BJP National Executive Meet: ‘కాషాయ’ పండుగలో వేదికపై సమతా మూర్తి.. కాకతీయ శిలాతోరణం.. మరెన్నో.. మరెన్నో..
తెలంగాణ గడ్డపై జరుగుతున్న సమావేశాల్లో పక్కా తెలంగాణ ఫ్లేవర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బీజేపీ శ్రేణులు. ముఖ్యమైన ప్రాంగణాలకు తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ ప్రాంతాలు, వ్యక్తుల పేర్లను పెట్టి ఆయా ప్రాంతాల ప్రాముఖ్యతను, వ్యక్తుల గొప్పదనాన్ని..
హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశాల్లో కమలం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ గడ్డపై జరుగుతున్న సమావేశాల్లో పక్కా తెలంగాణ ఫ్లేవర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బీజేపీ శ్రేణులు. ముఖ్యమైన ప్రాంగణాలకు తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ ప్రాంతాలు, వ్యక్తుల పేర్లను పెట్టి ఆయా ప్రాంతాల ప్రాముఖ్యతను, వ్యక్తుల గొప్పదనాన్ని మరోసారి చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ మీటింగ్స్ జరగనున్నాయి. దీని కోసం ఇప్పటికే హైదరాబాద్ నగరం బీజేపీ ఫ్లెక్సీలు, కటౌట్లతో నిండిపోయింది. ఎక్కడ చూసినా బీజేపీ, మోదీకి సంబంధించిన పోస్టర్లే దర్శనమిస్తున్నాయి.
మరోవైపు తెలంగాణ గడ్డపై జరుగుతున్న బీజేపీ సమావేశాలను ఈసారి స్థానిక నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒకవైపు వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెలంగాణ బీజేపీ నేతలు, హైదరాబాద్‌లో జరుగుతున్న సమావేశాలను విజయవంతం చేయాలనే పట్టుదలతో ఉన్నారు. దానికి తగ్గట్టే భారీ ఏర్పాట్లు చేశారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అడుగడుగునా తెలంగాణ ఫ్లేవర్ ఉట్టిపడేలా చర్యలు తీసుకుంటున్నారు స్థానిక నేతలు. ఇప్పటికే వంటల కోసం ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లా నుంచి యాదమ్మ అనే మహిళను హైదరాబాద్ రప్పించి, జాతీయ నేతలకు తెలంగాణ వంటలు రుచి చూపించబోతున్నారు బండి సంజయ్.
కార్యవర్గ సమావేశాల వేదికకు కొన్ని ప్రత్యేకతలు
జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నోవాటెల్ ప్రాంతానికి శాతవాహన నగరంగా, జాతీయ కార్యవర్గ సమావేశ స్థలికి కాకతీయ ప్రాంగణంగా నామకరణం చేశారు. సమావేశాలు జరుగుతున్న వేదకను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ఓ వైపు సమతా పూర్తి విగ్రహం.. బుద్ధ విగ్రహంను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.పార్టీ గుర్తు కమలం ఏర్పాటు చేశారు.
మీటింగ్స్ ప్రాంగణాలకు తెలంగాణ ప్రాంతంలోని కీలక పేర్లు..
మీటింగ్స్ జరిగే వివిధ ప్రాంగణాలకు తెలంగాణ ప్రాంతాలు, వ్యక్తల పేర్లు పెట్టారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే HICC, నోవాటెల్ ప్రాంతానికి శాతవాహన నగరంగా పేరు పెట్టారు. మీటింగ్ స్థలానికి కాకతీయ ప్రాంగణం అని నామకరణం చేశారు. భోజనశాలకు భాగ్యరెడ్డివర్మ ప్రాంగణంగా పేరు పెట్టారు. మీడియా హాల్‌కు షోయబుల్లాఖాన్ హాల్ అని, అతిథులు బస చేసే ప్రాంగణానికి సమ్మక్క, సారలమ్మ నిలయంగా పేరు పెట్టారు. జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశ మందిరానికి వందేమాతరం రామచంద్రరావు పేరును నిర్ణయించారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కార్యాలయానికి భక్త రామదాసు పేరు పెట్టారు. బీజేపీ సంఘటన్ కార్యదర్శుల సమావేశ హాల్‌కి కొమురం భీమ్ పేరు, ఎగ్జిబిషన్‌కు గొల్లకొండ పేరు పెట్టారు. జాతీయ కార్యవర్గ సమావేశా తీర్మానాల ప్రాంగణానికి నిజాంపై పోరాటం చేసిన నారాయణ పవార్ పేరు పెట్టారు బీజేపీ నేతలు. ఇక జులై 3న పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని మోదీ హాజరయ్యే సభకు విజయ సంకల్ప సభగా నామకరణం చేశారు.
ఇలా అడుగడుగునా తెలంగాణ ప్రాంతంలోని ముఖ్యమైన ప్రాంతాలు, వ్యక్తుల పేర్లను ఆయా ప్రాంగణాలకు పెట్టి తెలంగాణ బీజేపీ సమావేశాల్లో తెలంగాణ ఫ్లేవర్ ఉండేలా ప్లాన్ చేశారు బీజేపీ నేతలు.