Andhra Pradesh: ఏపీలో మరో రెండు కొత్త పథకాలు.. ప్రభుత్వం నుంచి అకౌంట్లోకి రూ.లక్ష.. వారంలో ప్రారంభం..
ఏపీలోని మహిళలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. మార్చి 8న రెండు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనుంది. ఆ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉండటంతో రెండు పథకాలను కొత్తగా ప్రారంభించనుంది. ఈ పథకాల ద్వారా మహిళలకు రూ.లక్ష వరకు రుణం అందించనుంది.

ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త అందించింది. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వస్తోంది. దీంతో అట్టాహాసంగా సంబురాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిని పురస్కరించుకుని మహిళలకు తీపికబురు తెలిపింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం రెండు కొత్త పథకాలను ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. మహిళలకు ఆర్ధికంగా అండగా నిలిచేందుకు ఈ రెండు స్కీమ్స్ ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికే వీరి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న చంద్రబాబు సర్కార్.. ఇప్పుడు ఈ కొత్త పథకాలను తీసుకురానుంది. మహిళలకు ఆర్ధిక చేయూత అందించే ఈ రెండు పథకాల వల్ల లాభాలేంటి..? మహిళలు ఎలా లబ్ది పొందవచ్చు? ఎంతవరకు ప్రభుత్వం నుంచి సాయం పొందే అవకాశముంది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
కేవలం పావలా వడ్డీకే లోన్
డ్వాక్రా మహిళలకు భరోసా కల్పించేందుకు, ఆర్ధికంగా తోడ్పాటు అందించేందుకు రెండు కొత్త పథకాలను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఆ రెండు పథకాలే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యా లక్ష్మి. ఈ రెండు పథకాల ద్వారా మహిళలకు అర్హతను బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రభుత్వం రుణం మంజూరు చేయనుంది. ఈ రుణానికి కేవలం పావలా వడ్డీ మాత్రమే వసూలు చేయనున్నారు. నాలుగేళ్లల్లో వాయిదా పద్దతిలో ఈ రుణాన్ని మహిళలు తిరిగి చెల్లించవచ్చు. డ్వాక్రా మహిళా కుటుంబంలోని పిల్లల చదువు, పెళ్లిళ్ల కోసం ఈ రుణం ఉపయోగించుకోవచ్చు.
ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అర్హతలు
-కుటుంబంలోని పిల్లలు స్కూల్ లేదా కాలేజీలో చదువుతుంటే ఈ పథకం ద్వారా రుణం పొందవచ్చు
-కనీసం ఆరు నెలల పాటు డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా ఉండాలి
-గతంలో తీసుకున్న రుణం సక్రమంగా చెల్లిస్తూ ఉండాలి
-రుణం తీసుకున్న తర్వాత సభ్యురాలు చనిపోతే అప్పును మాఫీ చేస్తారు
-రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు అర్హతను బట్టి రుణం మంజూరు చేస్తారు
-పిల్లల అడ్మిషన్ డాక్యుమెంట్, ఫీజు చెల్లించిన స్లిప్‌లు అందించాలి
-గరిష్టంగా ఇద్దరు పిల్లల చదువు కోసం రుణం పొందే అవకాశముంది
ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం
-డ్వాక్రా మహిళ తన కుటుంబంలోని కుమార్తె పెళ్లి ఖర్చు కోసం లోన్ తీసుకోవచ్చు
-గరిష్టంగా రూ.లక్ష వరకు లోన్ పొందవచ్చు
-పెళ్లి శుభలేఖ, ఖర్చు అంచనా వివరాలు దరఖాస్తు ఫారంతో పాటు అందించాలి
-అధికారులు దరఖాస్తులు పరిశీలించి బ్యాంక్ ద్వారా రుణం మంజూరు చేస్తారు
-నేరుగా మహిళ అకౌంట్లో ఈ నగదు జమ చేస్తారు
