Inside Congress War Room: హుజూరాబాద్‌లో ఓటమికి మీరే కారణం.. కాదు మీరే.. కాంగ్రెస్ వార్ రూమ్ సమావేశంలో ఏం జరిగిందంటే..?
కాంగ్రెస్ తీరు మారలేదు. వార్ రూమ్ అంతర్మథనంలోనూ ఒకరిపై ఒకరు బురదజల్లుకోవడం ఆపలేదు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి కారణాలను అన్వేషించి..
Congress War Room: తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు మారలేదు. వార్ రూమ్ అంతర్మథనంలోనూ ఒకరిపై ఒకరు బురదజల్లుకోవడం ఆపలేదు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి కారణాలను అన్వేషించి ఆత్మపరిశీలన చేసుకోవడం కోసం ఉద్దేశించిన వార్ రూమ్ సమావేశం నేతల పరస్పర నిందారోపణలతో నిండిపోయింది. గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో, ఉత్తమ్ – రేవంత్ వర్గాలు ఓటమికి మీరే కారణం అంటే మీరే కారణం అంటూ విమర్శించుకున్నారు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎదురుగానే వర్గ విబేధాలు బయటపడ్డాయి. కౌశిక్ రెడ్డి వ్యవహారం, ఈటెల రాజేందర్ చేరిక, అభ్యర్థి ఎంపిక సహా పార్టీ ఓటమికి కారణాలను అన్వేషించే క్రమంలో అనేకాంశాలను చర్చించారు.
సమావేశానికి హాజరయ్యే ముందే మీడియాతో మాట్లాడిన సీనియర్ నేత వీ. హనుమంతరావు, సమావేశంలో అభ్యర్థి ఎంపిక సరిగాలేదని చెప్పినట్టు తెలిసింది. నిజానికి కొండా సురేఖకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించినట్టు తెలిసింది. పోటీకి ఆమె సిద్ధంగా ఉన్నప్పటికీ, కొందరు ఆమెను అడ్డుకున్నారని తప్పుబట్టారు. ఆమె పోటీ చేసినట్టయితే ఇంతటి ఘోర పరాజయం, దారుణ పరాభవం ఎదురయ్యేది కాదని వీహెచ్ చెప్పారు. అభ్యర్థి ఎంపిక విషయంలో జరిగిన జాప్యం కూడా ఓటమికి మరో కారణమని ఆయన చెప్పినట్టు తెలిసింది.
టార్గెట్ ఉత్తమ్ – భట్టి! సమావేశంలో రేవంత్ వర్గం నేతలు కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఉదహరిస్తూ.. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఈటెల చేరిక అంశాన్ని ప్రస్తావిస్తూ మల్లు భట్టి విక్రమార్కను ఓటమికి బాధ్యుల్ని చేసే ప్రయత్నం చేశారు. నిజానికి ఉత్తమ్ పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో జరిగిన దుబ్బాక, హుజూర్‌నగర్, నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లోనూ పార్టీ ఓటమిపాలైందని, వాటి ఫలితాలపై కూడా సమీక్ష జరపాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సమావేశం అనంతరం వార్ రూమ్ బయట వ్యాఖ్యానించారు. అయితే సమావేశంలో మాత్రం కౌశిక్ రెడ్డి వ్యవహారం గురించే మాట్లాడినట్టు సమాచారం. బంధుప్రీతితో ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీకి మోసం చేస్తున్నారని కేసీ వేణుగోపాల్ ఎదురుగానే తీవ్రస్థాయి ఆరోపణలు చేసినట్టు తెలిసింది.
ఈటల రాజేందర్ అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్టు తెలిసింది. టీఆర్ఎస్ పార్టీని వీడిన ఈటల రాజేందర్ తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, కానీ ఉత్తమ్, భట్టి – ఇద్దరూ ఈటలను చేరకుండా అడ్డుకున్నారని ఆరోపించినట్టు సమాచారం.
