Bharat Gaurav Train: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల మీదుగా భారత్ గౌరవ్ ట్రైన్.. పూర్తి వివరాలు..
Bharat Gaurav Train: రైల్వే మంత్రిత్వ శాఖ దేశంలోని విశిష్టమైన ప్రదేశాలను సందర్శించేందుకు, భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే లక్ష్యంతో ‘భారత్ గౌరవ్’ రైలును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
Bharat Gaurav Train: రైల్వే మంత్రిత్వ శాఖ దేశంలోని విశిష్టమైన ప్రదేశాలను సందర్శించేందుకు, భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే లక్ష్యంతో ‘భారత్ గౌరవ్’ రైలును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) మొదటి సర్వీస్ ప్రొవైడర్‌గా నమోదు చేసుకుంది. ఐఆర్‌సిటిసి మొదటి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ సర్వీస్‌ను 2023 మార్చి18న దక్షిణ మధ్య రైల్వే నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు పేరును ‘పుణ్యక్షేత్ర యాత్ర: పూరీ – కాశీ – అయోధ్య’ యాత్రగా నామకరణం చేసారు. ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మొదలై రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లలో ఆగుతుంది. దీనికి సంబంధించి ఈ రైలు, విశేషాలను అలాగే ప్రాముఖ్యతను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్.. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే ఎజిఎం పి. ఉదయ్ కుమార్ రెడ్డి, సికింద్రాబాద్ డిఆర్‌ఎం అభయ్ కుమార్ గుప్తా, ఐఆర్‌సిటిసి గ్రూప్ జనరల్ మేనేజర్ పి. రాజా కుమార్‌తో పాటు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ఐఆర్సిటిసి నిర్వహిస్తున్న “పుణ్యక్షేత్ర యాత్ర: పూరి – కాశి – అయోధ్య” భారత్ గౌరవ్ పర్యటన అనేక చారిత్రక, పుణ్యక్షేత్రాలను ఒకేసారి సందర్శించాలనుకునే రైలు ప్రయాణీకులకు గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. ఈ యాత్ర మార్చి 18 నుంచి 26 మార్చి 2023 వరకు కొనసాగుతుందన్నారు. 8 రాత్రులు, 9 పగలు వేళల్లో సాగే ఈ పుణ్యక్షేత్ర యాత్ర పూరీ , కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాలను కవర్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటన ప్రయాణికులకు వైవిధ్యమైన, సౌకర్యవంతమైన పర్యాటక అనుభూతిని అందిస్తుందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన స్టేషన్లలో ట్రైన్ ఆగుతుందన్నారు. సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం స్టేషన్లలో దీనికి హాల్టింగ్ ఇచ్చినట్లు తెలిపారు.
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైల్వే అన్ని ఏర్పాట్లను చేసిందన్నారు. ప్రయాణ ప్రణాళికలో సరిపడే విధంగా రైలులో వసతి, ఆహారం మొదలైన సదుపాయాలను కల్పించినట్లు వివరించారు. ఈ రైలు అన్నీ రకాల వసతులతో కూడిన ప్యాకేజీతో సేవలను అందిస్తుందన్నారు. కావున ప్రయాణీకులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణం రైల్వేతోనే సాధ్యమన్నారు.
పర్యటన వివరాలు..
- పర్యటన పేరు: పుణ్య క్షేత్ర యాత్ర: పూరి-కాశీ – అయోధ్య
- వ్యవధి: 9 రోజులు
- పర్యటన ప్రాంతాలు: సికింద్రాబాద్ – పూరి – కోణార్క్ – గయ – వారణాసి – అయోధ్య – ప్రయాగ్‌రాజ్- సికింద్రాబాద్.
- రైలు ఆగే స్టేషన్లు: సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం
- సీట్ల సంఖ్య: 700 (స్లీపర్: 460, 3 ఏసీ: 192, 2 ఏసీ: 48)
సందర్శన ప్రాంతాలు:
- పూరి: జగన్నాథ దేవాలయం.
- కోణార్క్: సూర్య దేవాలయం, బీచ్.
- గయ: విష్ణు పాద ఆలయం.
- వారణాసి: కాశీ విశ్వనాథ ఆలయం, కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణా దేవి ఆలయం. సాయంత్రం గంగా హారతి
- అయోధ్య: సరయు నది వద్ద రామజన్మ భూమి, హనుమాన్‌గర్హి, హారతి.
- ప్రయాగ్రాజ్: త్రివేణి సంగమం, హనుమాన్ మందిర్, శంకర్ విమాన మండపం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..