Hyderabad Snakes: హైదరాబాద్ పాతబస్తీలో పాములు కలకలం.. ఏకంగా మూడు పాములు ఒకేచోట
హైదరాబాద్ పాతబస్తీలో పాములు కలకలం రేపాయి. ఒకటి కాదు, రెండు ఏకంగా మూడు పాములు ఒకేచోట కనిపించటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.

హైదరాబాద్ పాతబస్తీలో పాములు కలకలం రేపాయి. ఒకటి కాదు, రెండు ఏకంగా మూడు పాములు ఒకేచోట కనిపించటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. భారీ సైజున్న పాముల్ని చూసిన వెంటనే స్థానికులు వాటిని కొట్టి చంపేయకుండా స్నేక్ సోసైటీ సభ్యులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళ్తే.. ఓల్డ్ సిటీ బహదూర్ పురా పోలీస్ స్టేషన్ పరిధి మిరాలం ఈద్గా సమీపం లో ఓ నిర్మాణంలో ఉన్న భవనం లో నీటి సంపులో 9 అడుగుల పాము కనిపించింది. స్నేక్ సోసైటీ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని పామును బంధించారు. అయితే, ఈ పాము ఇండియన్ రాక్ పైథాన్ అంటారని స్నేక్ సోసైటీ సభ్యులు తెలిపారు. వారు పామును పట్టుకొని సురక్షితంగా అక్కడ్నుంచి తరలించారు.
ఇదిలా ఉంటే, స్థానిక భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తలబ్‌కట్ట వద్ద పాముల సంచారం ఎక్కువైంది. మురికి నాలా నుండి ప్రతి రోజు పాములు బయటకు వస్తున్నాయంటూ కాలనీ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాళం వేసి బయటకు వెళ్లిన ఓ ఇంట్లో సుమారు 5 అడుగులున్న రెండు పాములు చొరబడ్డాయి. ఇంట్లోవాళ్లు వచ్చి తలుపు తీయటంతో ఒకేసారి రెండు పాములు ప్రత్యక్షంకాగా, ఆ ఇంటి వారు భయంతో పరుగులు తీశారు. బస్తీవాసుల సాయంతో పాములను బంధించి పోలీసుల సాయంతో స్నేక్ సోసైటికి అప్పగించారు. ఈ రెండు వేర్వేరు ఘటనల్లో ఎవరికీ ఎటువంటి అపాయం కలగలేదని స్థానికులు చెబుతున్నారు. కానీ, ఓపెన్ నాలా వల్ల తరచూ పాములు, విషపురుగులు ఇళ్లలోకి వచ్చి చేరుతున్నాయని, అధికారుల తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 18,285 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి
