Numaish Exhibition 2026: నేటి నుంచే నాంపల్లి ‘నుమాయిష్’ ప్రారంభం.. వారికి ఎంట్రీ పూర్తిగా ఉచితం!
84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ‘నుమాయిష్’ (Numaish) గురువారం (జనవరి 1) నుంచి మొదలవనుంది. ఫిబ్రవరి 15 వరకు అంటే మొత్తం 46 రోజులపాటు కొనసాగనుంది. సుమారు 85 ఏళ్ల చరిత్ర కలిగిన నుమాయిష్ ఎగ్జిబిషన్ కేవలం షాపింగ్ వేదిక మాత్రమే కాదు.. ఇదొక సాంస్కృతిక కూడిక. దేశ నలుమూలల నుంచి రకరకాల..

హైదరాబాద్, జనవరి 1: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ‘నుమాయిష్’ (Numaish) గురువారం (జనవరి 1) నుంచి మొదలవనుంది. ఫిబ్రవరి 15 వరకు అంటే మొత్తం 46 రోజులపాటు కొనసాగనుంది. సుమారు 85 ఏళ్ల చరిత్ర కలిగిన నుమాయిష్ ఎగ్జిబిషన్ కేవలం షాపింగ్ వేదిక మాత్రమే కాదు.. ఇదొక సాంస్కృతిక కూడిక. దేశ నలుమూలల నుంచి రకరకాల సంప్రదాయాలకు చెందిన కళాకృతులు ఇక్కడ కొలువు తీరుతాయి. ఇప్పటికే ఎగ్జిబిషన్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో 1050 స్టాళ్లు ఉండనున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్నచిన్న, మధ్య తరహా, మైక్రో ఇండస్ట్రీలకు ప్రాధాన్యమిచ్చేలా ఎగ్జిబిషన్ ఉండబోతోందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ప్రవేశ రుసుము రూ.50 ఉండనుంది. గత ఏడాది రూ.40 ఉండగా.. ఈసారి మరో 10 రూపాయలు ప్రవేశ రుసుము పెంచారు. అయితే ఐదేళ్లలోపు పిల్లలకు మాత్రం ప్రవేశం పూర్తిగా ఉచితం. జనవరి 1న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంయుక్తంగా దీనిని ప్రారంభించనున్నారు.
తొలి రోజు నుంచే అన్ని స్టాల్‌లు ప్రారంభమయ్యేలా ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు సుఖేశ్‌రెడ్డి, కార్యదర్శి బీఎన్ రాజేశ్వర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 15 వరకు మొత్తం 46 రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్‌కు ఈ ఏడాది దాదాపు 20 లక్షలకుపైగా సందర్శకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాధారణ రోజుల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఉంటుంది. శని, ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో రాత్రి 11 గంటల వరకు సందర్శనకు అనుమతి ఉంటుంది. సందర్శకుల కోసం 20కి పైగా ఫుడ్ కోర్టులు అందుబాటులో ఉంటాయి.
సందర్శకుల కోసం ఉచిత పార్కింగ్ అందుబాటులో ఉంచారు. అలాగే మెట్రో సేవలు రాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. అగ్నిప్రమాదాల నివారణకు 82 ఫైర్ పాయింట్లు, ప్రత్యేక నిఘా టవర్లు, పోలీసు అధికారులు, సిబ్బంది, సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్‌లను ఏర్పాటు చేశారు. లక్షన్నర లీటర్ల సామర్థ్యంతో కూడిన 2 నీటి ట్యాంకులు, ఫైర్ హైడ్రెంట్‌లు, రెండు ఫైరింజన్‌లు, రెండు బుల్లెట్‌లపై అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయాన్నిఎగ్జిబిషన్ సొసైటీ సుమారు 19 విద్యా సంస్థలను నిర్వహిస్తుంది. ఇందులో దాదాపు 30 వేల మంది విద్యార్థులకు చదువు, 2 వేల మంది సిబ్బంది ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