ఉత్తమ్ కౌంటర్స్ తనపై లేవనెత్తిన ఆరోపణలను తిప్పికొడుతూ ఉత్తమ్ కూడా రేవంత్‌పై ఆరోపణలు చేసినట్టు తెలిసింది. కౌశిక్ రెడ్డి పార్టీలో ఉన్నప్పుడే నిర్వహించిన అంతర్గత సర్వేలో కాంగ్రెస్ పరిస్థితి 4 % మించలేదని గుర్తుచేసినట్టు సమాచారం. పైగా కౌశిక్ రెడ్డి జులైలో పార్టీని వీడి వెళ్తే, ఆ తర్వాత కొన్ని నెలల పాటు ప్రస్తుత నాయకత్వం మరో బలమైన అభ్యర్థిని ఎంపిక చేయకుండా ఏం చేసిందని ప్రశ్నించినట్టు తెలిసింది. కేవలం తన ఇమేజ్ పెంచుకునే క్రమంలో భారీ బహిరంగ సభలు పెట్టి హంగామా చేస్తే సరిపోదని, గెలుపు కోసం అమలు చేయాల్సిన వ్యూహాలు అమలు చేయలేదని ఉత్తమ్ కౌంటర్ అటాక్ చేసినట్టు తెలిసింది. కౌశిక్ వ్యవహారాన్ని సాకుగా చూపుతూ తనను కుట్రపూరితంగానే కార్నర్ చేస్తున్నారని ఉత్తమ్ చెప్పినట్టు సమాచారం. నిజానికి కౌశిక్ రెడ్డికి, పొన్నం ప్రభాకర్‌కు అస్సలు పడదని, అతను పార్టీని వీడి వెళ్లడానికి సగం కారణం పొన్నమేనని ఉత్తమ్ చెప్పినట్టు తెలిసింది. రేవంత్ రెడ్డి, మాణిక్కం టాగోర్ కలిసి పొన్నం ప్రభాకర్‌కు ఏఐసీసీ కార్యదర్శి పదవి ఆశజూపుతూ తనపై రెచ్చగొట్టి ఆరోపణలు చేయిస్తున్నారని ఉత్తమ్ అనుమానిస్తున్నట్టు తెలిసింది.
అందరం టీమ్‌లో ఉన్నాం.. ఆత్మపరిశీల ముఖ్యం మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ మధుయాష్కి వాస్తవ పరిస్థితికి తగ్గట్టుగా మాట్లాడినట్టు తెలిసింది. ఒకరినొకరు నిందించుకోవడం మాని అసలు తప్పెక్కడ జరిగిందో గుర్తించాలని ఈ ఇద్దరు నేతలు సూచించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సభలకు భారీ ఎత్తున జనసందోహం కనిపించింది కదా అన్న కేసీ వేణుగోపాల్ సందేహాన్ని నివృత్తి చేస్తూ.. హైప్ సృష్టించడం కోసం ఇలాంటి సభలు పనికొస్తాయని, అయితే గెలవాలంటే ఇవి మాత్రమే సరిపోదని చెప్పినట్టు తెలిసింది. హైప్ ద్వారా జరిగే ప్రయోజనం 10 శాతం మించదని, మరో 90 శాతం ఇతర కారణాలే ఉంటాయని వారన్నట్టు తెలిసింది. ఇంత దారుణంగా ఓట్ల శాతం కోల్పోవడానికి అసలు కారణాలేంటో గుర్తించాలని సూచించినట్టు తెలిసింది.
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి బల్మూరు వెంకట్ సైతం పార్టీ పద్ధతి ప్రకారం నడుచుకోలేదని చెప్పినట్టు తెలిసింది. షబ్బీర్ అలీ, సీతక్క ఉదయం జరిగిన సమావేశంలో పెద్దగా ఏం మాట్లాడలేదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే సాయంత్రం మరోసారి విడివిడిగా అభిప్రాయ సేకరణ చేసి, నివేదిక రూపొందించాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భావించారు. దీంతో విడివిడిగా నేతలు ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read..
BJP Millennium March: బీజేపీ నిరుద్యోగ మిలియన్ మార్చ్ వాయిదా.. కారణం అదేనా.. మళ్లీ ఎప్పుడంటే..?
Goa Election 2022: గోవా ఎన్నికలకు ముందే ఆ రాష్ట్ర మాజీ సీఎంకు TMC బంపర్ ఆఫర్..