Huzurabad by-poll: హుజురాబాద్ ఉప ఎన్నిక ఆలస్యం ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. ఎవరి ధీమా వారదే!

హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజకీయం ఉత్కంఠను రేపుతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో అనివార్యమైన ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.

Huzurabad by-poll: హుజురాబాద్ ఉప ఎన్నిక ఆలస్యం ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. ఎవరి ధీమా వారదే!
Huzurabad By Election

Huzurabad by-Election: హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజకీయం ఉత్కంఠను రేపుతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో అనివార్యమైన ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే ఈటలను ఓడించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ట్రబుల్ షూటర్, మంత్రి హరీశ్ వ్యూహ ప్రతివ్యుహాలు రచిస్తున్నారు. హుజూరాబాద్‌లోనే మకాం వేసి ఈటలకి చెక్ పెడుతున్నారు. ఎక్కడికక్కడ జన సమూహంతో సమావేశమవుతూ వినూత్న రీతిలో దూసుకుపోతున్నారు. అంతే ధీటుగా ఈటల ప్రచారంలో దూకుడు పెంచారు. పల్లె పల్లెలో తిరుగుతూ ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు.

అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. అయితే అప్పుడప్పుడే హుజురాబాద్‌కు ఎన్నికలు లేవని ఎన్నికల సంఘం ఇచ్చిన షాక్ అన్ని రాజకీయ పార్టీలకు గట్టిగానే తగిలింది. అయితే, ముఖ్యంగా ఈసీ తాజా నిర్ణయంతో టీఆర్ఎస్, బీజేపీల్లో ఏ పార్టీకి లాభం చేకూరుతుంది? ఏ పార్టీకి నష్టం జరుగుతుంది? అన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. స‌మ‌యం ఎక్కువ ఉంటే ప‌ట్టుసాధించే పనిలో గులాబీ ద‌ళం.. కాల‌యాపనతో మాకే మేలని బీజేపీ శ్రేణులు.. ఇలా ఏవ‌రికీ వారు పైకి చెబుతున్నా.. లోలోప‌ల మాత్రం అంద‌రికి ఉత్కంఠ‌గానే ఉంది.

హుజూరాబాద్ పై పట్టు బిగించే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మ‌ళ్లీ గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇద్దరికీద్దరూ హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. అటు అధికార పార్టీ నుండి మంత్రులు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం జోరుగా పెంచారు. క్షేత్ర స్థాయిలో అన్ని వర్గాలనూ గులాబీ నేతలు తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని ప్రకటించి, దళిత ఓటు బ్యాంకు తమ ఖాతాలో వేసుకునే పనిలో పడ్డారు. ఇక, అభివృద్ధిలోనూ హుజురాబాద్ నియోజకవర్గాన్ని జెట్ స్పీడ్‌లో ముందుకు తీసుకెళ్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి కనీవినీ ఎరుగని విధంగా నిధుల వరద కురిపిస్తున్నారు. అభ్యర్థిగా బీసీ యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ పేరును ప్రకటించి బీసీల ఓటు బ్యాంకుపై ఫోకస్ పెట్టారు టీఆర్ఎస్ పెద్దలు.

అయితే, నియోజ‌క‌వ‌ర్గాన్ని ఈటల రాజేంధ‌ర్ నుండి పూర్తిగా గ్రిప్‌లోకి తీసుకోవ‌డంతో పాటు అభివృద్ది ప‌నులు చేసేందుకు అనుకున్నది అనుకున్నట్టుగా ద‌ళిత బంధును స‌క్సెస్ చేసేందుకు నోటిఫికేష‌న్ ఎంత అల‌స్యం అయితే అంత మాకే మంచిది అనే అలోచ‌లో అధికార టీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. .అందుకే ఈసీ ఇప్పట్లో ఎన్నిక లేవని క్లారిటీ ఇచ్చినా ఇత‌ర జిల్లాల నుండి వెళ్లిన నాయ‌క‌త్వంతో పాటు ఉప ఎన్నిక ఇంచార్జి మంత్రి హ‌రిష్ రావు కూడ అక్కడే మకాం వేశారు. ఒక్కరోజు క‌లిసొచ్చినా ఉప‌యోగించుకోవాల‌న్నది గులాబీ బాస్ వ్యూహంగా కనిపిస్తోంది. సో.. అల‌స్యం అమృతం విషం అనేది కాకుండా నిదాన‌మే ప్రధానం అన్నది ఇప్పుడు గులాబీ దళం ప్లాన్గా తెలుస్తోంది.

