Sachin Tendulkar : 50 కార్లు పట్టే బేస్‌మెంట్.. సచిన్ టెండూల్కర్ రూ. 100 కోట్ల ఇల్లు స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Sachin Tendulkar : రూ.100 కోట్ల విలువైన సచిన్ టెండూల్కర్ ముంబై బాంద్రా బంగ్లా ప్రత్యేకతలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 50 కార్లు పట్టే బేస్‌మెంట్, సముద్ర వీక్షణ, లగ్జరీ ఇంటీరియర్స్, భారీ గార్డెన్, ఖరీదైన కార్ల కలెక్షన్‌తో ఈ ఇల్లు అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

Sachin Tendulkar : క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులు సృష్టించిన గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ జీవనశైలి కూడా అంతే లగ్జరీగా ఉంటుంది.. ముంబైలోని అత్యంత ఖరీదైన ఏరియా బాంద్రాలో సచిన్‌కు ఒక అద్భుతమైన ప్యాలెస్ లాంటి ఇల్లు ఉంది.. ప్రస్తుతం ఈ ఇంద్రభవనం విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుంది.. కేవలం ఇల్లు మాత్రమే కాదు, ఈ ఇంటి లోపల ఉండే వసతులు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.
ముంబైలోని బాంద్రా ఏరియాలో ఉన్న పెర్రీ క్రాస్ రోడ్డులోని 19-A అడ్రస్ అంటే తెలియని క్రికెట్ ఫ్యాన్ ఉండడు. ఎందుకంటే అది మన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నివాసం. అయితే సచిన్ దీనిని కొనకముందు.. అంటే 1926 కాలంలో దీనిని దొరాబ్ విల్లా అని పిలిచేవారు. వార్డెన్స్ కుటుంబానికి చెందిన ఈ పురాతన హెరిటేజ్ బంగ్లాను సచిన్ టెండూల్కర్ 2007వ సంవత్సరంలో సుమారు రూ.39 కోట్లకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ప్రముఖ ఆర్కిటెక్ట్ ప్రకాష్ సప్రే ఆధ్వర్యంలో ఈ ఇంటి రూపురేఖలను మార్చడానికి ఏకంగా నాలుగేళ్ల సమయం పట్టింది. ఆధునిక హంగులన్నీ అద్దుకుని 2011లో సచిన్ తన కుటుంబంతో కలిసి ఈ ఇంట్లోకి మారారు.
ఈ ఇల్లు బయటకు పాతకాలపు రాచరికపు కోటలా కనిపించినప్పటికీ, లోపల మాత్రం అత్యంత ఆధునికమైన అంతర్జాతీయ స్థాయి వసతులను ఏర్పాటు చేశారు. దాదాపు 6,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లాలో మూడు అంతస్తులు, విశాలమైన టెర్రస్, రెండు అండర్‌గ్రౌండ్ బేస్‌మెంట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి చూస్తే అరబిక్ సముద్రం స్పష్టంగా కనిపిస్తుంది. ముంబైలోనే అత్యంత విలాసవంతమైన వ్యూ ఉన్న ఇళ్లలో సచిన్ ఇల్లు కూడా ఒకటి. ఈ ఇంటి లోపలి గోడలు, రూమ్స్ సచిన్ క్రికెట్ కెరీర్ జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఒక స్క్రాప్‌బుక్‌లా డిజైన్ చేయబడి ఉంటాయి.

