AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్ టిక్కెట్ లొల్లి.. అజహరుద్దీన్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ ఏమన్నారంటే..

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కోసం అధికార కాంగ్రెస్‌లో పానిపట్టు యుద్దమే జరుగుతోంది. ఏకంగా అరడజను మంది బీఫామ్ కోసం క్యూకట్టారు. పార్టీ నిర్ణయం కంటే ముందే ప్రకటనలు చేయడం ఆసక్తిగా మారింది. దీనిపై టీపీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.. అదేం కుదరదు. ఇంకా ఎమ్మెల్యే టిక్కెట్ ఎవరికివ్వాలో అధిష్టానం నిర్ణయం తీసుకోలేదంటూ అజహరుద్దీన్ వ్యాఖ్యలను ఖండించారు.

Telangana: కాంగ్రెస్‌లో జూబ్లీహిల్స్ టిక్కెట్ లొల్లి.. అజహరుద్దీన్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ ఏమన్నారంటే..
Mohammad Azharuddin Bomma Mahesh Kumar Goud
Shaik Madar Saheb
|

Updated on: Jun 23, 2025 | 9:56 AM

Share

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బైపోల్ సమరం అధికార కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అకాల మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అందుకే బరిలోకి దిగేందుకు ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు మొదలుపెట్టాయి. కాంగ్రెస్ పార్టీలో మాత్రం సీటు లొల్లి ఆదిలోనే పీక్స్ కు చేరుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు కాంగ్రెస్ అభ్యర్దులు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం లాబియింగ్ మొదలుపెట్టేశారు. ఈసారి కూడా జూబ్లీహిల్స్ టిక్కెట్ నాదేనంటూ అజహరుద్దీన్ ప్రకటించేశారు. అజహరుద్దీన్ గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్దిగా మాగంటి గోపీనాథ్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి అలా కాదు గట్టిగా ప్రచారం చేస్తా, నేనే గెలుస్తానంటూ సీటు ప్రకటించకముందే స్వీట్లు పంచేస్తున్నారు. అజహరుద్దీన్ వ్యాఖ్యలపై టీపీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ అదేం కుదరదు. ఇంకా ఎమ్మెల్యే టిక్కెట్ ఎవరికివ్వాలో అధిష్టానం నిర్ణయం తీసుకోలేదంటూ అజహరుద్దీన్ వ్యాఖ్యలను ఖండించారు.

పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండాలి: మీనాక్షి

కాంగ్రెస్‌ నేతలు టికెట్‌పై ప్రకటనలు చేస్తుండటంపై తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ సీరియస్‌ అయినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని మీనాక్షి హెచ్చరించారని సమాచారం .ఇదిలా ఉంటే పీజెఆర్ కూతురు విజయారెడ్డి సైతం జూబ్లీహిల్స్ సీటు కోసం వాయువేగంతో దూసుకుపోతున్నారు. ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన విజయారెడ్డి, తన ప్రత్యర్థి దానం కాంగ్రెస్‌లోకి రావడంతో, ఆమెకు ఇప్పుడున్న ఏకైక ఆప్షన్ జూబ్లీహిల్స్. అందుకే గట్టి లాబీయింగ్ మొదలుపెట్టేశారు. తన తండ్రి చరిష్మాతో జూబ్లీహిల్స్ ఇలాకాలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా ఉండే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సీటు తనకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నేత నవీన్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. ఎంఐఎంతో కూడా సత్సంబంధాలు ఉండటంతో సీటిస్తే గెలుపు పక్కా అంటూ అధిష్టానికి హామీ ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే జూబ్లీ హిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. తాను మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, తన భార్య శ్రీదేవి యాదవ సామాజిక వర్గం కావడంతోపాటు గతంలో మేయర్‌గా చేసిన అనుభవం, గ్రేటర్ పరిధిలోని పరిచయాలతో తన గెలుపు నల్లేరుమీద నడకేనని, సీటు ఇచ్చి చూడండి అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు బొంతు రామ్మోహన్‌. మరి నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ హైకమాండ్ జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి ఇస్తుందో వేచి చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..