CM KCR: వ్యూహం మార్చిన గులాబీ బాస్.. ఆ నియోజకవర్గం నుంచి పోటీ..

సీఎం కేసిఆర్ నియోజ‌క‌వ‌ర్గం షిప్ట్ అవుతున్నారా..? అవును ఉద్యమకాలం నుండి పోటి చేసే ప్లేస్ మారుస్తూ.. ఎక్కడ వీక్‌గా ఉంటే అక్కడి నుండి పోటి..

CM KCR: వ్యూహం మార్చిన గులాబీ బాస్.. ఆ నియోజకవర్గం నుంచి పోటీ..
CM KCR
Follow us
Prabhakar M

| Edited By: Ravi Kiran

Updated on: Jul 20, 2023 | 3:42 PM

కామారెడ్డి, జూలై 20: సీఎం కేసిఆర్ నియోజ‌క‌వ‌ర్గం షిప్ట్ అవుతున్నారా..? అవును ఉద్యమకాలం నుండి పోటి చేసే ప్లేస్ మారుస్తూ.. ఎక్కడ వీక్‌గా ఉంటే అక్కడి నుండి పోటి చేసి సెట్ రైట్ చేసే గులాబీ బాస్ ఇప్పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకున్నారట. గ‌త కొద్దిరోజులుగా ఈ ప్రచారం ఉన్న ఈ రెండు, మూడు రోజులుగా భారీస్థాయిలో ప్రచారం జ‌రుగుతుంది. అటు పార్టీకి కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లను చూస్తుంద‌ట. ఇప్పటికే స‌ర్వేల‌తో పాటుగా, పెద్ద సార్ కోసం గ్రౌండ్‌ను ప్రిపరేషన్ జ‌రుగుతోందట. ఇంత‌కీ సార్ ఎక్కడికి వెళుతున్నారు. ఎక్కడి నుండి బ‌రిలో దిగుతున్నారు.

కరీంన‌గ‌ర్ టూ కామారెడ్డి..

ఉద్యమ స‌మ‌యంలో ఎప్పుడు ఉద్యమాన్ని ఉరకలెత్తించాలన్నా, ఎక్కడ వీక్‌గా అనిపించినా అక్కడి నుండి పోటి చేసే వారు సిఎం కేసిఆర్. కరీంన‌గ‌ర్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ లో పోటి ఇలా మొద‌ల‌యిందే… ఈసారి ఎన్నికల్లో గజ్వేల్కు గుడ్ బై చెప్పి కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సర్వే రిపోర్టుల ఆధారంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నార‌ట…సర్వే రిపోర్టు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో సీఎం కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సిట్టింగులకు సంబంధించి ఇప్పటికే సర్వే రిపోర్టులు సిద్ధం చేయించిన ముఖ్యమంత్రి ఆ నివేదికల ఆధారంగా టికెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యార‌ట‌. ఈ క్రమంలోనే కామారెడ్డిలో నిర్విహంచిన సర్వేలో ఎమ్మెల్యే గంప గోవర్థన్ పనితీరుపై పూర్తిగా నెగ‌టివ్ ఫీడ్ బ్యాక్ వ‌చ్చిందట. గంప గోవర్థన్‌కు మళ్లీ టికెట్ ఇవ్వడం, అభ్యర్థిని మార్చడం, కేసీఆర్ స్వయంగా పోటీ చేయడం తదితర అంశాలపై స్థానికుల అభిప్రాయాలు తీసుకోగా మెజార్టీ జనం గంపను మళ్లీ బరిలో దింపితే పార్టీకి క‌ష్టమే అనే అభిప్రాయాన్ని చెప్పార‌ట. దీంతో సిఎం కేసిఆర్ యే బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్నారట.

సిఎం మూలాలు ఇక్కడే..

