AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Statue of Equality: శ్రీరామనగరం దివ్యక్షేత్రంలో ‘సమతా మూర్తి’ మహా విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీ

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం దివ్యక్షేత్రంలో నిర్మించిన ‘సమతా మూర్తి’ మహా విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. 216 అడుగుల శ్రీరామానుజాచార్యుల మహా విగ్రహాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు

Statue of Equality: శ్రీరామనగరం దివ్యక్షేత్రంలో ‘సమతా మూర్తి’ మహా విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీ
Modi At Statue
Balaraju Goud
|

Updated on: Feb 05, 2022 | 9:00 PM

Share

PM Modi Inaugurates Statue of Sri Ramanunja: హైదరాబాద్(Hyderabad) పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం దివ్యక్షేత్రంలో నిర్మించిన ‘సమతా మూర్తి’ (Statue of Equality) మహా విగ్రహాన్ని ఆవిష్కరించారు. 216 అడుగుల శ్రీరామానుజాచార్యుల మహా విగ్రహాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో ముచ్చింతల్ లో ఈనెల 2 నుంచి 14వ తేదీ వరకు శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ధి సమారోహ వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోడీకి శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి, మైహోం అధినేత రామేశ్వరరావులు సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని వెంట తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులున్నారు.

ప్రధాని మోదీ.. తొలుత విశ్వక్సేనుడి పూజలో పాల్గొన్నారు.‘సమానత్వం విగ్రహం’ చుట్టూ ఉన్న వినోదాల వంటి 108 దివ్య దేశాలను కూడా ప్రధాని సందర్శించారు. శ్రీరామానుజ జీవిత విశేషాలతో కూడిన చిత్ర ప్రదర్శనను, మ్యూజియంను ప్రధాని సందర్శించారు. శ్రీరామానుజాచార్యుల జీవిత ప్రయాణం, విద్యాబోధనపై త్రీడీ ప్రెజెంటేషన్ మ్యాపింగ్‌ను కూడా ప్రదర్శించారు. నుదుటిపై విష్ణునామాలు ధరించి సంప్రదాయ పట్టువస్త్రాల్లో మోడీ సమతా స్ఫూర్తి కేంద్రానికి విచ్చేశారు. సమతా మూర్తి సహస్రాబ్ది సమారోహంలో ఆయన పాల్గొన్నారు. రుత్వికులు ప్రధాని మోడీ చేత సంకల్పం చేయించారు. చినజీయర్ స్వామీజీ ఇచ్చిన కంకణాన్ని ప్రధాని ధరించారు. యాగశాలలో మోడీ ప్రత్యేక పూజలు చేసి విష్వక్సేన ఇష్టి యాగంలో పాల్గొన్నారు. యాగశాల నుంచి ఆయన ప్రధాన ఆలయం, ఆశ్రమాన్ని సందర్శించారు.వైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్య దేశాల నమూనా ఆలయాలను సందర్శించారు. భగవద్ రామానుజుల విగ్రహాన్ని ప్రధాని మోడీ లోకానికి అర్పితం చేశారు.

యాగశాలలో చిలకల మండపం.. భరణి మండపం.. అద్దాల మండపాన్ని దర్శించిన ప్రధాని. వేద పండితుల నుంచి వాటి విశిష్టతను తెలుసుకున్నారు. ఆ తరువాత దివ్య దేశాలను సందర్శించారు. శ్రీరంగం నుంచి వైకుంఠం వరకు ..108 దివ్య తిరుపతుల్ని తిలకించారు. ఆలయ నిర్మాణ శైలి, మూల విరాట్‌.. విశిష్టతలను తెలుసుకునేలా సాంకేతిక ఏర్పాట్లను చేయడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఒక్కో దివ్యదేశాన్ని మోడీకి పరిచయం చేశారు చినజీయర్ స్వామి.

సువర్ణ మందిరాన్ని దర్శించిన మోడీ.. భగవద్రామానుజ బంగారు మూర్తికి పూజలు నిర్వహించారు. ఆతరువాత సమతా స్ఫూర్తి ప్రదాత భగవద్‌ రామానుజ 216 అడుగుల బృహాన్‌ మూర్తిని విశ్వానికి అంకితం చేశారు. ఆ తరువాత మ్యూజియం, వేదిక్‌ లైబ్రరీని సందర్శించారు. భగవద్రామానుజ లీలా నీరాజనం లేజర్‌ షోను ప్రధాని మోడీ తిలకించారు. అనంతరం ప్రదానికి మోడీకి మంగళాశాసనలు అందించారు చినజీయర్‌ స్వామి. అలాగే మైహోమ్‌ అధినేత డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు ప్రధానికి ఆత్మీయ సత్కారం చేశారు. మన రామానుజ ఆదిశేషుడి అంశ అని భావిస్తారంతా.అందుకు ప్రతీకంగా శేషతల్పంపై పద్మాసనంలో కూర్చున్న జగదాచార్య రామానుజ ప్రతిమను అందించారు.

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి స్వాగతోపన్యాసం చేశారు. దేశంలో సబ్‌కే సాత్‌..సబ్‌కా వికాస్‌ నినాదంతో దేశాన్ని ప్రధాని మోడీ ముందుకు తీసుకెళ్తున్నారని శ్రీత్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు. అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి కూడా అందర్నీ ఒకే కుటుంబంగా భావించి పరిపాలన చేశారన్నారు. చరిత్రలో శ్రీరాముడు శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రధానమంత్రి కూడా అవే గుణాలు కలిగి ఉండి, దేశ వైభవాన్ని ప్రపంచదేశాల ముందు తలెత్తి ఉండాలే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తికే సమతామూర్తి విగ్రహాన్ని ప్రారంభించే అధికారం ఉంటుంది. ఎంతో ప్రేమతో ప్రధాని మోడీ ఇక్కడికి వచ్చి.. భగవాన్‌ రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనికి మేము ఎంతో రుణపడి ఉంటామని శ్రీత్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు.

అటు ఈ అద్భుత ఘట్టంలో పాల్గొన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి.. రామానుజాచార్యుల సిద్ధాంతాలతోనే ప్రధాని మోదీ పాలన కొనసాగిస్తున్నారన్నారు. వెయ్యేళ్ల క్రితమే రామానుజాచార్యులు ప్రజలంతా ఒక్కటేనని.. దైవం ముందు అందరూ సమానులేనని చాటిచెప్పారన్నారు. ఆ స్ఫూర్తిని మనమంతా పొందాలన్నారు కిషన్ రెడ్డి.

భగవద్రామానుజుల విగ్రహ ప్రాజెక్ట్‌ లో భాగమవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు మై హోంగ్రూప్‌ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వర్‌రావు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ హాజరవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సమతామూర్తి స్ఫూర్తి నేటి తరానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. శ్రీరామానుజ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మైహోంగ్రూప్‌ ఎండీ జూపల్లి జగపతిరావు, డైరెక్టర్స్‌ రామురావు, రంజిత్ రావు, సందీప్‌రావు దగ్గరుండి పర్యవేక్షించారు.