Ranga Reddy: ముంబై, బెంగళూరు కాదు.. జీడీపీలో మనమే టాప్.. దేశంలోనే రిచ్చెస్ట్ జిల్లా ఏదంటే?
ఇది రంగారెడ్డి జిల్లా వాసులు గర్వపడాల్సిన తరుణం అనే చెప్పాలి. ఎందుకంటే భారతదేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న 800కి పైగా జిల్లాల్లో రంగారెడ్డి ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. 2024-25 కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే ప్రకారం.. తలసరి GDP పరంగా రంగారెడ్డి ప్రస్తుతం దేశంలోనే అత్యంత సంపన్న జిల్లాగా రికార్డు నమోదు చేసుకుంది.

తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా సరికొత్త రికార్డ్ సృష్టించింది. డీజీపీలో దేశంలోనే అత్యంత సంపన్న జిల్లాగా రంగారెడ్డి నిలిచింది. ఈ జిల్లా సగటు తలసరి (జీడీపీ) ఏడాదికి రూ.11.46 లక్షలుగా ఉందని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఆ తర్వాత రెండో స్థానంలో గుర్గావ్, తర్వాతి స్థానాల్లో బెంగళూరు అర్బన్, గౌతమ్ బుద్ధనగర్(నోయిడా) ,హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ ఉన్నాయి. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ప్రముఖ వాణిజ్య కేంద్రాలైన ముంబై, అహ్మదాబాద్ వంటి పేరున్న నగరాలు కూడా ఈ జాబితాలో చాలా దిగువన ఉన్నాయి.
2006వ సంవత్సరంలో రంగారెడ్డి జిల్లాను భారత ప్రభుత్వం దేశంలోని 250 అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా గుర్తించింది. అంత దిగువ స్థాయిలో ఉన్న రంగారెడ్డి జిల్లా ఇప్పుడిలా అభివృద్ధిలో దూసుకురావడం సాధారణ విషయం కాదు. అట్టడుగు స్థాయి నుంచి ఏకంగా దేశంలోనే ఆర్థిక వృద్ధి చెందుతున్న ప్రధాన జిల్లాల్లో టాప్‌లో నిలవడం ఆ ప్రాంతవాసులకు ఖచ్చితంగా గర్వపడాల్సిన విషయమే. ఇక రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో హైదరాబాద్‌లో ఉన్న ఐటీ కారిడార్, అత్యాధునిక ఔషధ కేంద్రాలు, విశాలమైన టెక్ పార్కులు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా ఆర్థిక వృద్ధికి ప్రధాన మూలం అక్కడి ఐటీ పరిశ్రమ అనే చెప్పొచ్చు. ఈ జిల్లా భారతదేశంలోని అతి పెద్ద ఔషధ, బయోటెక్నాలజీ కేంద్రాలకు నిలయంగా మారింది. వీటిలో పరిశోధన,అభివృద్ధి కేంద్రాలు, పెద్దఎత్తున తయారీ సౌకర్యాలు ఉన్నాయి. గత రెండు దశాబ్దాలుగా హైదరాబాద్ ప్రధాన నగర ప్రాంతాల్లో పరిశ్రమలు రంగారెడ్డి జిల్లాకు విస్తరించాయి. దీంతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వేగంగా పుంజుకుంది. రంగారెడ్డి ప్రాంతంలోని మౌలిక సదుపాయాలు కూడా ఇందుకు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పెట్టుబడిదారులకు, ప్రపంచ కంపెనీలకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతోంది.
రంగారెడ్డి జిల్లా సాధిస్తున్న అభివృద్ధి అంత తేలికగా జరగలేదు.. ఎన్నో సవాళ్లను అధిగమించి ముందుకు సాగుతోందని ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. అసలు హైదరాబాద్ నుంచి వేరు చేయబడిన తర్వాత 1978లో ఇది జిల్లాగా ఏర్పడింది. అనంతరం దీనికి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కె.వెంకట రంగారెడ్డి పేరు పెట్టారు. ఈ జిల్లా 5,000 చదరపు కిలోమీటర్ల కంటే కొంచెం ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ఇప్పటివరకు బాగానే ఉన్నా.. భవిష్యత్తులో జిల్లా రూపురేఖలు, అభివృద్ధి విషయాల్లో ఎలా ఉండబోతోందనేది ప్రస్తుతం మొదలవుతున్న ప్రశ్న. ఇదే పంథా మరింత ముందుకు సాగుతుందా లేదా అనేది కాలం గడిచే కొద్దీ మున్ముందు తెలుస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