పెద్ద చెక్క తలుపు దాటుకుని లోపలికి వెళ్లగానే అద్భుతమైన మార్బుల్ ఫ్లోరింగ్, ఇరువైపులా అందమైన పూల కుండీలతో లివింగ్ రూమ్ స్వాగతం పలుకుతుంది. బ్రౌన్, వైట్ కలర్ కాంబినేషన్‌లో ఉండే ఈ రూమ్‌లో విలాసవంతమైన సోఫాలు, కలర్‌ఫుల్ కుషన్‌లు, ఐవరీ ల్యాంప్‌లు ఉన్నాయి. మరొక ఫార్మల్ సిట్టింగ్ ఏరియాలో టెర్రకోట సోఫాలు, టర్కిష్ కార్పెట్లు, ఆకట్టుకునే పెయింటింగ్స్ ఉంటాయి. ఇక్కడ మోడ్రన్ డిజైన్‌తో పాటు భారతీయ సాంప్రదాయ కళలు ఉట్టిపడేలా బ్రాస్ (ఇత్తడి) శిల్పాలను కూడా అలంకరించారు.
సచిన్ టెండూల్కర్‌కు దైవభక్తి చాలా ఎక్కువ. అందుకే తన ఇంట్లో ఒక ప్రశాంతమైన పూజా గదిని నిర్మించుకున్నారు. ఈ దేవుడి గదిలోనే దేవుడి విగ్రహాలతో పాటు, తన కెరీర్‌లో అత్యంత ప్రాణంగా చూసుకున్న ఒక ప్రత్యేక క్రికెట్ బ్యాట్‌ను కూడా ఉంచి రోజూ పూజలు చేస్తారు. ఇక ఇంటి బయట సచిన్‌కు అత్యంత ఇష్టమైన పచ్చని తోట ఉంది. ఇందులో పెద్ద పెద్ద తాటి చెట్లు, ఒక చిన్న చెరువు, ఉష్ణమండల మొక్కలు, కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చోవడానికి వీలుగా కేన్ ఫర్నిచర్ వేశారు. పై అంతస్తులో ఉన్న టెర్రస్‌పై సచిన్, అతని కొడుకు అర్జున్ టెండూల్కర్ రోజూ ఉదయం యోగా, మెడిటేషన్, వర్కవుట్స్ చేస్తారు.

ఈ ఇంటి లగ్జరీ ఒకెత్తయితే.. ఇక్కడి అండర్‌గ్రౌండ్ బేస్‌మెంట్ మరొకెత్తు. సచిన్‌కు స్పీడ్ కార్లు అంటే ఎంత క్రేజో మనకు తెలిసిందే. అందుకే తన కార్ల కలెక్షన్ కోసం ఏకంగా 50 కార్లు పార్కింగ్ చేసుకునేలా భారీ బేస్‌మెంట్‌ను నిర్మించారు. సచిన్ గ్యారేజీలో రూ.2.6 కోట్ల విలువైన రెడ్ కలర్ బిఎమ్‌డబ్ల్యూ i8, రూ. 3.35 కోట్ల విలువైన పోర్షే 911 టర్బో ఎస్, ఇండియాలోనే మొదటి వేరియంట్ అయిన బిఎమ్‌డబ్ల్యూ X5 M50d లాంటి ఎన్నో ఖరీదైన లగ్జరీ కార్లు మెరుస్తూ ఉంటాయి.
2007లో సచిన్ ఈ ప్రాపర్టీని రూ. 39 కోట్లకు కొనుగోలు చేయగా, ప్రస్తుతం దీని మార్కెట్ విలువ రూ.100 కోట్లు దాటిపోయింది. కేవలం ఇంటి ఇంటీరియర్ డిజైన్ కోసమే సచిన్ దాదాపు రూ.25 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఈ బాంద్రా ఇల్లే కాకుండా ముంబైలోని బికెసిలో ఉన్న రుస్తుంజీ సీజన్స్ అపార్ట్‌మెంట్‌లో సచిన్ దంపతులకు 1,600 చదరపు అడుగుల మరో ఫ్లాట్ కూడా ఉంది. దీనిని 2018లో రూ.7.15 కోట్లకు కొని అంజలి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. సింగపూర్‌కు చెందిన ప్రఖ్యాత డిజైనర్ డేవిడ్ టే దీనిని డిజైన్ చేశారు. అయితే, బాంద్రాలోని సచిన్ ప్రధాన నివాసం లోపలికి పర్యాటకులకు ఎవరికీ అనుమతి లేదు. అభిమానులు కేవలం బయటి నుంచి మాత్రమే ఈ భవనాన్ని చూసి ఫోటోలు తీసుకుంటారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
