Telangana: ‘ప్లీజ్.! అతన్ని పట్టుకోండి..’ హైదరాబాద్ పోలీసులకు వాహనదారుడి రిక్వెస్ట్.. అసలేం జరిగిందంటే?
"నా హెల్మెట్ చోరీ చేశారు సార్ దొంగలను పట్టుకోండి" అంటూ హైదరాబాద్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ యువకుడు..
హైదరాబాద్, జూలై 20: “నా హెల్మెట్ చోరీ చేశారు సార్ దొంగలను పట్టుకోండి” అంటూ హైదరాబాద్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ యువకుడు. స్థానికంగా అమీర్‌పేటలో ఉండే యువకుడు సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్(AAA) సినిమాస్‌కు వెళ్లాడు. సినిమా చూసేందుకు వెళ్లిన అతడు బైక్‌కు హెల్మెట్ పెట్టేసి వెళ్ళిపోయాడు. సినిమా ముగిసిన వెంటనే బయటికి వస్తున్న క్రమంలో అతడి బైక్‌కు ఉన్న హెల్మెట్‌ను మరో ఇద్దరు యువకులు స్పోర్ట్స్ బైక్ మీద వచ్చి ఎత్తుకెళ్లారు. దీంతో తన హెల్మెట్ పోయిందంటూ హైదరాబాద్ సిటీ పోలీసులకు ట్విట్టర్లో యువకుడు ఫిర్యాదు చేశాడు.
దీనికి స్పందించిన హైదరాబాద్ సిటీ పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని యువకుడికి సూచించారు. ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని యువకుడు రిప్లై ఇవ్వగా, అమీర్‌పేట ఏరియా ఎస్ఆర్ నగర్ కిందికి వస్తుంది కాబట్టి ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందిగా యువకుడికి హైదరాబాద్ పోలీసులు సూచించారు. హెల్మెట్ దొంగలించిన యువకుల ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టాడు బాధిత యువకుడు. స్థానికంగా ఉండే సీసీ కెమెరాల ద్వారా తన హెల్మెట్‌ను కొట్టేస్తున్న ఫుటేజ్‌ను చూసి అవాక్కయ్యాడు సదరు బాధితుడు.
కాగా, సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ప్రకారం.. ఇద్దరు యువకులు కెటిఎమ్ బైక్‌పై వచ్చి చోరీ చేసినట్టు స్పష్టంగా కనిపించింది. ఇద్దరు యువకుల్లో బండి నడుపుతున్న యువకుడు పింక్ కలర్ ప్యాంట్ ధరించగా, వెనకల కూర్చున్న యువకుడు వైట్ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించాడు. తన హెల్మెట్ దొరికేలా చూడాలని సదరు బాధితుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.
These 2 People Stealing Helmets in Hyderabad. Yesterday Night They Stolen my Helmet in AAA Cinemas,@hydcitypolice @HYDTP Could U Please Help me Sir#theft #WhatisProjectK #HyderabadRains #hyderabad pic.twitter.com/a2Ix0KWWNn
— Aslam Shaik (@always_aslam) July 19, 2023