ఇక, ఎన్నికల సంఘం హుజురాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్ వెల్లడించకపోవడంతో.. అటు బీజేపీకి కూడ పెద్దగా ప్లస్ కాదు అన్నది రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ. ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌కు అనుకూలంగా ఉన్న వాతావరణం, తరువాత మారే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఉండే ట్రెండ్, ఎన్నికలు జాప్యం జరిగితే ఉండకపోవచ్చు అన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులలో కూడా వ్యక్తమవుతోంది. రోజులు గ‌డిచినా కొద్ది ఈటలపై ఉన్న సింప‌తి కాస్త స‌న్నగిల్లే అవ‌కాశం లేక‌పోలేదని బీజేపీలో అంత‌ర్గతంగా జ‌రుగుతున్న టాక్‌గా తెలుస్తుంది. అయితే, టైం ఎక్కువ ఉంటే టీఆర్ఎస్‌కే మైన‌స్ అనే భావ‌న‌లో ఉంది, ఎందుకంటే బీజెపీ లెక్కల ప్రకారం 20 వేల ద‌ళిత కుటుంబాల‌కు తోడు పెళ్లిళ్లు అయ్యి సేప‌రేట్ అయిన కుటుంబాలు కూడ మ‌రో వెయ్యి కోత్తగా అడ్ అయ్యాయ‌ని వీరంద‌రికీ టీఆర్ఎస్ స‌కాలంలో ద‌ళితబంధు పూర్తి చేయడం క‌ష్టమ‌ని, అదే జ‌రిగితే దాని ప్రభావం అధికార పార్టీపై ప‌డుతుంద‌ని భావిస్తోంది. దానికి తోడు బీసీల్లో కూడ టీఆర్ఎస్ పార్టీ ప‌ట్ల అసంతృప్తి ఉంద‌ని, ఇవ‌న్నీ టీఆర్ఎస్‌కు మైన‌స్ అనేది బీజేపీ శ్రేణుల అలోచ‌న‌గా తెలుస్తోంది.

మరోవైపు, తన మాజీ సహచరుడి మంత్రాంగం, కేసీఆర్ నిధుల ప్రవాహాన్ని తట్టుకునేందుకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సైతం ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు టీఆర్ఎస్ నేతలు. ఓ వైపు హరీశ్ తన వర్గాన్ని కూడా దూరం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంటే.. వారిని కాపాడుకుంటూనే అధికార ఆధిపత్యానికి వ్యతిరేక వర్గాలను ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు. సామాజిక ఉద్యమ నేతలను కలుస్తూ కొత్త సమీకరణాలకు శ్రీకారం చుడుతున్నారు. మరోవైపు, ఎన్నికలు వచ్చే దాకా ఇరు పార్టీల నేతలు కాపాడుకునేందుకు నానాతంటాలు పడుతున్నట్లు కనిపిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పడన్నదీ ఎన్నికల సంఘంపై ఆధారపడి ఉంది.

— శ్రీధర్ ప్రసాద్, టీవీ 9 ప్రతినిధి, హైదరాబాద్.

Read Also… Priyanka Tibrewal: భ‌వానీపూర్‌ బీజేపీ అభ్యర్థిగా ప్రియాంకా టిబ్రివాల్.. సోమవారం నామినేష‌న్ దాఖ‌లు.. చిత్రాలు

Bigg Boss 5 Telgu: బాబోయ్ శ్వేతావర్మ.. ఇంత ఫైర్ ఉందా? ఇచ్చిపారేసింది కదా.. ఈ వారం నామినేషన్స్‌లో వీరే!

Click on your DTH Provider to Add TV9 Telugu