Hyderabad: భాగ్యనగరంలో కొత్త తరహా మోసం.. ఇలా చేస్తారని మీరు ఊహించలేరు
అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అలాగే మోసానికి కూడా కాదేది అనర్హం అంటున్నారు కొందరు కేటుగాళ్లు. మహానగరంలో ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో అర్థం కావడం లేదు.

Cheating: అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ(Sri Sri). అలాగే మోసానికి కూడా కాదేది అనర్హం అంటున్నారు కొందరు కేటుగాళ్లు. మహానగరంలో ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో అర్థం కావడం లేదు. తాజాగా ఓ వ్యక్తి చేసిన చీటింగ్ గురించి తెలిసి కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. బాధితులేమో లబోదిబోమంటున్నారు. నగరంలో ఓ వ్యక్తి కొత్త తరహా మోసానికి తెర తీసాడు. కిరాణా షాపులు, బట్టల షాపులు, చికెన్ సెంటర్స్ ఇలా దుకాణాలను టార్గెట్‌గా చేసుకొని మోసాలకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా(Rangareddy District) రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ గూడా బుద్వేల్ భవాని కాలనీలో శ్రీనివాస్ అనే వ్యక్తి దుకాణదారులతో పరిచయం పెంచుకుని తనకు నిత్యావసర సరకులు కావాలంటూ కొంత మొత్తం అడ్వాన్స్‌గా ఇచ్చి సరుకులు తీసుకెళ్లేవాడు. అలా తరచూ తీసుకెళ్తుండటంతో దుకాణదారులు శ్రీనివాసును బాగా నమ్మారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఒక్కో దుకాణం నుంచి లక్షల్లో సరుకులు కొనుగోలు చేశాడు. ఒక్కో షాపునుంచి దాదాపు 5 లక్షల వరకూ సరుకులు తీసుకుని చెక్ ఇచ్చి వెళ్లిపోయాడు. తీరా ఆ చెక్కు బౌన్స్ కావడంతో.. మోసపోయామని గ్రహించి దుకాణదారులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌పై 402, 406 కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.