ఇక సీఎం స్వగ్రామం కామారెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గం, దోమకొండ మండలం పోసానిపల్లే. ప్రస్తుతం దీనిని కొనాపూర్‌గా పిలుస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానేరు డ్యాం నిర్మాణంతో సొంతూరు ముంపుకు గురవ్వగా, కేసీఆర్‌ కుటుంబం ఆ నాడు సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామానికి వలస వెళ్లింది. ఈ విషయాన్నే కేటీఆర్ కామారెడ్డి పర్యటనలో స్వయంగా వెల్లడించారు. ఇక్కడ పోటీ చేస్తే కేసీఆర్‌కు సొంతూరు సెంటిమెంట్‌ కలిసి వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ఉద్యమ కాలంలో న‌ల్లబెల్లం మ‌ద్దతు ధ‌ర కోసం పోరాటం మొద‌లుపెట్టింది ఇక్కడే కావ‌డంతో ఇప్పుడు మ‌రోసారి ఇక్కడి నుండి బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్నార‌ట. దీంతో పాటుగా గ‌త కొద్దికాలంగా కామారెడ్డి నిదుల వ‌ర‌ద పారిస్తున్నారు. గ‌త సంవ‌త్సర కాలంగా వంద కోట్ల నిదులు మంజూరు చేసారు. మెడిక‌ల్ కాలేజితో పాటుగా కళాభ‌వ‌న్, ఆడిటోరియం, క‌లెక్టరేట్, ఎస్పీ అఫీసు ప్రారంబోత్సవాల‌కు కేసిఆర్ స్వయంగా రావ‌డం కూడ దీనికి బలం చేకూర్చుతుంది. దీంతో అటు స‌ర్వేలు కూడా ఇప్పుడున్న స్థానిక నాయ‌క‌త్వానికి వ్యతిరేకంగా రావ‌డంతో ఈ నిర్ణయంపై ఆలోచిస్తున్నార‌ట.

స్థానిక నాయకులు ఎమ్మెల్యే పై వ్యతిరేకత‌..

ఇక ఇప్పుడున్న ఎమ్మెల్యే గంప గోవ‌ర్దన్ మూడుసార్లు గెలిచారు. దీంతో ఆయ‌నతో పాటుగా ఆయ‌న అనుచ‌రుల‌పై తీవ్ర వ్యతిరేక‌త ఉంది. ఆయన అనుచరుల వ్యవహారశైలి, డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేయకపోవడం, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వ్యవ‌హ‌రాన్ని రచ్చ చేసుకోవ‌డం లాంటివి పార్టీకి పూర్తిగా నెగ‌టివ్‌గా మారాయి. జిల్లా అద్యక్షుడు ముజీబుద్దీన్, ఎమ్మెల్యే గంప ఇద్దరి విష‌యంలో టికెట్ పోరు న‌డ‌వ‌డం కూడా దీనికి కార‌ణం అయింద‌ట. ఇక మాస్టర్ ప్లాన్ విష‌యంలో పూర్తిగా ఎమ్మెల్యేను జిల్లా నాయ‌క‌త్వం త‌ప్పుదోవ ప‌ట్టించింద‌ట.. జిల్లా అద్యక్షుడు ముజీబుద్దీన్ వేసిన శ్రీవారి వెంచ‌ర్‌లో భారిగా అక్రమాలు జ‌రిగాయని దానిలో ఎమ్మెల్యేకు కూడ వాటా ఉన్నట్లు బీజేపీ అప్పుడు తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేసింది.. వెంచ‌ర్ కోసం రోడ్లు వేయ‌డం, రైతుల భూముల‌ను లాక్కోవ‌డం దీని వెనుక ఎమ్మెల్యే ఉన్నాడని, మంత్రులు కూడా ఉన్నార‌ని చెప్పుకోవ‌డం పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేసింద‌ట. మాస్టర్ ప్లాన్ వ్యవ‌హ‌రం రాష్ట్రమంతటా పాకడం ప‌ట్ల అప్పట్లో సిఎం సీరియ‌స్ అయ్యారు. ఈ రిపోర్టులోనూ ఇదే తేలడంతో, ఈ దిశ‌గా సీఎం కేసీఆర్ ఆలోచించ‌డానికి కార‌ణ‌మనే ప్రచారం జ‌రుగుతుంది

ఆ నాలుగు నాలుగు నియోజ‌క‌వ‌ర్గల పై కూడా ఫోక‌స్..

ఇక కేసీఆర్ ఆలోచన వెనుక మరికొన్ని కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి పొరుగున ఉన్న మరో నాలుగు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ వీక్గా ఉంది. ఒకవేళ ముఖ్యమంత్రి కామారెడ్డి నుంచి బరిలో దిగితే పక్కనున్న రామాయంపేట, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్‌తో పాటు జుక్కల్ అసెంబ్లీని కూడా సెట్ చేసుకోవ‌చ్చు అనే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడ బిఆర్ఎస్ పూర్తిగా వీక్‌గా ఉంది. దీంతో వీటిని సెట్ చేసిన‌ట్లు అవుతుంది అనే భావ‌న‌లో ఉంద‌ట పార్టీ. ఈ ప్రచారాన్ని జిల్లాకు సంబంధించిన మంత్రి, ఎమ్మెల్యేలు ఎక్కడ కొట్టిపారేయ‌క‌పోవ‌డంతో దీనికి మరింత బ‌లం చేకూరుస్తుంది.