Hyderabad: గచ్చిబౌలి యువతి మృతి కేసులో ట్విస్టు.. రూమ్‌లో…
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రముఖ హోటల్‌లో దారుణం వెలుగుచూసింది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. యువతి ఫ్రెండ్స్ ఆత్మహత్య అంటుండగా.. పేరెంట్స్ మాత్రం తమ కుమార్తెను హత్య చేశారని ఆరోపిస్తున్నారు.
గచ్చిబౌలి స్టాఫ్‌నర్స్ మృతి కేసులో షాకింగ్ అప్‌డేట్స్ వెలుగు చూస్తున్నాయి. జడ్చర్ల నుంచి రెండ్రోజుల క్రితం యువతి హైదరాబాద్ వచ్చింది. ఓ ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సుగా చేసిన మృతురాలు.. రెండు వారాల క్రితమే మానేసింది. హైదరాబాద్‌లో గణేశ్ వేడుకలను చూసేందుకు హైదరాబాద్ వచ్చినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆదివారం కాల్ చేస్తే మంచిగానే మాట్లాడిందని.. రాత్రికి ఇలా ఉరేసుకుని చనిపోయిందని చెప్పడం షాక్‌కు గురిచేస్తోందంటున్నారు పేరెంట్స్. ఆమె ఒంటిపై గాయాలున్నాయని.. ఆమెను రేప్ చేసి, అనంతరం ఉరేసి చంపేశారని ఆరోపణలు చేస్తున్నారు.
ఆదివారం రాత్రి స్నేహితులు మోనా, జీవన్ మరో అబ్బాయితో కలిసి యువతి హోటల్‌కు వెళ్లింది. అక్కడ పార్టీ జరిగినట్లు తెలుస్తోంది. హోటల్‌లో రెండు గదులు తీసుకున్నారు. ఆమె చనిపోయిన గదిలో బీరుబాటిల్స్ ఉన్నాయి. తాము నలుగురం కలిసి పార్టీ చేసుకున్నట్లు జీవన్, ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌లో చెప్పాడు. మీ కూతురు ఉరేసుకుని చనిపోయిందని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు, హోటల్ దగ్గరకు వచ్చేసరికి డెడ్‌బాడీని అంబులెన్సులోకి ఎక్కించారు. గది నిండా రక్తం మరకలు కనిపిస్తున్నాయి. తమ కూతురు ఒంటిపై గాయాలున్నాయంటున్నారు పేరెంట్స్. తాము వచ్చే వరకు డెడ్‌బాడీని స్పాట్‌లోనే ఎందుకు ఉంచలేదని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఆదివారం రాత్రి తర్వాత తామంతా హోటల్ నుంచి బయటకు వెళ్లామని… తనకు తలనొప్పిగా ఉందని తమతో రాలేదని యువతి ఫ్రెండ్స్ చెబుతున్నారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు తామంతా తిరిగి వచ్చామని.. రూమ్ లోపలి నుంచి గడియ వేసుకుని ఎంతకీ తీయలేదన్నారు. హోటల్ సిబ్బందికి చెప్పడంతో వారు మాస్టర్ కీతో తలుపు తీశారని.. అప్పుడు లోపల ఫ్యానుకు ఉరివేసుకుని కనిపించిదని యువతి ఫ్రెండ్స్ చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.