Telangana: హరీశ్ రావును వెంటనే బర్తరఫ్ చేయాలి.. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి.. ప్రభుత్వంపై రేవంత్ ఫైర్
ఇబ్రహీంపట్నం ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు విఫలమై నలుగురు మహిళలు మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. ఈ ఇన్సిడెంట్ తో ప్రతిపక్షాలు అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి....
ఇబ్రహీంపట్నం ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు విఫలమై నలుగురు మహిళలు మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. ఈ ఇన్సిడెంట్ తో ప్రతిపక్షాలు అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని విమర్శిస్తున్నాడు. తాజాగా ఈ ఘటనపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. మహిళలు మృతి చెందడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావును (Harish Rao) బాధ్యతగా చేస్తూ మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి, కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇబ్రహీంపట్నం ఘటనతో ఆరోగ్యం దెబ్బతిని, నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను రేవంత్ రెడ్డి పరామర్శించారు. గంట వ్యవధిలో 34 మందికి ఎలా ఆపరేషన్లు చేశారని ప్రశ్నించారు. కాగా.. ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆపరేషన్ చేసిన డాక్టర్ లైసెన్స్ రద్దు చేసింది. సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. కమిటీ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చిన 34 మంది మహిళలకు ఒక గంటలో శస్త్ర చికిత్స ఎలా చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల పని తీరు కార్పొరేట్ ఆస్పత్రులను మించిపోయిందని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందితే బాధితులను ఎందుకు ప్రైవేటు హాస్పిటల్స్ కు తరలించారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలి. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తాం.
– రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
మరోవైపు.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగిన మహిళల పరిస్థితిపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వివరాలు సేకరిస్తోంది. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తోంది. నలుగురు మహిళల మృతికి ఇన్‌ఫెక్షనే కారణమని నిర్ధారించారు. ఆపరేషన్ చేశాక పరికరాలను సరిగా స్టెరిలైజేషన్ చేయని కారణంగానే అలా జరిగి ఉండొచ్చని అనుమానం అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితులను పరామర్శించిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఘటనపై డీహెచ్ నివేదిక వచ్చాక అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి