Hyderabad: సరికొత్త హంగులతో ముస్తాబైన యూఎస్ కాన్సులేట్ కార్యాలయం.. అప్పటినుంచి నానక్‌రామ్‌గూడలో సేవలు..
US Consulate General: హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ సరికొత్త హంగులతో ముస్తాబైంది. ఇన్నిరోజులు బేగంపేట పైగా ప్యాలెస్‌లో సేవలు అందాయి. ఇప్పుడు కొత్త కాన్సులేట్ నానక్‌రామ్‌గూడలో ఓపెన్ కాబోతోంది.
US Consulate General: హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ సరికొత్త హంగులతో ముస్తాబైంది. ఇన్నిరోజులు బేగంపేట పైగా ప్యాలెస్‌లో సేవలు అందాయి. ఇప్పుడు కొత్త కాన్సులేట్ నానక్‌రామ్‌గూడలో ఓపెన్ కాబోతోంది. ఈ నెల 20న కొత్త కాన్సులేట్ భవనం ప్రారంభం కానుంది. 340 మిలియన్ డాలర్ల పెట్టుబడితో నిర్మించిన ఈ అత్యాధునిక భవనం అమెరికా – భారత్‌ల మధ్య బలపడుతోన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనమని, ఈ సందర్భంగా అందించే వివిధ సేవల వివరాలను యూ.ఎస్. కాన్సులేట్ జనరల్ ప్రకటించింది. బేగంపేట్ పైగా ప్యాలెస్‌లో ఈ నెల 15 వరుకు సేవలు కొనసాగనున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 20వ తేదీ 8.30 గంటల వరకు కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని కాన్సులేట్ జనరల్ వెల్లడించింది. అయితే, అత్యవసర సేవలకు అమెరికా పౌరులు HydACS@state.gov కి ఈ- మెయిల్ కూడా చేయవచ్చని ప్రకటిచింది కాన్సులేట్ కార్యాలయం.
అయితే హైదరాబాద్‌లోని ఈ సరికొత్త కాన్సులేట్ భవనం కోసం అమెరికా భారీగా ధనాన్ని వెచ్చించింది. ఓ కార్పొరేట్ కంపెనీల లుక్ వచ్చేలా దీన్ని డిజైన్ చేశారు. ఇలాంటి కాన్సులేట్ భవనం ప్రపంచంలో ఎక్కడా లేదని చెబుతున్నారు అమెరికన్ ఇంజనీర్లు. హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ కావడంతో.. ఇక్కడ భారీ స్థాయిలో కాన్సులేట్ భవనాన్ని నెలకొల్పామంటున్నారు కాన్సులేట్ అధికారులు.
మార్చి 15 వరకు వీసా ఇంటర్వ్యూ ఉన్న దరఖాస్తుదారులు బేగంపేట్‌లోని పైగా ప్యాలెస్‌లో సంప్రదించాలని, మార్చి 23 నుండి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ కోసం నానక్‌రామ్‌గూడలోని కొత్త కార్యాలయానికి వెళ్లాలని కాన్సులేట్ జనరల్ సూచించింది. బయోమెట్రిక్స్ అపాయింట్‌మెంట్‌లు, “డ్రాప్‌బాక్స్” అపాయింట్‌మెంట్‌లు, పాస్‌పోర్ట్ పికప్ సహా ఇతర వీసా సేవలు – హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో ఉన్న వీసా అప్లికేషన్ సెంటర్ లో కొనసాగుతాయి. కాన్సులేట్ మార్పు ప్రక్రియ వల్ల వీసా అప్లికేషన్ సెంటర్ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదని కాన్సులేట్ జనరల్ వివరించారు.
నూతన కార్యాలయం చిరునామా ఇదే..
హైదరాబాద్ లోని యూ.ఎస్. కాన్సులేట్ నూతన కార్యాలయం నానక్‌రామ్‌గూడలో మార్చి 20, ఉదయం 08:30 గంటలకు అధికారికంగా ప్రారంభమవుతుంది. నూతన కార్యాలయం చిరునామా సర్వే నం.115/1, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ, హైదరాబాద్, తెలంగాణ, 500032.
మార్చి 15 నుంచి 20 వరకు సేవలు బంద్.. అత్యవసర సేవల కోసం..
కాగా, బేగంపేట్, పైగా ప్యాలెస్ లో మార్చి 15, మధ్యాహ్నం 12:00 గంటల నుంచి కార్యకలాపాలన్నింటిని నిలిపివేయనున్నారు. మార్చి 20 ఉదయం 08:30 గంటల వరకు కాన్సులేట్ మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు నుండి మార్చి 20 ఉదయం 08:30 వరకు అత్యవసర సేవలు కోరుతున్న అమెరికా పౌరులు, ఈ నంబర్లను సంప్రదించగలరు.. +91 040-4033 8300. మార్చి 20 ఉదయం 08:30 తరువాత, అత్యవసర సేవలు కోరుతున్న అమెరికా పౌరులు ఈ నంబర్ పై సంప్రదించగలరు +91 040 6932 8000. అత్యవసరం కాని సందేహాల కోసం, అమెరికా పౌరులు HydACS@state.gov కి ఈ-మేల్ చేయగలరని కాన్సులేట్ కార్యాలయం పేర్కొంది. వీసా సేవలకి సంబంధించి మీకేమైనా సందేహాలుంటే, +91 120 4844644 లేదా +91 22 62011000 పై కాల్ చేయాలి. నానక్‌రామ్‌గూడ కాన్సులేట్ బదిలీ సమాచారం కోసం కాన్సులేట్ సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవ్వాలని కాన్సులేట్ కార్యాలయం తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..