AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన 7 విమానాల రద్దు.. కారణం అదేనా?

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘటన తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)దేశవ్యాప్తంగా విమానయాన భద్రతపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం తర్వాత ఈ నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో విమాన కంపెనీలు అనేక విమానాలను గ్రౌండ్ చేయాల్సి వచ్చింది.

హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన 7 విమానాల రద్దు.. కారణం అదేనా?
Shamshabad Airport
Vijay Saatha
| Edited By: Balaraju Goud|

Updated on: Jun 21, 2025 | 3:18 PM

Share

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘటన తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)దేశవ్యాప్తంగా విమానయాన భద్రతపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం తర్వాత ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అందువల్ల విమాన కంపెనీలు అనేక విమానాలను గ్రౌండ్ చేయాల్సి వచ్చింది. దీని ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్న ప్రయాణాలపై పడింది.

హైదరాబాద్ శంషాబాద్‌లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం(జూన్ 20) ఎయిర్ ఇండియా నాలుగు అంతర్జాతీయ, మూడు దేశీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. విమానాశ్రయ అధికారులు ఈ విషయం ధృవీకరించారు. విమాన నంబర్ AI 2204 (దుబాయ్ నుండి హైదరాబాద్), AI 2872 (హైదరాబాద్ నుంచి ముంబయి) గమ్యస్థానాలుగా ఉన్న విమానాలు రద్దయ్యాయి. ప్రయాణికులకు ముందే ఈ సమాచారం అందించారు. స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం, ప్రయాణికుల్ని ముందుగా అప్రమత్తం చేశారు.

DGCA తనిఖీలు ఎప్పుడూ కఠినంగా ఉండేవేనని మాజీ పైలట్ లు చెబుతునారు. అయితే ఈసారి బోయింగ్ 787-8 విమాన ప్రమాదం తర్వాత తనిఖీలు మరింత కఠినంగా మారాయని కొంత మంది పైలెట్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం “ఫేజ్ చెక్స్” అనే విధానం ద్వారా ఫ్లైట్ స్టేట్స్ ను DGCA పరిశీలిస్తుంది.. దీనిని A, B, C, D లాగా వర్గీకరిస్తారు. ఇది బోయింగ్‌నా, ఎయిర్‌బస్‌నా అన్నదానిపై ఆధారపడి, ఆ విమానాన్ని గరిష్టంగా నాలుగు రోజులు గ్రౌండ్ చేస్తారు.

ఈ చెక్స్‌లో ఒకటి అయిన C చెక్ సాధారణంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. దీనికి సుమారుగా 45 రోజులు పడతాయి. అంతేకాకుండా DGCA ఆమోదం (సైన్-ఆఫ్) తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాతే ఆ విమానం మళ్లీ సేవల్లోకి వస్తుంది. DGCA గణాంకాల ప్రకారం, అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాదం తర్వాత డ్రీమ్‌లైనర్ వర్గానికి చెందిన 66 విమానాలు తనిఖీల కారణంగా రద్దయ్యాయి. ఘటన జరిగిన జూన్ 12 నాటికి మొత్తం 50 చెక్స్ ప్లాన్ చేయగా, ఆ రోజు ఒక్క రోజులోనే 6 విమానాలను గ్రౌండ్ చేశారు.

జూన్ 18 నాటికి, ఎయిర్ ఇండియా కంపెనీకి చెందిన 33 డ్రీమ్‌లైనర్ విమానాల్లో 24 విమానాలు ఇప్పటికే అవసరమైన తనిఖీలు పూర్తి చేసుకున్నాయి. మిగిలినవి రాబోయే రోజుల్లో తనిఖీలు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అయితే కొన్ని విమానాలను “ఎయిర్‌క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్” (AOG) స్టేటస్‌లో ఢిల్లీలో మెయింటెనెన్స్‌కు ఉంచారు. విమానయాన సంస్థలు, RGIA అధికారులు తెలియజేసిన సమాచారం ప్రకారం, ఈ తనిఖీలు పూర్తయ్యే వరకు మరిన్ని విమానాలను రద్దు చేసే అవకాశముంది.

ఇదే సందర్భంలో, ఎయిర్ ఇండియా హైదరాబాద్-ముంబయి మధ్య నడిచే AI 2534 విమానం శుక్రవారం అర్థరాత్రి రద్దయ్యింది. శంషాబాద్ నుంచి బయలుదేరే సమయంలో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. మొత్తం 92 మంది ప్రయాణికులతో ఈ ఎయిర్‌బస్ విమానం తెల్లవారుజామున 12:10కి బయలుదేరాల్సి ఉండగా, సాంకేతిక లోపం కారణంగా రద్దు అయింది. ప్రయాణికులను విమానం నుండి దించి, అదే దిశలో వెళ్లే AI 2445 అనే మరో విమానంలో బదిలీ చేశారు. అది 2:10 గంటలకు బయలుదేరింది.

ఇలా DGCA కఠిన తనిఖీలు, భద్రత ప్రమాణాలను మరింతగా బలపరిచే దిశగా తీసుకుంటున్న చర్యలతో ప్రయాణికులకు తాత్కాలిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీని ప్రధాన ఉద్దేశం ప్రయాణ భద్రతను నిర్ధారించడం. అనేక విమాన సంస్థలతో పాటు, ప్రయాణికులు కూడా ఈ కొత్త తనిఖీల విధానాన్ని స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఈ పరిణామాలు డ్రీమ్‌లైనర్ విమానాల భద్రతపై మరోసారి దృష్టి సారించాయి. గతంలో జరిగిన ప్రమాదంలో 271 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించిన సంఘటన తరువాత ఈ తనిఖీలకు ప్రాముఖ్యత మరింత పెరిగింది. DGCA చర్యలు ఎటువంటి విమర్శనీయ నిర్ణయాలు కాకుండా, భద్రతకు పెద్దపీట వేస్తున్నాయని అర్థమవుతుంది. ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత, రద్దు అయిన విమానాలు మళ్లీ సేవలలోకి రావడం ద్వారా పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..