Virus: వై దిస్ వైరస్ వర్రీ.. అమ్మబాబోయ్.! పెట్రేగిపోతున్న మాయదారి రోగాలు
కరోనా కల్లోలాన్ని మర్చిపోలేదెవరూ. జీవితాంతం వెంటాడే పీడకల ఆ మహమ్మారి. అందుకే కొత్తగా ఏ వైరస్ పేరు విన్నా.. ప్రపంచం ఉలిక్కిపడుతోంది. ఈ సీజన్‌లో ఎవరి నోట విన్నా హ్యూమన్ మెటా న్యూమో వైరస్ మాటే. మరోవైపు మనం ఎప్పుడో చూసిన నోరో వైరస్ ఇప్పుడు అగ్రరాజ్యాన్ని భయపెడుతోంది. పశుపక్ష్యాదులకే పరిమితమనుకున్న బర్డ్ ఫ్లూ అమెరికాలో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఏమిటీ మాయరోగాలు? మనిషి రోగ నిరోధక సామర్థ్యం తగ్గుతోందా? మాయదారి క్రిముల కోరలు పదునెక్కుతున్నాయా?

వైరస్ పుట్టినిల్లు చైనాలో మరో మహమ్మారి జడలు విప్పింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న HMP వైరస్.. ఇండియాని కూడా టచ్ చేసింది. అమెరికా నుంచి మహారాష్ట్ర దాకా బర్డ్ ఫ్లూ కేసులు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. హ్యూమన్ మెటా న్యూమో ప్రాణాంతకం కాదంటూనే.. బీకేర్‌ఫుల్ అంటున్నారు డాక్టర్లు. స్టాక్ మార్కెట్లను కూడా షేక్ చేస్తున్న వైరస్‌లకు విరుగుడేది? అసలే.. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రపంచం. అందుకే ఇప్పుడు తుమ్మినా దగ్గినా భయం. రోగనిరోధక శక్తి తక్కువుంటేనో, సీజన్ మారితేనో.. చిన్నాచితకా అనారోగ్య సమస్యలు కామన్. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నాలుగురోజుల్లో అంతా నార్మల్. కానీ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన తర్వాత ఇప్పుడు కాస్త పడిశం పట్టినా, గొంతు గరగరమన్నా గుండెల్లో దడే. కడుపులో కాస్త మందంగా అనిపిస్తే ఒకప్పుడు ఓ పూట పత్యంచేస్తే సెట్టయ్యేది. కానీ ఇప్పుడు ఏ దిక్కుమాలిన వైరస్ శరీరంలోకి ప్రవేశించిందోనని అనుమానం హార్ట్‌బీట్ పెంచేస్తోంది. ఏం చేస్తాం మరి.. మళ్లీ వచ్చిపడుతున్నాయ్ మాయరోగాలు. చైనాకు రోగమొచ్చింది. ప్రపంచమంతా వణికిపోతోంది. కేసుల ఊసులేదు. ఊహాజనిత ప్రచారాలే తప్ప అధికారికంగా మరణాల సంఖ్య కూడా తెలీదు. చైనాలో మెడికల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారంటూ అనధికార వార్తలు. HMPV..హ్యూమన్ మెటా న్యూమో వైరస్. కరోనాకి కజిన్‌లాంటిదే ఈ వైరస్ కూడా. కరోనా ప్రపంచాన్ని కుదిపేసింది. లక్షల ప్రాణాలను గాల్లో కలిపేసింది. మరి హెచ్‌ఎంపీవీ కూడా అంతే ప్రమాదమా అంటే అవునని చెప్పలేం....
