AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అయ్యో భగవంతుడా.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు మృతి

ప్రమాదవశాత్తు అపార్ట్‌మెంట్‌ లిఫ్టుకి, గోడకి మధ్య ఇరుక్కుపోయిన ఆరేళ్ల బాలుడు చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతిచెందాడు. హైదరాబాద్‌ నాంపల్లి పోలిస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం సాయంత్రం రెడ్‌హిల్స్‌ శాంతినగర్‌ పార్కు ఎదురుగా ఉన్న మఫర్‌ కంఫర్ట్‌ అపార్ట్‌మెంట్‌లో ఉన్న లిఫ్ట్‌లో బాలుడు ఇరుక్కుపోయాడు. అతి కష్టం మీద బాలుడ్ని బయటకు తీసి.. వెంటనే ఆస్పత్రికి తరలించినా.. చిన్నోడి ప్రాణాలు నిలువలేదు.

Hyderabad: అయ్యో భగవంతుడా.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు మృతి
Arnav
Ram Naramaneni
|

Updated on: Feb 22, 2025 | 1:30 PM

Share

వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. హైదగరాబాద్‌లో లిఫ్ట్‌లో ఇరుక్కొని తీవ్రంగా గాయపడ్డ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. నాంపల్లిలో ఆరేళ్ల బాలుడు ఆర్నవ్ ఫిబ్రవరి 21, శుక్రవారం లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. రెండున్నర గంటలపాటు నరకయాతన అనుభవించాడు.   ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడ్ని అతి కష్టం మీద DRF బృదం బయటకు తీసింది. వెంటనే నీలోఫర్ ఆస్పత్రికి తరలించింది. శుక్రవారం సాయంత్రం నుంచి వైద్యులు చికిత్స అందించారు. బాలుడిని బతికించేందుకు శతవిధాల ప్రయత్నించారు. కానీ చిన్నోడు ప్రాణాలు కోల్పోయాడు.

ఆర్నవ్ ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు ఉదయమే ప్రకటించారు. 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమన్నారు.  వెంటిలేటర్‌పై కృత్రిమ శ్వాస అందించారు. ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతున్నట్లు పరీక్షల్లో గుర్తించారు. చివరకు బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. నాంపల్లిలో ఓ అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో ఆర్నవ్ ఇరుక్కుపోయాడు. అతి కష్టం మీద అతన్ని బయటకు తీశారు. కాని అతని ప్రాణాలు నిలువలేదు.

అసలేం జరిగింది…. 

హైదరాబాద్‌ నాంపల్లి పరిధిలో గల మాసబ్‌ట్యాంక్‌ శాంతినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆర్నవ్‌ అనే ఆరేళ్ల బాలుడు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. మూడో ఫ్లోర్‌ నుంచి కిందకు దిగే క్రమంలో లిఫ్ట్‌ ఆగిపోయింది. దాంతో.. లిఫ్ట్‌- స్లాబ్‌ల మధ్య ఇరుక్కున్న బాలుడు పెద్దగా కేకలు వేశాడు. బాలుడి అరుపులు విన్న అపార్ట్‌మెంట్‌ వాసులు దగ్గరకు వెళ్లి చూడగా లిఫ్ట్‌లో ఇరుక్కున్న అతన్ని చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఫైర్‌ సిబ్బందితోపాటు.. డీఆర్‌ఎఫ్‌ టీమ్‌ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లిఫ్ట్‌-స్లాబ్‌ల మధ్య ఇరుక్కున్న బాలుడిని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. సుమారు 3 గంటల పాటు శ్రమించి వెల్డింగ్‌ మిషన్‌ల సాయంతో లిఫ్ట్‌ డోర్‌లు, గోడను తొలగించి బయటకు తీశారు. అత్యవసర చికిత్స నిమిత్తం నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. టెక్నికల్‌ ప్రాబ్లమ్‌తో లిఫ్ట్‌ మధ్యలో నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే.. బాలుడు లిఫ్ట్‌‌లో ఇరుక్కుపోయాడని.. అతని పొట్ట, వెన్నెముక భాగంలో గాయాలయ్యాయని.. నీలోఫర్‌ వైద్యాధికారులు వెల్లడించారు. బాలుడు కొన్ని గంటలపాటు ఇరుక్కుపోవడంతో పొట్ట, వెన్నులో తీవ్రంగా గాయాలు అయ్యాయని.. లిఫ్ట్‌, గోడకు మధ్యన చిక్కుకోవడంతో అతడిపై తీవ్ర ఒత్తిడి పడినట్లు వైద్యులు చెప్పారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని బాలుడికి ట్రీట్‌మెంట్‌ అందించారు. అయితే.. బాలుడి శరీర లోపలి భాగాలు నలిగిపోయాయని.. లిఫ్టులో 2గంటలకు పైగా ఇరుక్కుపోవడంతో ఆక్సిజన్ అందక, రక్తప్రసరణ లేక అవయవాలు దెబ్బతిన్నాయన్నారు నీలోఫర్ వైద్యులు. ఇక.. డాక్టర్లు స్పెషల్‌ కేర్‌ తీసుకుని వైద్యం అందించినప్పటికీ.. ప్రాణాన్ని నిలబెట్టలేకపోయారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..