AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన పోలీస్ డాగ్ “టీనా”.. సైబరాబాద్ సీపీ సజ్జనార్ అధ్వర్యంలో అంత్యక్రియలు

డాగ్ స్క్వాడ్‌లో పనిచేసిన టీనా మృతి చెందడంతో సీపీ సజ్జనార్ నేతృత్వంలో బుధవారం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.

అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన పోలీస్ డాగ్ “టీనా”.. సైబరాబాద్ సీపీ సజ్జనార్ అధ్వర్యంలో అంత్యక్రియలు
Balaraju Goud
|

Updated on: Mar 11, 2021 | 1:18 PM

Share

Police dog “Tina” passed away : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదేళ్లపాటు సేవలందించిన పోలీసు జాగిలం ‘‘టీనా’’ అనారోగ్యంతో మృతి చెందింది. డాగ్ స్క్వాడ్‌లో పనిచేసిన టీనా మృతి చెందడంతో సీపీ సజ్జనార్ నేతృత్వంలో బుధవారం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు. డాగ్ స్క్వాడ్‌ అధ్వర్యంలో ఈ జాగిలం విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభను కనుబరిచేది. వయసు 10 సంవత్సరాలైన విధి నిర్వహణ లో చాలా చురుకుగా ఉండేది. హైదరాబాద్ పరిధిలో అనుమానిత ప్రదేశాలను, వి.ఐ.పి, వి.వి.ఐ.పి. బందోబస్తుల్లో కూడా తన సేవలను అందించి, బుధవారం ఉదయం అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచింది.

ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీ అనురాగ్ శర్మ, సైబరాబాద్ మాజీ సీపీలు సీవీ ఆనంద్, సందీప్ శాండిల్యా పని చేసిన సమయంలో టీనా సేవలందించింది. 2011లో జన్మించిన టీనా.. సైబరాబాద్ ఇంటలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ నందు శిక్షణ పొందింది. 2012వ బ్యాచ్ లో మొయినాబాద్ ఐఐటీఏ లో పేలుళ్లను కనిపెట్టడంలో స్నిఫర్ డాగ్ గా శిక్షణ పొందింది. శిక్షణ కాలంలో రెండో ఉత్తమ విజేతగా నిలవడమే కాకుండా, రెగ్యులర్ విధుల్లో భాగంగా పలు బాంబు తనిఖీలు చేసింది.

ఈ సందర్భంగా వీఐపీ, వీవీఐపీ, ఆర్ఓపీ, యాంటీ సాబోటేజ్, శంషాబాద్ విమానాశ్రయం తనిఖీలు, 2014 మే 8న జేఎన్‌టీయూలో బాంబు బెదిరింపు వచ్చిన కాల్ సమయంతో పాటు అనేక ఇతర బాంబు తనిఖీల డెమోల్లో టీనా పాల్గొందని పోలసులు తెలిపారు. 2017 బయో డైవర్సిటీ కాప్ -2 కార్యక్రమానికి ఇవాంకా ట్రంప్ ముఖ్య అతిథిగా విచ్చేసిన సమయంలో కూడా టీనా విధులు నిర్వహించిందని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. గతేడాది ఆగస్టు 23న రిటైర్మెంట్ పొందిన టీనా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మరణించింది. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్, ఇతర పోలీసు అధికారులు టీనాకు పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళి అర్పించారు. పదేళ్ల కాలంలో టీనా అందించిన సేవలను సీపీ సజ్జనార్ కొనియాడారు.

ఇదీ చదవండిః