Hyderabad: నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్‌లో కొత్తగా 15 వేల ఐటీ ఉద్యోగాలు
తెలంగాణలో కొత్తగా పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పలు కొత్త కంపెనీల ఏర్పాటుకు ఒప్పందాలు జరుగుతుండగా, ఇప్పటికే ఉన్న కంపెనీల విస్తరణకు సంబంధించి ముందడుగు పడుతోంది. ఇందులో భాగంగానే ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తెలంగాణలో భారీ విస్తరణ...
తెలంగాణలో కొత్తగా పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పలు కొత్త కంపెనీల ఏర్పాటుకు ఒప్పందాలు జరుగుతుండగా, ఇప్పటికే ఉన్న కంపెనీల విస్తరణకు సంబంధించి ముందడుగు పడుతోంది. ఇందులో భాగంగానే ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తెలంగాణలో భారీ విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపింది.
ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సోమవారం కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్‌తో సమావేశవయ్యారు హైదరాబాద్‌లో తమ కొత్త సెంటర్‌ను నెలకొల్పనున్నట్లు కాగ్నిజెంట్ ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు. దేశంలో సుమారు 15 నుంచి 20 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు వస్తాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ విషయమై ఒప్పందం కుదిరింది. ఇదిలా ఉంటే టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్‌లో తమ కంపెనీని విస్తరించడం సంతోషంగా ఉందని కాగ్నిజెంట్ సీఈవో ఎస్ రవికుమార్ తెలిపారు.
ఇక కాగ్నిజెంట్ నిర్మించనున్న కొత్త సెంటర్‌ను సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పనున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఈ కొత్త సెంటర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు ఉపయోగపడుతుందని సీఈవో ఎస్ రవి కుమార్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై ఈ కొత్త సెంటర్ దృష్టి సారిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని సీఎం రేవంత్ ఈ సందర్భంగా తెలిపారు. కాగ్నిజెంట్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్‌ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..