట్టు ఆటగాడితో జరిగిన చిన్న వివాదం తర్వాత వైభవ్ మంచి పాఠం నేర్చుకున్నాడని చెప్పారు. వైభవ్ చాలా పరిణతి చెందిన, తెలివైన ఆటగాడని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను అతను మరింత మెరుగ్గా హ్యాండిల్ చేయగలడని నమ్మకం వ్యక్తం చేశాడు. రాబోయే ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో ఈ యువ క్రికెటర్ అద్భుతంగా రాణించి తన ప్రతిభను నిరూపించుకోవాలని మంజ్రేకర్ ఆకాంక్షించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us