AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: అమ్మాయిలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. వారి కోసం ప్రత్యేక సర్వీసులు.. ఫుల్ డిటైల్స్ ఇవే..

విద్యార్థులకు బస్సుల ఏర్పాటుపై గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ అధికారులతో హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ ఆదివారం సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో విద్యార్థుల రద్దీ..

TSRTC: అమ్మాయిలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. వారి కోసం ప్రత్యేక సర్వీసులు.. ఫుల్ డిటైల్స్ ఇవే..
TSRTC
Shaik Madar Saheb
|

Updated on: Feb 26, 2023 | 3:07 PM

Share

హైదరాబాద్‌ శివారు ప్రాంతాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్‌ తెలిపారు. విద్యార్థులను క్షేమంగా విద్యాసంస్థలకు చేర్చేందుకు 100 అదనపు ట్రిప్పులను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. విద్యార్థులకు బస్సుల ఏర్పాటుపై గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ అధికారులతో హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ ఆదివారం సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో విద్యార్థుల రద్దీ, ఏర్పాటు చేస్తోన్న బస్సుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సామాజిక బాధ్యతగా విద్యార్థులను క్షేమంగా విద్యా సంస్థలకు చేర్చేందుకు టీఎస్‌ఆర్టీసీ కట్టుబడి ఉందని వివరించారు.

”హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోని కాలేజీలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. శివారు ప్రాంతాలను 12 కారిడార్‌లుగా విభజించి 350 వరకు బస్సులను నడుపుతున్నాం. ఇబ్రహీంపట్నం క్లస్టర్‌లో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉందనే విషయం సంస్థ దృష్టికి వచ్చింది. ఆ కారిడార్‌లోని కాలేజీలకు దాదాపు 44 వేల మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. వారిలో 3వ వంతు బస్‌పాస్‌లు తీసుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అందుకు అనుగుణంగా గత వారం రోజులుగా 8 ట్రిప్పులను అదనంగా నడుపుతున్నాం. రద్దీ ఎక్కువగా ఉంటే మరిన్నీ బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం.” అని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ తెలిపారు. రద్దీ దృష్ట్యా ఇబ్రహీంపట్నం కారిడార్‌లో 30 అదనపు ట్రిప్పులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

Vc Sajjanar

Vc Sajjanar

“హైదరాబాద్‌లో ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి 500 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. అలాగే, విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులను హైదరాబాద్‌ శివారు విద్యాసంస్థల వరకు ఏర్పాటు చేయాలని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే విద్యార్థినుల ప్రత్యేక బస్సులు అందుబాటులోకి వస్తాయి.” అని సజ్జనర్‌ స్పష్టం చేశారు.

విద్యార్థులు ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని, ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు. కొందరు విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా ఫుట్‌బోర్డులో ప్రయాణిస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, వారు బస్సులోపలికి ఎక్కి సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) పీవీ ముని శేఖర్‌, సీపీఎం కృష్ణకాంత్‌, సీటీఎం జీవనప్రసాద్‌, చీఫ్‌ ఇంజనీర్‌ ఐటీ రాజశేఖర్‌, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ఆర్‌ఎంలు వరప్రసాద్‌, వెంకన్న, తదితర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..