Hyderabad: కోడలిపై మామ దాడి.. తండ్రిని జైలుకు పంపడం ఇష్టం లేక కొడుకు ఏం చేశాడంటే..
Hyderabad: పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఆసుపత్రిలో ఉన్న బాధితురాలి గాయాల తాలూకు వివరాలు, గాయాల స్వభావం, దాడి విధానం పరిశీలించిన పోలీసులు కొన్ని అనుమానాలకు లోనయ్యారు. ముఖ్యంగా ఆమె గాయాలు కత్తితో దాడి చేసినట్లు స్పష్టంగా ఉండటంతో..

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం మధ్య చోటుచేసుకున్న ఘర్షణ అనంతరం జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కుటుంబ విభేదాల కారణంగా మామ తన కోడలిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం, 68 సంవత్సరాల వయసుగల వెంకటేశ్వర రావు అనే వ్యక్తి, తన కోడలిపై వ్యక్తిగత కక్షతో దాడి చేశాడు. మొదటగా బాధితురాలు ఆస్పత్రిలో చేరిన సమయంలో ఆమె భర్త అరుణ్ ప్రసాద్ విషయం తెలుసుకొని ఈ వయసులో తన తండ్రిని పోలీసులు తీసుకెళ్తే బాగోదని ఈ దాడిని తానే చేసినట్లు పోలీసులకు చెప్పాలని భార్యని సైతం ఒప్పించాడు. బాధితురాలు కూడా అదే కథనాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. ఆమె భర్తతో జరిగిన వాగ్వాదంలో గమనించకుండా గాయపడినట్లు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో దాడి చేసిన మామ పై ఆరోపణలు చేయకుండా భర్తనే తన మీద దాడి చేసినట్లు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు మొదట భర్త అరుణ్ ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే, పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఆసుపత్రిలో ఉన్న బాధితురాలి గాయాల తాలూకు వివరాలు, గాయాల స్వభావం, దాడి విధానం పరిశీలించిన పోలీసులు కొన్ని అనుమానాలకు లోనయ్యారు. ముఖ్యంగా ఆమె గాయాలు కత్తితో దాడి చేసినట్లు స్పష్టంగా ఉండటంతో, ఈ అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. దీంతో కేసులో కీలక మలుపు వచ్చి చేరింది. మామ వెంకటేశ్వరరావు గత కొంతకాలంగా కోడలితో విభేదాలు పెట్టుకున్నాడు. కుటుంబ విషయాల్లో కోడలిపైనే ముద్ర వేస్తూ, విభేదాలు పెంచుకున్నట్లు తెలిసింది. గురువారం రోజు ఆవేశానికి లోనై అతడు తన కోడలిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తన తండ్రి స్థానంలో తానే నిందితుడిగా నిలబడాలని భావించి, తండ్రిని జైలుకు పంపకూడదన్న భావనతో దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించాడు.
అయితే ఈ కథలో మామ వెంకటేశ్వర రావు కూడా ఆసుపత్రిలో చేరారు. ఇదే సమయంలో తనకి ఆరోగ్యం బాలేదని హాస్పిటల్ లో ఉండటంతో పోలీసులకు అక్కడే అనుమానం మొదలైంది. దీంతోపాటు విచారణ సమయంలో బాధితురాలు పొంతనలేని సమాధానాలు చెబుతున్న నేపథ్యంలో పోలీసులకు అనుమానం వచ్చి తమదైన స్టైల్ లో విచారించగా అసలు నిజం బయటపడింది. దీంతో మామ వెంకటేశ్వర రావు ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ఆయన కూడా జరిగిన ఘటన మొత్తం వివరించటంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
