AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Immersion: గణేశ్ నిమజ్జనంపై ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ కొట్టివేత.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

గణేశ్ నిమజ్జనంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని యధావిథిగా కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

Ganesh Immersion: గణేశ్ నిమజ్జనంపై ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ కొట్టివేత.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
High Court
Venkata Narayana
|

Updated on: Sep 13, 2021 | 6:11 PM

Share

Telangana High Court: గణేశ్ నిమజ్జనంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని యధావిథిగా కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. గణేశ్ నిమజ్జనంపై ప్రభుత్వం ఇవాళ వేసిన రివ్యూ పిటీషన్ కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ సర్కారుకు నిమజ్జనం విషయంలో హైకోర్టులో చుక్కెదురైంది. గతంలో తామిచ్చిన ఆదేశాల్ని పాటించలేదని కూడా కోర్టు పేర్కొంది. అంతేకాదు, తామిచ్చిన తాజా ఆదేశాల్లో అభ్యంతరాలుంటే కోర్టులో సవాలు చేసుకోవాలని కోర్టు పేర్కొంది.

కాగా, హుస్సేన్ సాగర్‌లో గణేషుడి విగ్రహాలు నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఈ ఉదయం హైకోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తీర్పును పునఃపరిశీలించాలని అభ్యర్థించారు. తీర్పులో ప్రధానంగా 4 అంశాలను తొలగించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే, ఉన్నపళంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. నగర వ్యాప్తంగా నెలకొల్పిన గణేషుడి విగ్రహాలు నిమజ్జనం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లేమీ చేయలేదు. ఎప్పటిలాగే.. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేయగా.. హైకోర్టు తాజా ఉత్తర్వులు ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలోనే.. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.

హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతించకపోతే.. నిమజ్జనం పూర్తి కావడానికి 6 రోజులు పడుతుందని జీహెచ్ఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. వ్యయ ప్రయాసలతో కూడిన రబ్బరు డ్యామ్ నిర్మాణానికి కొంత సమయం అవసరం పేర్కొంది. నగరవ్యాప్తంగా మండపాల్లో వేల సంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయని, విగ్రహాల సంఖ్యకు తగినన్ని నీటి కుంటలు నగరం పరిధిలో లేవు జీహెచ్ఎంసీ తన పిటిషన్‌లో కోర్టుకు వివరించింది. పెద్ద విగ్రహాలు నీటి కుంటల్లో నిమజ్జనం చేయడం కష్టమన్న జీహెచ్ఎంసీ.. ఇప్పటికే హుస్సేన్ సాగర్ వద్ద క్రేన్లు, ఇతర ఏర్పాట్లు చేసామంది. నెలల క్రితమే ప్రణాళికలు సిద్ధమయ్యాయని వివరించింది.

ఇప్పటికిప్పుడు ప్రణాళికలు మార్చితే గందరగోళం తలెత్తుతుందని, నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలను తొలగిస్తామని హైకోర్టు ధర్మాసనానికి జీహెచ్ఎంసీ వివరించింది. కరోనా కట్టడికి మాస్కులు ధరించేలా ప్రజలను చైతన్య పరుస్తామని తెలిపింది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయకుండా విగ్రహాలు ఆపితే వాహనాలను రోడ్లపైనే నిలిపివేయాలంటూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఇచ్చిన పిలుపును కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. గణేషుడి నిమజ్జనానికి సంబంధించి హైకోర్టు మినహాయింపులు ఇవ్వకపోతే గందరగోళం తలెత్తి నగరం స్తంభిస్తుందని జీహెచ్ఎంసీ తన పిటిషన్‌లో పేర్కొంది.

కాగా, హైకోర్టు ఇచ్చిన తీర్పులో ప్రధాన నాలుగు అంశాలను తొలగించాలని జీహెచ్ఎంసీ కోరింది. ఆ నాలుగు అంశాలు ఇవే.. * హుస్సేన్ సాగర్, ఇతర జలాశయాల్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని కోరిన జీహెచ్ఎంసీ. * ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని కోరిన జీహెచ్ఎంసీ. * సాగర్ లో కృత్రిమ రంగులు లేని విగ్రహాలనే అనుమతించాలన్న ఆంక్షలు తొలగించాలని జీహెచ్ఎంసీ వినతి. * హుస్సేన్ సాగర్ లో రబ్బరు డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులు సవరించాలని కోరిన జీహెచ్ఎంసీ.

అయితే, ప్రభుత్వ అభ్యర్థనపై విచారణ జరిపిన హైకోర్టు సోమవారం మధ్యాహ్నం గతంలో తామిచ్చిన ఆదేశాల్లో ఎలాంటి మార్పులు కుదరవంటూ తాజాగా ఆదేశాలిచ్చింది.

Read also: Azharuddin: టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి లేదు.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తా: అజహరుద్దీన్